కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు.

 *కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు* 



హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా అమరావతి): కాంగ్రెస్ పార్టీలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు. తనకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.


అయితే బీఆర్ఎస్‌లోని పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్తారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. ఇక శనివారం నుంచి తాను జిల్లాల పర్యటన చేస్తానని.. అందులోభాగంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారు. అలాగే పార్టీల్లో ఉన్న ఇబ్బందులను సైతం సరి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.


ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన..


మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణతోపాటు పలు అంశాలపై పార్టీ పెద్దలతో ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం కుల గణన జరుగుతుంది. అదే విధంగా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆయా అంశాలపై సైతం ఆయన పార్టీ సీనియర్లతో చర్చించినట్లు సమాచారం.


ఇప్పటికే చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్..


ఇంకోవైపు గతేడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌‌లో పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్‌ పార్టీలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఉన్నదన్నట్లుగా పరిస్థితి మారింది.


లోక్‌సభ ఎన్నికల్లో సైతం...


ఇక ఈ ఏడాది మే, జూన్‌ మాసాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు దాదాపు అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అదే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడం గమనార్హం.


మరికొద్ది రోజుల్లో...


మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం అన్ని విజయావకాశాలను ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌లోని అగ్రనేతలను సైతం పార్టీలోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది..

Comments