ఇండియా సీ విజయభేరి
– నాలుగు వికెట్ల తేడాతో ఇండియా డీ జట్టుపై విజయం
– మనవ్ సుతార్ ఆల్‌రౌండ్ షో
– సమష్టిగా రాణించిన ఇండియా సీ
– మూడు రోజులకే ముగిసిన మ్యాచ్
అనంతపురం, సెప్టెంబర్ 7 (ప్రజా అమరావతి):
దులీప్ ట్రోఫీలో ఇండియా సీ జట్టు శుభారంభం చేసింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా డీపై నాలుగు వికెట్ల తేడాతో ఇండియా సీ విజయభేరిమోగించింది. ఇండియా సీ జట్టులో ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీయడంతో పాటు రెండో ఇన్నింగ్స్ కీలకమైన సమయంలో 19 పరుగులతో ఆల్‌రౌండ్ షో ప్రదర్శించిన మనవ్ సుతార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు.
*ఇండియా డీ 236 ఆలౌట్:*
ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లోని ప్రధాన మైదానంలో శనివారం ఓవర్‌నైట్ స్కోర్ 206/8తో ప్రారంభించిన ఇండియా డీ జట్టు మరో 30 పరుగులు జోడించి మిగితా రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. హర్షిత్‌రాణా 12 పరుగులు చేశారు. ఇండియా సీ బౌలర్లలో మనవ్ సుతార్ 7 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం కారణంగా ఇండియా సీ జట్టు విజయలక్ష్యం 233 పరుగులు.
*సమష్టిగా రాణించిన ఇండియా సీ:*
మొదటి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడిన ఇండియా సీ జట్టు సభ్యులు రెండో ఇన్నింగ్స్‌లో సమష్టిగా రాణించారు. ఓపెనర్లు రుతురాజ్, సాయిసుదర్శన్ మొదటి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ 48 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 46, సాయిసుదర్శన్ 5 ఫోర్లతో 22 పరుగులు చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్ జుయాల్ 47(3 ఫోర్లు, ఒక సిక్సర్), ఐపీఎల్ స్టార్ ఆటగాడు 77 బంతుల్లో 6 బౌండరీలు, సిక్సర్ సహాయంతో 44 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 35(నాటౌట్), ఇతనికి తోడుగా ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ 19 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఇండియా డీ బౌలర్లలో సరాన్ష్ జైన్ 4, అర్ష్‌దీప్ సింగ్ , అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
*ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ః* మానవ్ సుతార్‌కు ఏసీఏ త్రీమెన్ కమిటీ మెంబర్, ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డును అందించారు.
addComments
Post a Comment