అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్' ఏర్పాటు గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి.



పౌర విమానయాన రంగంలో 'దిల్లీ డిక్లరేషన్‌'కు ఆమోదం లభించినట్లు ప్రకటించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


'దిల్లీ డిక్లరేషన్‌'ను ఆమోదించిన 2వ "పౌర విమానయాన రంగంలో ఆసియా-పసిఫిక్ మంత్రి మంత్రివర్గ సదస్సు" 


భారతదేశంలో, పైలట్లలో 15% మంది మహిళలు ఉన్నారు. ప్రపంచ సగటు 5% కంటే ఇది ఎక్కువ: ప్రధాని


దేశాభివృద్ధిలో విమానయాన రంగ రహిత పరిస్థితి నుంచి విమానయాన రంగ సహితంగా భారత్‌ మారింది: ప్రధాని


'అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్' ఏర్పాటు గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి


పౌర విమానయాన రంగం ద్వారా ప్రజలు, సంస్కృతి, శ్రేయస్సును అనుసంధానించడంపై దృష్టి పెట్టాం: శ్రీ మోదీ


విజయవాడ (ప్రజా అమరావతి);


2వ "పౌర విమానయాన రంగంలో ఆసియా-పసిఫిక్ మంత్రి మంత్రివర్గ సదస్సు" ఈ రోజు 'దిల్లీ డిక్లరేషన్‌'కు ఆమోదం లభించడంతో ముగిసింది. 'దిల్లీ డిక్లరేషన్‌'ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించడంతో రెండు రోజుల సదస్సు ముగిసింది.


2 రోజుల సదస్సులో 29 దేశాల మంత్రులు, విధానకర్తలు, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ‍(ఐసీఏవో) సహా 8 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా, ఐసీఏవో తన 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఐసీఏవో సహకారంతో, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 11, 12 తేదీల్లో సదస్సును విజయవంతంగా నిర్వహించింది. పౌర విమానయానంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో మరిన్ని అవకాశాలను సృష్టించడానికి మంత్రులు, పౌర విమానయాన సంస్థల అధిపతులు, ముఖ్య వాటాదార్లను ఈ ఉన్నత స్థాయి సమావేశం ఒకచోటకు చేర్చింది.


ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగం సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని, ఈ సమావేశంలో అనేక చర్చలు & ప్రదర్శనలు నిర్వహించారు. విమానయాన రంగంలో ప్రాంతీయ సహకారాన్ని పెంచుకోవచం, పెరుగుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు స్థిరమైన వృద్ధిని పెంచే లక్ష్యంతో రూపొందించిన 'దిల్లీ డిక్లరేషన్‌'ను అధికారికంగా ఆమోదించడం ఈ సదస్సులో ఒక కీలక మైలురాయి.


పౌర విమానయాన రంగంలో భారతదేశం సాధించిన సాంకేతికత & మౌలిక సదుపాయాల పురోగతి గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ రంగాన్ని మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. “భారతదేశంలోని పైలట్లలో 15% మంది మహిళలు ఉన్నారు, ఇది ప్రపంచ సగటు 5% కంటే ఎక్కువ. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం ఒక సలహాను జారీ చేస్తుంది” అని అన్నారు.


గత పదేళ్లలో భారతదేశ విమానయాన రంగంలో వచ్చిన మార్ప గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. దేశాభివృద్ధి విషయంలో విమానయాన రంగ రహితంగా కాకుండా సహితంగా పరిస్థితి మారిందని వెల్లడించారు. భారత్‌లో పౌర విమానయాన రంగం కీలక పాత్ర గురించి వివరిస్తూ, ఈ రంగం ద్వారా ప్రజలు, సంస్కృతి, శ్రేయస్సును అనుసంధానించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.


ఆసియావ్యాప్తంగా బుద్ధ భగవానుడికి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలను అనుసంధానం చేస్తూ ‘అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్’ను రూపొందించగలిగితే, అది పౌర విమానయాన రంగానికి, ప్రయాణికులకు, సంబంధిత దేశాలకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.


పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్‌ నాయుడు ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు. 'ఏక్ పేడ్‌ మా కే నామ్' ప్రచారం, ICAO 80వ వార్షికోత్సవం జ్ఞాపకార్థం 80 వేల మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో సమగ్రత & సుస్థిరత విషయంలో ప్రధాన మంత్రి నిబద్ధత స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రధాని దార్శనికత్వంలో, 2047 నాటికి భారత్‌లో 350-400 విమానాశ్రయాలు ఉండాలన్న లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇది, ప్రపంచ విమానయానంలో భారత్‌ను కీలక కేంద్రంగా ఉంచుతుందన్నారు. ప్రపంచ స్థాయి సహకార ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా భారత్‌ నాయకత్వం కూడా వహించగలదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెప్పారు. భారతదేశం కోవిడ్-19 మహమ్మారి సమయంలో పోషించిన కీలక పాత్రే దీనికి ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఆసియా, పసిఫిక్ వ్యాప్తంగా కరోనా టీకాలను పంపిణీ చేయడం ద్వారా ‘ఒకే ప్రపంచం, ఒకే గ్రహం, ఒక భవిష్యత్తు, ఒకే కుటుంబం’ పట్ల తన నిబద్ధతను భారత్‌ బలంగా చాటుకుందని వెల్లడించారు.


ICAO కౌన్సిల్ ప్రెసిడెంట్ సాల్వటోర్ మాట్లాడుతూ, “మా ప్రాథమిక ప్రాధాన్యత గరిష్ట స్థాయి భద్రత & రక్షణను కొనసాగించడం. సానుకూల గణాంకాలను చూసి సంతృప్తి చెందకుండా, విమానయాన రంగంలో మౌలికాంశాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి" అని చెప్పారు.


విమానయాన రంగం భద్రత నుంచి ఆకాశయానం వరకు; రక్షణ నుంచి హరిత విమానయానం వరకు, పలు కీలకాంశాలపై జరిగిన చర్చల్లో తాను భాగం కావడం పట్ల పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ సంతోషం వ్యక్తం చేశారు.


అగ్రశ్రేణి పౌర విమానయాన దేశాల నుంచి అంతర్జాతీయ సంస్థలు & అంకుర సంస్థల వరకు, అందరితో సహకార విధానం మాత్రమే భవిష్యత్‌కు మంచి మార్గం చూపగలదని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఉమ్‌లున్‌మాంగ్ ఉల్నామ్ స్పష్టం చేశారు.


విమానయాన రంగంలో సమస్యలు ఎదుర్కోవడంలో చిన్న దేశాలకు మద్దతు ఇచ్చేందుకు "పసిఫిక్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ లైజన్ ఆఫీస్" ఏర్పాటుపై ICAO ఇచ్చిన ప్రదర్శన సహా ఈ సదస్సు చివరి రోజున చాలా కీలకాంశాలు చర్చకు వచ్చాయి. పౌర విమానయానానికి సంబంధించిన 'ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ డిక్లరేషన్ ముసాయిదా'ను (దిల్లీ డిక్లరేషన్‌) సదస్సులో సమర్పించారు, చర్చించారు, అధికారికంగా ఆమోదించారు. అదనంగా, ICAO 80వ వార్షికోత్సవం & చికాగో కన్వెన్షన్ జ్ఞాపకార్థం ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. గత ఎనిమిది దశాబ్దాలుగా అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలను రూపొందించడంలో ఈ సంస్థ నిర్వహించిన పాత్రను, చేసిన కృషిని ఆ ప్రదర్శన వివరించింది.


Comments