పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు నిరోధానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులు
• దసరా తరవాత రాష్ట్రానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు
• అటవీ పరిరక్షణకు కర్ణాటక సాంకేతిక సహకారం
• ఉద్యోగాల కల్పనకు కర్ణాటక తరహా ఏకో టూరిజంపై అధ్యయనం
• రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్న ప్రభుత్వాలున్నా ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
• సమస్య సావధానంగా విని పరిష్కారానికి ముందుకు వచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు
అమరావతి (ప్రజా అమరావతి);
• విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ , కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే .
‘కర్ణాటక ప్రభుత్వం అడవుల పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడ అడవుల్లో ఒక్క చెట్టు కూలినా ఉపగ్రహ శాటిలైట్ ద్వారా కనుగొనే పరిజ్ఞానం వారి వద్ద ఉంది. ఈ సాంకేతికతను ఆంధ్రప్రప్రదేశ్ లో కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని చిత్తూరుతోపాటు మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల సమస్య ఉంది. ఏనుగుల గుంపులు పంటలు ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మదమెక్కిన ఏనుగులు గ్రామాలపై పడకుండా ఉండేందుకు కర్ణాటక వద్ద ఉన్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు పని చేస్తాయి. వాటిని రాష్ట్రానికి పంపించేందుకు కర్ణాటక ప్రభుత్వం అందించిన సహకారం ఎనలేనిద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ కర్ణాటకతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి సంబంధించి ఆరు అంశాలపై ఇరు రాష్ట్రాలు ఎంవోయూ కుదుర్చుకున్నట్టు చెప్పారు. కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తమ రాష్ట్రం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు అందిస్తున్నామని ప్రకటించారు. కుంకీ ఏనుగులు దసరా తరవాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తామని, వాటితోపాటు మావటీలు వస్తారని వెల్లడించారు.
శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అటవీ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎం.ఓ.యూ కుదుర్చుకున్న ఆనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చారు. చిత్తూరు, మన్యం జిల్లాల్లో ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏనుగుల సమస్యతో గిరిజన ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కి వివరించాను. అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను ఎలా ఎదుర్కోవాలని అన్న ప్రశ్న ఉత్పన్నమయినప్పుడు మన అటవీశాఖ ఉన్నతాధికారులు కర్ణాటక అటవీ శాఖ దగ్గర ఉన్న కుంకీ ఏనుగుల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సూచనతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపాము. విషయాన్ని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే దృష్టికి తీసుకువెళ్లగా 48 గంటల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. కర్ణాటక విధాన సౌధకి వెళ్లి ప్రజల తరఫున సమస్యను విన్నవించాము. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య ని కూడా కలిశాము. వారి తరఫున మాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. శ్రీ ఈశ్వర్ ఖండ్రే కర్ణాటకలో మాకు ఘన స్వాగతం పలకడంతోపాటు సమస్య చెప్పిన వెంటనే వారు స్పందించారు. మీరు ఇంత దూరం వచ్చారు.. మీ కోసం చేస్తామన్నారు.
• గత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందం చేసుకుంటే తరలిపోయిన ఎర్రచందనం తిరిగివచ్చేది
ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఓ ఎంవోయూ చేసుకుందాం అని శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే ప్రతిపాదించారు. దేశంలో రెండు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య ఇలాంటి ఎంవోయూలు జరగడం ఇదే ప్రథమం. మొత్తం ఆరు అంశాలపై ఎంవోయూ జరిగింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక... ఇది ఎలిఫెంట్ కారిడార్. సరిహద్దుల్లోని అడవుల నుంచి ఏనుగులు ఎక్కువగా వచ్చేస్తాయి. మనకు ఉన్న వాటికంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఆలోచన చేశాం. అందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొంటున్నాము.
ఏనుగుల సమస్యల పరిష్కారానికి మావటిలకు శిక్షణ, సామర్ధ్యం పెంచేలా ఆంధ్రప్రదేశ్ లో ఏనుగుల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మదపుటేనుగులను దారినపెట్టే వాటిని కుంకీ ఏనుగులు అంటారు. ఈ కుంకీ ఏనుగులను దసరా తర్వాత ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాల్లో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల దసరా తర్వాత ఇచ్చేందుకు అంగీకరించారు.
వీటితోపాటు మానవ, ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు కుంకీ ఏనుగుల వినియోగం దోహదపడుతుంది. ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, ఆరోగ్యం, నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ కు సహకారం పొందుతున్నాము. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఎర్రచందనం, శ్రీగంధం స్మగ్లింగ్ అడ్డుకోవడంపైనా కలసి పనిచేస్తాము. చందన స్మగ్లర్లు అక్రమ రవాణాకు సరిహద్దుల్ని వాడుకుంటున్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకుంటాం. ఈ రోజు ఎం.ఓ.యూ.లో వీటిని చేర్చాము. ఇటువంటి ఎంవోయూలు గత వైసీపీ ప్రభుత్వం చేసుకుని ఉంటే రాష్ట్రం నుంచి తరలిపోయిన ఎర్రచందనం తిరిగి వచ్చేది. అటవీ పరిరక్షణలో కర్ణాటక ఐటీ శాఖ పనితీరు ప్రశంసనీయంగా ఉంది. ఒక చెట్టు పడినా శాలిలైట్ ఇమేజ్ ద్వారా చూడగలిగే టెక్నాలజీ వారి దగ్గర ఉంది. ఈ సాంకేతికత మన రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. పెద్ద మనసుతో సహకరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంది.
రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కర్ణాటకలో ఏకో టూరిజం ద్వారా అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మాతో చర్చించారు. అక్కడ ఎకో టూరిజం పని తీరుని పరిశీలించి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తాం. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో వీటి అమలుపై పర్యవేక్షణ జరుగుతుంది. ఈ ఎంవోయూని ముందుకు తీసుకువెళ్లేందుకు స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ భీమన్న ఖండ్రే కుమారుడు, కర్ణాటక అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే కీలకంగా వ్యవహరించారు. పార్టీల పరంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. రెండు విభిన్న ప్రభుత్వాలున్నా ప్రజల అవసరాలు తీర్చే విషయంలో పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య కి, శ్రీ ఈశ్వర్ ఖండ్రే కి ధన్యవాదాలు” అన్నారు.
• ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుంది : శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే , కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి
కర్ణాటక అటవీశాఖ పర్యావరణశాఖల మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే మాట్లాడుతూ.. “కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి అటవీ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక అంశాల పట్ల ముందుకు వెళ్లడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఈ కీలకమైన ఒప్పందంలో ఆరు ప్రధాన అంశాల పట్ల దృష్టి సారిస్తాము. సమాచార మార్పిడి, వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల సమస్యకు పరిష్కారం, గిరిజనుల జీవన శైలి మెరుగుపర్చేలా శిక్షణ వంటి కీలక అంశాలు ఇందులో ఉంటాయి. ఏనుగుల సమస్య ఆంధ్రప్రదేశ్ లోని కొన్న ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. గతంలో కర్ణాటక కూడా ఈ సమస్య ఎదుర్కొంది. కుంకీ ఏనుగులతో మదపుటేనుగుల సమస్యను కర్ణాటక పరిష్కరించుకోగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సైతం కుంకీ ఏనుగులు అందించి అక్కడ సమస్య పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. సోలార్ ఫెన్సింగ్, ముందస్తు అప్రమత్త చర్యలతో పాటు కుంకీ ఏనుగులను ఈ సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తాం. ఒప్పందం మేరకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను, మావటిలను ఆంధ్రప్రదేశ్ కి అందచేయడం. దీనితో పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం.
• ఉమ్మడి కార్యాచరణతో చందన స్మగ్లర్ల ఆటకట్టు
అడవుల్లో స్మగ్లర్ల ఆటకట్టించేందుకు కర్ణాటక అత్యాధుక టెక్నాలజీ వినియోగిస్తోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ తో పంచుకుని ముందుకు వెళ్తాం. రెండు రాష్ట్రాలు శ్రీగంధం, ఎర్రచందనం స్మగ్లింగ్ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఉమ్మడిగా అరికట్టాలి. అందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అవసరం. ఉమ్మడి కార్యచరణతో దాన్ని సమస్య పరిష్కరిస్తాం. కుంకీ ఏనుగులకు సంబంధించి ఆరోగ్య, ఆహార పరిరక్షణకు రెండు రాష్ట్రాలు కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం.
ఎకో టూరిజం అంశంలో స్థానికంగా ఉండే గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారు దానిలో భాగమయ్యే ప్రయత్నం చేస్తాం. పర్యావరణాన్ని, వన్యప్రాణి రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం. ఇరు రాష్ట్రాలు ఇప్పుడు ఓ అవగాహనతో వేస్తున్న అడుగులు భవిష్యత్తులోనూ మరింత పటిష్టంగా రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరిస్తామని బలంగా నమ్ముతున్నాం. దసరా తర్వాత మావటిలతో సహా 4 కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపుతాము. తర్వాత మరికొన్ని కుంకీ ఏనుగులు ఇస్తాము” అన్నారు.
addComments
Post a Comment