రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.

 రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు






కొల్లిపర  నవంబర్ 20  (ప్రజా అమరావతి);:రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడానికి రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు. 

  బుధవారం కొల్లిపర మండలం తూములూరు గ్రామం లో రైతు సేవ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2024-25 కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్                 ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , అసిస్టెంట్ కలెక్టర్ పోవర్ స్వప్నిల్ జగన్నాధ్ లతో  కలసి ప్రారంభించారు.  అనంతరం తూములూరు లోని  మారెడ్డి సుబ్బారెడ్డి ట్రస్ట్ కళ్యాణ మండపంలో ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ  మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జిల్లాలో  తూములూరు లో మొట్ట మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 156 రైతు సేవ కేంద్రాలను , 45 క్లస్టర్లగా చేయడం జరిగిందని , జిల్లాలో 3.4 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం వుందని తెలిపారు. ప్రభుత్వం  రైతుకు 75 కే.జీల ఏ- గ్రేడ్ ధాన్యంకు  రూ.1740/- లు మద్దతు ధర ఇస్తుందన్నారు. సాధారణ రకానికి రూ.1725/- లు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు 17 శాతం తేమ వుండాలని , అదనంగా ఐదు శాతం వరకు శాతానికి కే.జి చొప్పున తీసుకోవడం జరుగుతుందన్నారు. అధిక తేమ వున్న ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని , ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దన్నారు. ఈ – పంటలో నమోదు చేసుకోని ఈకేవైసి చేసుకున్న రైతుల వద్ద నుండి మాత్రమే  ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాలు కొనుగోలు చేస్తాయని తెలిపారు.  జిల్లాలో 15 ధాన్యం మిల్లులు డబ్బులు కట్టి  ఉన్నాయని , వాటిని పోర్టల్ లోకి తీసుకురావడం జరిగిందని , రైతుకు ఇష్టమైన మిల్లుకు ధాన్యాన్ని తరలించవచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మద్దతు ధర కంటే ఎవరు తక్కువ ధరకు అమ్మవద్దని ఈ-క్రాప్ చేసిన రైతు తమ ధాన్యాన్ని అమ్మేటప్పుడు ఒక రోజు ముందుగా రైతు సేవ కేంద్రంలో నమోదు చేసుకుంటే సిబ్బంది పంట దగ్గరకు వెళ్ళి తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం కొనుగోలు తేదీని నిర్ణయిస్తారన్నారు.  తేమ శాతం 17 వుంటే వెంటనే కొనుగోలు చేస్తారని , అంతకంటే ఎక్కువ వుంటే రెండు రోజులు ఆరబెట్టి కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు మద్ధతు ధరకంటే అధికంగా ఇస్తానంటే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు వుంటే టోల్ ఫ్రీ నెం.1967 , జిల్లా  కంట్రోల్ రూమ్  నెం. 7702806804 కు తెలియజేయాలన్నారు.  

సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ కొల్లిపర మండలం తూములురు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం సంతోషకరమని , రాష్ట్ర ప్రభుత్వం  రైతు సేవ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఆధార్ లింక్ తో వున్న బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు చెల్లించడం జరుగుతుందన్నారు.  గోదావరి జిల్లాల్లో నెల రోజుల ముందే ధాన్యం కొనుగోలు చేసి 500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు.  జిల్లాలో 156 రైతు సేవ కేంద్రాలను 45 క్లస్టర్లుగా చేసి మార్కెటింగ్ , కో ఆపరేటివ్ సొసైటి వారి సహకారంతో పౌర సరఫరాల శాఖ , రెవెన్యూ యంత్రాంగం ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మద్ధతు ధర కంటే ఎక్కువ వస్తే ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు. చిన్న , సన్నకారు రైతులను ఆదుకోవడానికి ఈ రైతు సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం పొలం నుండి వాహనములో ఎగుమతి చేసిన దగ్గరి నుండి రైస్ మిల్లు వద్ద దిగుమతి అయ్యే వరకు జిపిఎస్ పరికరం ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుందన్నారు. రైతు గోనె సంచులు కాని, హమాలీలు కాని మరియు రవాణా కాని ఏర్పాటు చేసుకుంటే , ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆ పైకము నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ముతో సహా చెల్లించబడుతుందన్నారు. 

తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు తూములురు నుండి ప్రారంభించుకోవడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాయన్నారు. రైతుకు ధర ఎక్కువ లేదా తక్కువ వస్తుందనే డిమాండ్ , సప్లయ్ పై ఆధారపడి వుంటుందని, అయితే ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించడం జరిగిందన్నారు.  ధాన్యం యొక్క తేమ శాతం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం విక్రయించే విషయంలో నిబంధనలను సులభతరం చేసిందని , ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. 


సమావేశం అనంతరం రైతు సేవ కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా వున్న ధాన్యం బస్తాల తూకాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ధాన్యాన్ని మిల్లులకు పంపడానికి ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ను రైతు కుటుంబానికి చెందిన బాలుడి చేత రిబ్బన్ కత్తిరింప జేసి మిల్లులకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థచే రూపొందించిన రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2024-25 కరపత్రాన్ని  , పంటకు బీమా చేయండి రక్షణ కవచం పొందండి , పంటల బీమా పధకం రబీ 2024-25 ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన                ( PMFBY)  పోస్టర్ , కరపత్రాన్నిఆవిష్కరించారు.  

  ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు , జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ  , జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ , జీడీసిఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ హరగోపాల్ , ఏడిఏ తెనాలి ఉషారాణి , దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ వంగా సాంబిరెడ్డి , తూములురు గ్రామ సర్పంచ్ అరుణా భాయ్ , యంపీపీ భీమవరపు పద్మావతి, టీడీపి మండల అధ్యక్షులు భీమవరపు చినకోటిరెడ్డి, జనసేన మండల అధ్యక్షులు యర్రు వెంకయ్య నాయుడు , స్థానిక నాయకులు ,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments