ఎన్‌టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 07, 2024 (ప్రజా అమరావతి);
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు...*
*భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపించాం
*
- తొలి నివేదిక ద్వారా కేంద్రాన్ని రూ. 6,880 కోట్లు అడిగాం.
- బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చిన ఈరోజు చారిత్రక దినం.
- ప్రభుత్వ చర్యలను ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం కూడా ప్రశంసించింది..
- బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
- గత ప్రభుత్వం విధ్వంసాలు సృష్టించింది..
- వారి పాపాలే ఈ రోజు ప్రజలకు శాపాలుగా మారాయి.
- విద్వేష చర్యలకు పాల్పడిన ఎవరైనా సరే ప్రజాజీవితంలో, రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు.
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
వినాయక చవితి రోజు ఓ చారిత్రక దినం. మనవారి పరితీరును ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం కూడా ప్రశంసించింది. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ అక్కడే ఉండి.. ప్రత్యేకంగా దృష్టిసారించి బుడమేరు గండ్లను పూడ్చే పనిని పూర్తిచేయగలిగారు. దీనివల్ల నీరు రావడం ఆగింది. ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగింది. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. ఒక్క డ్రెయిన్ రిపేర్ చేయలేదు. ఒక్క ప్రాజెక్టులోనూ గేట్లను కూడా సరిగా నిర్వహించలేదు. వ్యవస్థలను నాశనం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా, రెండుసార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, పులిచింతల గేట్లు పోయినా మెయింటెనెన్స్‌కు ఒక్క పైసా కూడా పెట్టలేదు. బుడమేరుకైతే అయిదు వర్క్‌లు మంజూరు చేస్తే వాటిని కూడా వదిలేశారు. మరోవైపు బుడమేరు మొత్తం ఎక్కడ చూసినా కబ్జాల మయమైంది. ఇష్టానుసారం ఇళ్లనుకట్టేశారు. ఎక్కడికక్కడ నీళ్లు బ్లాక్ అయిపోయాయి. గతంలో భారత ప్రభుత్వం స్టార్మ్ వాటర్ డ్రెయిన్ కోసం ఇచ్చిన రూ. 500 కోట్లలో దాదాపు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాం. మిగిలిన డబ్బులున్నాయి. వాటిని ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలూ కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఈ రోజు ఏడోరోజు చాలా బాధేస్తోంది. చాలా ప్రాంతాల్లోని ప్రజలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఈరోజు న్యూ రాజరాజేశ్వరిపేటకు వెళ్లాను. ఆ ప్రాంతంలో ఇప్పటికీ నాలుగు అడుగుల నీరు ఉంది. ఆవేశం ఉంది.. బాధ ఉంది.. వారికి మాపై నమ్మకముంది. ఆ నమ్మకమే మా బాధ్యతను పెంచే పరిస్థితికి వచ్చింది.
*బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం:*
బుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈ రోజు మళ్లీ వర్షం పడింది. దీంతో నీళ్లు పెరిగాయి. ఇన్‌ఫ్లో ఆగింది. అవుట్‌ఫ్లోను పెంచాం. అయితే వర్షంవల్ల పెరిగింది. రేపటికి సంబంధించి ఈసీఎండబ్ల్యూఎఫ్ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీల నీళ్లు వస్తాయని.. అదేవిధంగా విజయవాడకు 0.09 టీఎంసీల నీళ్లు వస్తాయని అంచనా ఉంది. ఈ పరిస్థితులే తలెత్తితే మనం మేనేజ్‌చేసుకోవచ్చు. ఐఎండీ ప్రకాం బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీల నీళ్లు వస్తాయని అంటున్నారు. ఈ పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలనేదానిపై ఇప్పటి నుంచే పనిచేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు. ఎత్తు పెంచుతున్నారు. ఇందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. సిటీకి కూడా 0.37 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. నేను ఈరోజు ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలు ఒకటే అడిగారు. మేము నిద్రలేని రాత్రుళ్లు గడిపాం. మీరు ఎలాగైనా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపమని అడిగారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తాం.
*మొత్తం 66,454 మందికి రేషన్‌న్ చేర్చగలిగాం...*
ఈ రోజు కేంద్రానికి వరద నష్టంపై మొదటి నివేదికను పంపాం. దీనిప్రకారం రూ. 6,880 కోట్లు అడిగాం.
ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ను 4,17,080 మందికి పంపాం. లంచ్‌ను 2,95,970 మందికి, డిన్నర్ 1,47,300 మందికి పంపించాం. అదే విధంగా నీటి బాటిళ్లను, పాలను, బిస్కట్ ప్యాకెట్లు, క్యాండిళ్లు, అగ్గిపెట్టెలు కూడా పంపించాం. ఈరోజు 46,454 మందికి రేషన్ ఇచ్చారు. మొత్తం 66,454 మందికి రేషన్‌న్ చేర్చగలిగాం. నిత్యావసర సరుకులు పొందేందుకు ఆధార్ కూడా అవసరం లేదు. ఫింగర్ ప్రింట్, ఐరిస్ చాలు. మేము చాలాకష్టపడి మీకు పంపిస్తున్నాం. ఎవరైనా మోసం చేస్తే చొక్కాపట్టుకొని తీసుకోండి. మా అధికారులు ఎక్కడా ఇలాంటి పనిచేయరు. కానీ.. మెకానిజంలో చివరి మైలులో ఎవరైనా కక్కుర్తిపడినా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. డ్రై ఫుడ్ కూడా పంపిస్తున్నాం. ఇదికూడా డిమాండ్ చేసి తీసుకోవాలి. కూరగాయలైతే మొత్తంమీద 61 వేల కిలోల కూరగాయలు, ఆకుకూరలు అమ్మారు. ఇప్పటికి ఫైర్ ఇంజిన్లతో 15,470 ఇళ్లను క్లీన్ చేయడం జరిగింది. 110 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. రోడ్లను కూడా క్లీన్ చేయడం జరుగుతోంది. పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. 184 వైద్య శిబిరాలు పనిచేస్తున్నాయి. ఈ శిబిరాల ద్వారా ఇప్పటికి 67,706 మందికి సేవలందించారు.
*కాస్తా ఖర్చయినా సరే ఇంటింటికీ నిత్యావసర సరుకులు చేర్చుతాం:
ఈరోజు కూడా 104 ఎన్‌డీఆర్ఎఫ్, 15 ఎస్‌డీఆర్ఎఫ్, 39 ఫిషరీస్ బోట్లు కూడా పనిచేస్తున్నాయి. 42 డ్రోన్లు పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్లను ఆహార పంపిణీకి, సర్వైలెన్స్‌కి, స్ప్రేయింగ్‌కి పనిచేస్తున్నాయి. 834 వాహనాలు రోజూ పనిచేస్తున్నాయి. వీటికి తోడు నిత్యవసర సరుకులను ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేకంగా 1200 వాహనాలు పనిచేస్తున్నాయి. ప్రజాభిప్రాయం మేరకు వ్యయప్రయాసలకోర్చి ఇంటింటికీ నిత్యావసర సరుకులను చేరవేస్తాం. మరోవైపు 28 మంది మరణించారు. 26 మందికి సంబంధించి సెటిల్‌మెంట్ కూడా చేశాం. ఇప్పటివరకు 71 పశువుల కళేబరాలను డిస్పోజ్ చేశాం. వివిధ మార్గాల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ఈరోజు చూస్తే ఆహార నాణ్యతకు సంబంధించి 71 శాతం మంది బాగుందన్నారు. శానిటేషన్ వర్క్‌లు అయితే 61 శాతం మంది బాగుందన్నారు. విద్యుత్ సరఫరా బాగుందని 83.5 మంది బాగుందన్నారు. నీటి సరఫరా 84 శాతం మంది బాగుందన్నారు. శానిటేషన్‌ను ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అంటువ్యాధులు ప్రబలకుండా ఎక్కువ శ్రద్ధపెడుతున్నాం. ఎంత డబ్బయినా ఫర్యాలేదు.. ప్రజలు ఎక్కడా ఇబ్బందిపడకూడదనేది మా ఆలోచన. ప్రజలకు అవసరమైన ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ తదితరుల సేవలను అందించేందుకు కృషిచేస్తున్నాం. పేదవారిపై భారంపడకుండా సేవలందించేలా చూస్తున్నాం.
అయితే అర్బన్ కంపెనీ పరిధిలో విజయవాడలో తక్కువమంది ఉన్నారు. మనం ట్రైన్ చేసిన వారు 500 మందివరకు ఉన్నారు. వీరిని కూడా పిలిపించి.. అర్బన్ కంపెనీతో అనుసంధానించాం. ఇంకాఅవసరమైతే మరికొందరు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి వారిద్వారా సేవలందేలా చేస్తాం. అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చయినా సరే పేదవారిపై భారం పడకుండా సేవలందించేలా చూస్తాం. ఇదో వినూత్న కార్యక్రమం. దీనివల్ల చాలాసమస్యలు పరిష్కారమవుతాయి. రెండు లక్షల ఇళ్లలో 1,40,000 ఇళ్లు డౌన్ ఫ్లోర్‌లో ఉన్నాయి. ఇవన్నీ తడిసిపోవడం, వస్తువులు, ఫర్నిచర్ వంటివన్నీ పాడయ్యాయి. ఈ ఇళ్లకు చాలామంది అవసరమవుతారు. ఉపాధి కల్పించేందుకు వర్చువల్ వర్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తాం. అదేవిధంగా డిజిటల్ సాధికారత శిక్షణ ఇస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన నిర్ణయాలు తీసుకొని, అమలుచేసేందుకు కృషిచేస్తాం.
*సోమవారం నుంచి నష్ట గణన ప్రక్రియ:*
వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం నుంచి నష్ట గణన ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఇందుకోసం బయటినుంచి ఎన్యూమరేటర్స్‌ను పిలిపించాం. వారందరికీ ఆదివారం శిక్షణ ఇస్తాం. ఇళ్లు, దుకాణాలు.. ఇలా అన్నింటినీ ఎన్యూమరేట్ చేసి నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు వీలైనంత వరకు న్యాయం చేస్తాం. వారం రోజుల్లో ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్స్ పూర్తయ్యేలా చేస్తాం. ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడానికి కార్యక్రమాలు చేపడుతోంది. చాలామంది బురదలో ఉండిఉండి మానసికంగా ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. వీరు బయటకు వెళ్లడంవల్ల ఆందోళన కొంత తగ్గుందని భావించి ఉచితంగా బస్సు సర్వీసులు కూడా నడుపుతున్నాం. ఎన్నివిధాలా ప్రయత్నించాలో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇంకా ఏవైనా సలహాలు వస్తే వాటిని కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు వార్డు నెం.45లోని కోవెల్ అపార్ట్‌మెంట్ అసోసియనేషన్ వారు రెండు లక్షల 21 వేల 116 రూపాయలు విరాళం అందించారు. బాధితులు కూడా ముందుకొచ్చి సహాయమందిస్తున్నారు.
బాధితులకు అందరూ సమష్టిగా అండగా నిలవాల్సిన ఈ పరిస్థితిలో ప్రజా విద్వేష చర్యలకు పాల్పడిన ఎవరైనా సరే ప్రజాజీవితంలో, రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు.
addComments
Post a Comment