వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకువస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
క్యాబ్ సర్వీస్, బస్సు సర్వీస్ పెంచాలని సూచన
విజయవాడ (praja amaravati):విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయంలో శనివారం ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపి వల్లభనేని బాలశౌరి తో కలిసి ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రయాణీకుల అవసరాల దృష్టిలో పెట్టుకుని కల్పించాల్సిన సదుపాయాలతో పాటు ముఖ్యంగా కొత్త టెర్మినల్ నిర్మాణం పనులు మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమీక్ష సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన విమాన సర్వీసులన్నీ ఫుల్ ఆక్యుఫెన్సీతో నడుస్తున్నాయని తెలిపారు. అలాగే దేశంలోని పుణ్యక్షేత్రాలు , వాణిజ్య నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటి కమిటీకి లెటర్ రాయటం జరిగిందన్నారు. పోలీస్ శాఖ , రెవెన్యూ శాఖ సంయుక్తంగా కొత్త టెర్మినల్ లో వున్న సమస్యలపై సమీక్ష జరిపి పరిష్కరిస్తారని చెప్పారు.
అలాగే విమానాశ్రయంలో ప్రయాణీకుల సౌకర్యార్థం క్యాబ్ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్యాబ్ సర్వీస్ లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చే నాటికి ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణీకులకి క్యాబ్ సర్వీసు అందుబాటులో తీసుకురావాలని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డికి సూచించారు. అలాగే ప్రజల సౌకర్యం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపే విధంగా కృషి చేయాలన్నారు.
అమరావతి రాజధానిలో వున్న ఏకైక విమానాశ్రయ అభివృద్ది పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు పెరగటంతో పాటు కనెక్టవిటీ పెరిగిందన్నారు. జూన్ తర్వాత అందుబాటులోకి వచ్చే కొత్త టెర్మినల్ ప్రయాణీకుల అవసరాల తీర్చటమే కాకుండా..విదేశాల నుంచి రాబోయే అతిథులు మెచ్చే విధంగా వుండబోతున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో విజయవాడ విమానాశ్రయాన్ని దేశం లోనే మొదటి పది విమానాశ్రయాల్లో ఒక్కటిగా తీర్చి దిద్దటమే లక్ష్యం గా ముందుకు సాగుతున్నట్లు ఎంపీ కేశినేని శివ నాథ్ తెలిపారు.
అంతకుముందు ఏఏసీ చైర్మన్, ఎంపి బాలశౌరి మాట్లాడుతూ కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశాలివ్వటం జరిగిందన్నారు. అలాగే పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే విషయం కూడా చర్చించినట్లు తెలిపారు. విమానాశ్రయంలో తాగునీటి సమస్య వుంది..ఆ సమస్యను తీర్చేందుకు కృష్ణ, గోదావరి నీళ్లు తెచ్చే అంశం కూడా చర్చించినట్లు చెప్పారు. ఇక్కడ నుంచి దుబాయ్ కి ఎమిరెట్స్ విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కోరటం జరిగిందన్నారు.2029 నాటికి విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి న్యూయార్క్ కి డైరెక్ట్ ప్లైట్ సర్వీసు ప్రారంభించాలనే ఆశయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా కలెక్టర్ బాలాజీ, కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ , కమిటీ సభ్యులు
బాలగంగాధర్, పొట్లూరి బసవరాజు, ముప్పా గోపాల కృష్ణ, షేక్ మొహీద్దీన్, జోగులాంబ, పుట్టుగుంట వెంకట సతీష్ లతోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment