*కాశీ తాళ్లు కట్టుకుంటే భక్తులైపోరు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..*
గుడివాడ (ప్రజా అమరావతి): తిరుమల లడ్డూను అపహాస్యం చేసేలా వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు. స్వామివారి విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పును ఒప్పుగా మార్చేందుకు మీడియా ముందుకొచ్చి అవాకులు, చవాకులు పేలితే చూస్తే ఊరుకోమంటూ ఎమ్మెల్యే రాము హెచ్చరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.."ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా ఎన్డీయే ప్రభుత్వంపై పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతపై ప్రజలు బాధలో ఉన్నారు. భక్తుల బాధ దేశంలో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం స్పందించింది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దాలి. కానీ తిరిగి మూర్ఖంగా మాట్లాడకూడదు. నియోజకవర్గ ప్రజలంటే భయపడి గుడివాడ రాకుండా కొడాలి నాని తిరుగుతున్నారు. చేతినిండా తాళ్లు కట్టుకుని, జుట్టు పెంచుకుంటే భక్తులైపోరు. వారి మనోభావాలకు విలువ ఇవ్వాలి. కష్టాలు, బాధలు అర్థం చేసుకోవాలి. వైకాపా ప్రభుత్వంలో ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరిగితే.. బొమ్మ చెయ్యి విరిగితే ఏం అవుతుందని అన్నారు. రథం దగ్ధమైతే మరొకటి చేయిస్తామన్నారు. దేవుడిపై భక్తి లేని వారికి హిందూ మతం చరిత్రకు ఉండే గొప్పతనం ఏం తెలుస్తుంది.
తిరుమల లడ్డూ విషయంలో అపచారం చేసిన మాజీ సీఎం జగన్‌ను కాపాడేందుకు గుంటూరు నియోజకవర్గానికి రాని కొడాలి నాని సైతం మీడియా ముందు పిచ్చికూతలు కూస్తున్నారు. మీ హయాంలో తిరుమల అపవిత్రమైంది. మీరు చేతగాని వాళ్లనే ప్రజలు భావించి గత ఎన్నికల్లో ఇంటికి పంపారు. అలాంటిది ఇప్పుడొచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 11 సీట్లు తెచ్చుకుని అసెంబ్లీకి కూడా రాకుండా తిరుగుతున్న జగన్, వైసీపీ నాయకులను ప్రజలు మర్చిపోయారు. విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్లి మంచి తారు రోడ్డు మీద జగన్ తిరిగారు. అలా చేస్తే ప్రజల బాధలు తెలుస్తాయా?. 24గంటలపాటు బాధితులకు అండగా సీఎం చంద్రబాబు వరదనీటిలోనే ఉన్నారు. వరదల సమయంలో ఆయన తీసుకున్న చర్యలకు రాష్ట్ర, దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని" అన్నారు.
addComments
Post a Comment