బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానును ఎదుర్కొనే ఏర్పాట్లను సమీక్షించిన "జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ"
విజయవాడ (ప్రజా అమరావతి);
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానును ఎదుర్కొనే సంసిద్ధతపై "జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ" (ఎన్‌సీఎంసీ) సమీక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి డా. టీవీ సోమనాథన్ సారథ్యంలో సమావేశం జరిగింది.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుత పరిస్థితి గురించి కమిటీకి వివరించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా మారొచ్చు. అక్టోబర్ 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాతరం చెందే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల సమీపానికి చేరుతుంది. ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారి, అక్టోబర్ 24 రాత్రి నుంచి అక్టోబర్ 25 తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ఐలాండ్ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుపానుగా మారి తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.
తుపాను ప్రయాణించే మార్గంలోని ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, స్థానిక యంత్రాంగం సంసిద్ధత గురించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శులు కమిటీకి వివరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారిని తిరిగి ఒడ్డుకు రావాలని హెచ్చరించారు. కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తగిన పునరావాస కేంద్రాలు, మందులను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరా పునరుద్ధణ సహా అత్యవసర సేవల కోసం సిబ్బందిని మోహరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
"జాతీయ విపత్తు స్పందన దళం" (ఎన్‌డీఆర్‌ఎఫ్) పశ్చిమ బెంగాల్‌లో 14 బృందాలను, ఒడిశాలో 11 బృందాలను సిద్ధంగా ఉంచింది. సైన్యం, నౌకాదళం, కోస్ట్ గార్డ్‌లకు చెందిన సిబ్బంది, నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి. పారాదీప్, హల్దియా ఓడరేవులకు నిరంతరం హెచ్చరికలు, సూచనలు అందిస్తున్నారు. తక్షణ సేవల కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన అత్యవసర బృందాలను మోహరించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఒడిశా & పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల సంసిద్ధత చర్యలను సమీక్షించిన కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రాణనష్టం జరక్కుండా చూడడంతో పాటు, ఆస్తి & మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అవసరమైన సేవలను సాధ్యమైనంత తక్కువ సమయంలో పునరుద్ధరించాలని సూచించారు.
సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి పిలిపించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రివర్గ కార్యదర్శి చెప్పారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల అవసరాలకు తగ్గట్లుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, సాయం కోసం అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వరదలు రాకుండా చూసేందుకు ప్రభావిత ప్రాంతాల్లోని జలాశయాల నుంచి నీటిని ముందు నుంచే విడుదల చేస్తుండాలని కూడా మంత్రివర్గ కార్యదర్శి స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పెట్రోలియం & సహజ వాయువు, మత్స్య, విద్యుత్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖల కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి, టెలికమ్యూనికేషన్ విభాగం సభ్యుడు (టెక్నికల్), ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్య కార్యదర్శి, భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్, జాతీయ విపత్తు స్పందన దళం డైరెక్టర్ జనరల్,
ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికార్లు హాజరయ్యారు.
addComments
Post a Comment