విజయవాడ (ప్రజా అమరావతి);
విద్యాధరపురం డిపో సందర్శించిన సంస్థ ఎం.డి.
శ్రీ సిహెచ్.ద్వారకాతిరుమలరావు, ఐ.పి.ఎస్.
ఈ రోజు అనగా తేది 08.09.2024 న సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకాతిరుమలరావు, ఐ.పి.ఎస్. డీజీపీ & ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, IPS ., ఈ రోజు APSRTC విధ్యధరాపురం సెంట్రల్ హాస్పిటల్, మందుల స్టోరేజీ విభాగం, బస్సు డిపో, ట్రాన్స్ పోర్ట్ అకాడెమీ, జోనల్ స్టోర్స్, TYRES విభాగం, మరియు స్క్రాప్ యార్డు ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్ధితులను గమనించి, సంబందిత అధికారులకు తగిన సూచనలు జారీ చేసారు.
. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యా ధరపురం డిపో పూర్తిగా నీట మునిగి ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. దీనిలో భాగంగా నేడు ఎం.డి. డిపో సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
నడవడానికి వీలుగా లేకపోవడంతో అధికారులు ఏర్పాటు చేసిన బస్సులో వెళ్ళి నీట మునిగిన బస్సులను, గ్యారేజిని,స్క్రాప్ యార్డ్ ని స్వయంగా వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని NDRF బృందాలు, ఆక్టోపస్, ఫైర్ సిబ్బంది, గ్రే హౌండ్స్, SDRF అందరినీ సమన్వయ పరచడం జరిగిందని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం వరద బాధితులకు తోడుగా ఉందని తెలుపుతూ పని చేయడం జరుగుతుందని వివరించారు.
అంతేకాకుండా వరద బాధిత ప్రాంతాల్లో చాలా మంది నీళ్ళల్లో మరియు బురదలో నడుచుకుని వెళ్ళడం గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించిన మీదట వారికోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయమని ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు వారిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఈ బస్సులు విజయవాడ సిటీలో రోజుకు 594 ట్రిప్పులు వేసి 18 వేల మందిని తరలించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రిస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడం జరిగిందని వివరించారు. ఈ విధంగా వరద బాధితుల కోసం ఆర్టీసీ మరియు పోలీసు డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితుల్లో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఇక ఆర్టీసీ విషయానికి వస్తే కొన్ని హృదయ విదారక సంఘటనలు చోటుచేసుకున్నాయని కొన్ని డిపోలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యాధరపురం డిపోలో 41 కొత్త బస్సులు లోపల ఉన్నాయని, అవి ఏ విధంగానూ డ్యామేజీ కాలేదని, మరలా ఒకసారి వాటన్నింటికినీ పూర్తీ స్థాయిలో పరిక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా వర్క్ షాప్, టైర్ రీట్రేడింగ్ సెంటర్ కూడా నీట మునిగాయని తెలిపారు.
ముఖ్యంగా సెంట్రల్ హాస్పిటల్ మునిగి ఉద్యోగుల కోసం నిల్వ ఉంచిన అనేక రకాల మందులు పాడై పోయి చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వీటితో పాటు ట్రాన్స్ పోర్ట్ అకాడమి, న్యూ వెహికల్ స్టోరేజి యార్డ్, జోనల్ స్టోర్స్ విభాగాలలో కూడా బాగా నీరు చేరడం వలన నష్టం పెద్ద సంఖ్యలో ఏర్పడిందని ఈ పరిస్థితికి డీలా పడకుండా అక్కడి అధికారులకు ధైర్యం చెప్పడం కూడా జరిగిందని తెలిపారు.
ఏది ఏమైనా ఈ వరదల వలన ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో నివసించే ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా నష్ట పోయారని వివరించారు. కొన్ని చోట్ల ఆర్టీసీ కార్యాలయాలు, బస్సులు దెబ్బతిన్నాయని వీటి నష్టం అంచనా వేస్తున్నామని ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకాతిరుమలరావు, ఐ.పి.ఎస్. తెలిపారు. ఆర్టీసీ సంస్థ చాలా పెద్ద సంస్థ అని, వీలైనంత తొందరగా ఈ కష్ట పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా సంస్థ ముందుకెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ఆర్మీ, మిలిటరీ సిబ్బంది మాదిరి ఆర్టీసీ కూడా తనవంతు సేవలు కూడా ప్రజలకు అందిస్తున్నదని వివరించారు.
ఈ సందర్శనలో ఎం.డి.గారితో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి (అడ్మిన్), శ్రీ జీవి రవి వర్మ (ఇంజినీరింగ్), శ్రీ చంద్ర శేఖర్ (ఆపరేషన్స్) మరియు జోన్ 1 ఈడీ గోపీనాథ్ రెడ్డి, మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎం.వై.దానం, తదితర అధికారులు , విద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment