ఇళ్ల పట్టాల్లో అవకతకవలను నిగ్గు తేలుస్తాం
రెవిన్యూ సదస్సుల్లో అక్రమాల లెక్క తీస్తాం
అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను వెనిక్కి తీసుకుంటాం
లీజు, కేటాయింపు భూముల వినియోగంపైనా పరిశీలన
అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారంగా రెవిన్యూ సదస్సులు
33 రోజులు పాటు రెవిన్యూ సదస్సులు
ఆ తర్వాత 45 రోజుల కాల వ్యవధిలో పిర్యాదులకు పరిష్కారం : రాష్ర్ట రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
మంగళగిరి (ప్రజా అమరావతి): అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈనెల ఆరో తేదీ నుండి రాష్ర్ట వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా...వారి స్వార్ధం కోసం, భూములను ప్రజల నుండి లాగేసుకునేందుకోసం మరిన్ని సమస్యలను కల్గించారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ర్టంలో భూ వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రెవెన్యూ అంశాలపైన సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని నిర్ణయించామని, ఈనెల ఆరో తేదీన ఈ సదస్సులు ప్రారంభమై 33 రోజుల రాష్ర్టంలోని అన్ని గ్రామాల్లో జరగుతాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని సీసీఎల్ఎ కార్యాయలంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ పాపాల పరంపర కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని, వాటన్నింటికీ పరిష్కారం చూపేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల భూ రికార్డులను ప్రదర్శిస్తామని చెప్పారు. గ్రామంలో ఉన్న అసైన్డ్ భూములు, ప్రీ హోల్డ్ భూములు, లీజ్ భూములు, కేటాయింపు భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు రెవెన్యూ సదస్సుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఆ గ్రామంలో ఎన్ని ఇళ్ల పట్టాలు మంజూరు చేశారనే వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో 22 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ వాటిల్లో పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఇళ్ల స్థలాలు నావి అని చెప్పుకునేందుకు ముందుకు రావడం లేదని, అంటే ఇళ్ల పట్టాల మంజూరులోనూ పెద్ద కుంభకోణం జరిగిందని అర్ధమౌతోందన్నారు. వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను కట్టబెట్టినట్లు తెలుస్తోందని, వీటన్నింటిపైన రెవెన్యూ సదస్సుల్లో చర్చించి లబ్దిదారుల జాబితాలను వెల్లడించి అనర్హులను తేలుస్తామని చెప్పారు. అనర్హులుగా తేలిన వారి నుండి ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల అంశంలోనే కాక అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్ చేసిన వాటిల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా అనేది కూడా రెవెన్యూ సదస్సుల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. లీజు భూములు, కేటాయింపు భూములు ఆ గ్రామంలో ప్రయోజనకరంగా ఉన్నాయో లేవో పరిశీలిస్తామని, వాటిల్లనూ అక్రమాలు జరిగితే వాటిని తిరిగి తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సామన్యుల భూములను అక్రమంగా 22ఏ లో చేర్చారా లేదా అనే అంశాన్ని కూడా రెవెన్యూ సదస్సుల్లో పరిశీలిస్తామని, ఎవరైనా నష్టపోతే వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే బలవంతంగా సామన్యుల నుండి ఎవరైనా భూములు లాక్కున్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన కూడా రెవెన్యూ సదస్సుల్లో చర్చిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
addComments
Post a Comment