సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలి ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.

 

అమరావతి (ప్రజా అమరావతి);


  పల్లెపండుగ- పంచాయతీ వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 14 – 20, 2024 తేదీల్లో  13,326 గ్రామ పంచాయతీల్లో  భూమి పూజ చేసిన ఉపాధి హామీ పనులన్నింటిని సంక్రాంతి పండుగ లోపే పూర్తి చేయాలని, పనులు వేగవంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తద్వారా గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్  అధికారులను ఆదేశించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొదలుపెట్టిన  సిసి రోడ్లు, బిటి రోడ్లు, సిసి డ్రైయిన్లు, స్కూల్ ప్రహరీ గోడలు, నూతన ఊటకుంటలు, ఇంకుడు గుంతలు, ఫారంపాండ్లు, గోకులాలు తదితర 30 వేల పనులను అత్యున్నత  నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడేదిలేదని, ఎప్పటికప్పుడు  క్వాలీటీ కంట్రోల్ అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు.

Comments