మహాత్మా జ్యోతి బా పూలే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి:సిఎస్ నీరబ్ కుమార్.

 మహాత్మా జ్యోతి బా పూలే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి:సిఎస్ నీరబ్ కుమార్




అమరావతి,28 నవంబరు (ప్రజా అమరావతి):సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన,స్ర్తీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతి బా పూలే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు,అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో జ్యోతిబా పూలే చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.ఫూలే బాల్య వివాహాలను వ్యతిరేకించారని వితంతు పునర్వివాహాలు చేసుకునే హక్కును సమర్థించారని పేర్కొన్నారు.ఆనాడు సమాజంలో సాంఘిక సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు,అట్టడుగు వర్గాలను ఐక్యం చేసేందుకు మరియు కుల వ్యవస్థ కారణంగా ఏర్పడిన సామాజిక ఆర్థిక అసమానతలను తిప్పికొట్టేందుకు 1873లో ‘సత్యశోధక్ సమాజ్’(“సత్యం అన్వేషకుల సంఘం”) అనే సంస్కరణ సమాజాన్ని మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈసందర్భంగా గుర్తు చేశారు.

అదే విధంగా మత విధ్వేశాలు ద్వారా ఎంత మోసానికి గురవుతున్నారో బడుగు వర్గాలకు తెలియజేసేందుకు ‘తృతీయరత్న’వంటి నాటకాలు,పలు కవితలను జ్యోతిబా పూలే వ్రాసారని అన్నారు.అంతేగాక ఆయన వ్రాసిన ‘గులాంగిరి’ వంటి గ్రంధాలు ఆనాటి సమకాలీన సమాజపు పోకడలకు అద్దం పట్టాయని పేర్కొన్నారు.వితంతువులు,అనాధ మహిళలు, శిశువులకు జ్యోతిబా పూలే ప్రత్యేకంగా శరణాలయాలు స్థాపించారని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో సియం ముఖ్య కార్యదర్శి యం.రవిచంద్ర,సియంఓ కార్యదర్శులు ఎవి.రాజమౌళి,ప్రద్యుమ్న,జిఏడి(పొలిటికల్),సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,సర్వీసెస్ కార్యదర్శి పి.భాస్కర్ పూలే చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలోపలువురు సచివాలయ అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments