*గంజాయి, నాటు సారా నివారణే లక్ష్యంగా ఈ నెల 29 నుండి నవోదయం
*
- రాష్ట్రాన్ని నాటు సారా గంజాయి రహితంగా మారుస్తాం
- గత ఐదేళ్లు జే బ్రాండ్ల మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు
- కల్తీ బ్రాండ్లతో యువత గంజాయి, డ్రగ్స్ వైపు మళ్లారు
- కూటమి అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ
- కల్తీ మద్యం, గంజాయి విషయంలో ఉపేక్షించేది లేదు
- త్వరలోనే కల్లుగీత కులాలకు 340 షాపులు కేటాయిస్తాం
- పెందుర్తిలోని మద్యం డిపోను పరిశీలించిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం, నాటు సారా అనేది లేకుండా తయారు చేసి చూపిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జెర్రిపోతులపాలెంలో ఉన్న మద్యం డిపోను పరిశీలించారు. నవోదయం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నాటు సారా లేకుండా చేసి చూపిస్తామన్నారు. ఈ నెల 29 నుండి ప్రతిష్టాత్మకంగా నవోదయం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎవరైనా, ఎక్కడైనా కల్తీ సారా అమ్మినట్లు తెలిసినా, గంజాయి సాగు రవాణాకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే ఈగిల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నాటు సారా, గంజాయిపై డేగ కన్ను వేశామన్నారు. గతంతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి చాలా వరకు తగ్గించామని, అది పూర్తిగా నిషేధించి తీరుతామన్నారు.
గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో ప్రజల ప్రాణాలు తీశారు. జే బ్రాండ్ల కారణంగా ప్రజలు కల్తీ సారా, గంజాయికి అలవాటు పడ్డారు. చివరికి ఏపీ అంటే గంజాయి క్యాపిటల్ అనే స్థాయికి దిగజార్చారన్నారు. ఇప్పటికే గంజాయి, కల్తీ సారా నివారణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మద్యం అమ్మకాలపై 2శాతం సెస్ వసూలు చేస్తూ దాన్ని మద్యం బాధితులు, గంజాయి, డ్రగ్స్ బాధితుల పునరావాసం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసినా, బ్లాక్‌లో మద్యం అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తీసుకోవడం తధ్యమన్నారు. అవసరమైతే షాపులు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన 340 షాపులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లైసెన్సు ఫీజులో 50 శాతం వారికి సబ్సిడీ అందించి ఆర్దిక తోడ్పాటు ఇస్తున్నామన్నారు. మద్యం షాపుల కేటాయింపును అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ లేబుల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ తయారైన బాటిల్ అయినా పూర్తి వివరాలు ఒకే చోట లభ్యమయ్యేలా లేబుల్స్ తయారీ జరుగుతోందన్నారు. గత ఐదు సంవత్సరాల పాటు లేబుల్ అనే మాటే లేకుండా చేశారు. కానీ ప్రస్తుతం ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ విధానంతో ఎండ్ టూ ఎండ్ మానిటర్ ఉండేలా లేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. మద్యం తయారు చేసిన ప్రాంతం నుండి.. కొనుగోలు దారు చేతికి చేరినంత వరకు ట్రాక్ చేసేలా వ్యవస్థ రూపొందించామన్నారు. అదే సమయంలో కల్తీ మద్యం లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి షాపులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం మానిటర్ చేస్తున్నామన్నారు.
పొరుగు రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల ప్రాణాల విషయంలో శ్రద్ధ చూపుతూ.. తయారు చేసిన మద్యాన్ని ఆరు దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారుడు చెల్లించే ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరాలనే లక్ష్యంతో మానిటర్ చేస్తున్నామన్నారు. జే బ్రాండ్లను పూర్తిగా నిరోధించి ఇప్పటికే 150కి పైగా కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. మరో 148 బ్రాండ్లు టెండర్ కమిటీ వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. గతంలో కల్తీ మద్యం కారణంగా వేలాది మంది కిడ్నీ, లివర్ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దుస్థితి ఎవరికీ కలగకుండా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment