ఆర్టీసీ హౌస్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.

 విజయవాడ (ప్రజా అమరావతి);



ఆర్టీసీ హౌస్ లో మహర్షి  వాల్మీకి జయంతి వేడుకలు


ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) శ్రీ టి. చంగల్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు. 

అనంతరం ఛీఫ్ మేనేజర్ (పర్సనల్) శ్రీ స్వరూపానంద రెడ్డి, డిప్యూటి సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) కుమారి  సామ్బ్రాజ్యం, విజిలెన్స్ ఏ.డి. శ్రీమతి శోభా మంజరి, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు,ఉద్యోగులు శ్రీ వాల్మీకి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) శ్రీ టి. చంగల్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి గొప్ప కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఈ విధంగా కీర్తించుకోవడం సంతోషదాయకమని, కుటుంబ విలువలను, గొప్పతనాన్ని తెలియజేసే రామాయణం రచించిన గొప్ప ఋషి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకునే అవకాశం కలగడం ఆనందదాయకమని పేర్కొన్నారు. 

వాల్మీకి ఇచ్చిన “మార్పు” అనే  సందేశాన్ని అందరూ గ్రహించి మన సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు.  వాల్మీకి రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తిగా నిలిస్తోందని, రామాయణ  గ్రంథం గొప్ప ఇతిహాసమని ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శమని తెలిపారు. 

వాల్మీకి స్పూర్తితో మార్పుకి స్వాగతం పలికి ప్రతి ఒక్కరూ ముందుకెళ్తే సంస్థ అభివృద్ధి సాధిస్తుందన్నారు. 

డిప్యూటి సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) కుమారి సామ్బ్రాజ్యం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొని, క్లుప్తంగా మహర్షి వాల్మీకి గురించి వివరించారు. త్రేతా యుగం నాటి శ్లోకాలు వినిపించి, అప్పటి నుండి ఇప్పటి వరకూ అజరామరంగా రామాయణ మహా కావ్యం నిలిచిపోయిందన్నారు. ఉత్తమ కుటుంబ విలువలు అంతర్లీనంగా తెలియ జెప్పిన మహా ఇతిహాసం రామాయణాన్ని 24 వేల శ్లోకాలతో, 7 కాండాలుగా, 4 లక్షల 80 వేల పదాలతో శ్రీ వాల్మీకి మహర్షి  రచించారని,  ఆయన గొప్పతనం ప్రతి తరం వారు గుర్తించుకోవాలని  వివరించారు. రామాయణ గ్రంథం మన దేశం లోనే కాకుండా విదేశాలలో సైతం ప్రాముఖ్యత కలిగినదని, ఎంతో విశిష్టతతో ప్రపంచ దేశాలకూ ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలకు, సమాజానికి ఈ గ్రంధం ఒక దిక్సూచిలా నిలుస్తుందని కొనియాడారు.  భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  ఛీఫ్ మేనేజర్ (పర్సనల్) శ్రీ స్వరూపానంద రెడ్డి, విజిలెన్స్ ఏ.డి. శ్రీమతి శోభా మంజరి, డిప్యూటీ సి.టి.ఎం. (పి.ఎన్.బి.ఎస్.) శ్రీ ఎన్. శ్రీనివాస రావు, ఆర్టీసీ హౌస్ ఉన్నతాధికారులు, హెచ్.ఓ.డి.లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఆర్టీసీ హౌస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments