కృష్ణాజిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌, బెంగళూరులోని ఓ కేఫ్‌ వాష్‌రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.

 


కృష్ణాజిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌, బెంగళూరులోని ఓ కేఫ్‌ వాష్‌రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ


మహిళల భద్రత & గౌరవంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ; ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు నోటీసులు జారీ


రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం


విజయవాడ (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి 300కి పైగా ఫోటోలు, వీడియోలు తీశారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. హాస్టల్‌లోని విద్యార్థినులు కెమెరాను కనిపెట్టి ఆందోళనకు దిగడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలుర హాస్టల్‌లోని కొంతమంది విద్యార్థులు ఈ వీడియోలను కొనుగోలు చేసినట్లు, వారిలో ఒక విద్యార్థిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల ప్రారంభంలో, బెంగళూరులోని ఓ ప్రముఖ కేఫ్‌ వాష్‌రూమ్‌లోనూ రహస్య కెమెరా బయటపడింది.


మీడియాలో వచ్చిన కథనాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని జాతీయ కమిషన్ గుర్తించింది. సంబంధిత అధికార్లు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి.


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ స్టేటస్‌తో సహా ఈ అంశాలపై సవివరంగా ఒక నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికార్లు తీసుకున్న/ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో పేర్కొనాలి. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్దేశించింది.


Comments