విశాఖపట్నంలోని ఏఎంటీజెడ్ ప్రాంగణంలో 'నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్' ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌధరి
మంత్రి సమక్షంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు
విజయవాడ (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి లోటును తక్షణం భర్తీ చేయడానికి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి విశాఖపట్నంలోని 'ఆంధ్ర మెడికల్ టెక్ జోన్' (ఏఎంటీజెడ్) ప్రాంగణంలో కొత్త 'నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్' (ఎన్‌ఎస్‌టీఐ) ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ఈ రోజు ప్రారంభించారు. అభ్యర్థులతోనూ మంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని చెప్పారు.
'ఎక్స్‌టెన్షన్ సెంటర్ క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్' (సీఐటీఎస్) కింద, ఈ ఎక్స్‌టెన్షన్ సెంటర్ 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో (సీఎస్‌ఏ) శిక్షణను అందిస్తుందని శ్రీ జయంత్ చౌధరి వెల్లడించారు. 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్' (డీజీటీ) అమలు చేస్తున్న 'అడ్వాన్స్‌డ్ ఒకేషనల్ ట్రైనింగ్' పథకం కింద వివిధ కంప్యూటర్ అప్లికేషన్‌లపైనా స్వల్పకాలిక కోర్సులను కూడా ఈ కేంద్రం అందిస్తుంది. నైపుణ్యాభివృద్ధి, స్థానిక శ్రామిక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక అడుగుగా మారుతుంది.
ఏఎంటీజెడ్ ప్రాంగణంలో ఉన్న ఎన్‌ఎస్‌టీఐ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూటర్ ల్యాబ్, ఆధునిక తరగతి గదులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల అభ్యర్థులకు ఏఎంటీజెడ్ ఉచితంగా హాస్టల్ సౌకర్యం అందిస్తోంది, విద్యార్థులందరికీ భోజన సౌకర్యం కూడా కల్పిస్తోంది.
ఎన్‌ఎస్‌టీఐ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటులో మద్దతుగా నిలిచినందుకు శ్రీ చౌధరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "రాష్ట్ర యువతకు మెరుగైన జీవనోపాధి కోసం మెరుగైన అవకాశాలు సృష్టించడంలో ఇది సాయపడుతుంది" అని చెప్పారు.
దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, ఆ మహనీయుడికి శ్రీ చౌధరి నివాళులు అర్పించారు. దేశంలో విజ్ఞానశాస్త్రాన్ని, విద్యను పెంచడంలో డాక్టర్ కలాం అందించిన గొప్ప సహకారాన్ని గుర్తు చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా యువతకు సాధికారత కల్పించవచ్చన్న కలాం దూరదృష్టి ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
ఎన్‌ఎస్‌టీఐ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు ఉపాధిని పెంచడంలో కీలకంగా మారుతుంది.
ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఎలాంటి అంతరాయాలు లేకుండా నడిచేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఏఎంటీజెడ్ ఎండీ డా.జితేంద్ర శర్మ చెప్పారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ శ్రీమతి త్రిషల్‌జిత్ సేథీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, అవిభక్త రాష్ట్రంలో మూడు ఎన్‌ఎస్‌టీఐలు పని చేస్తున్నాయి. అవి - ఎన్‌ఎస్‌టీఐ విద్యానగర్, ఎన్‌ఎస్‌టీఐ రామంతాపూర్, ఎన్‌ఎస్‌టీఐ ఫర్ ఉమెన్. రాష్ట్ర విభజన తర్వాత అవన్నీ తెలంగాణ సొంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ కొత్త ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది.
addComments
Post a Comment