రంగం ఏదైనా.. భారతీయులదే విజయం.



*రంగం ఏదైనా.. భారతీయులదే విజయం


*


*వంద దేశాల్లో తెలుగు ప్రజల సేవలు*


*గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా ఉంది*


*స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ విధానం*


*గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఫ్యూయల్‌ రంగంలో అగ్రగామిని చేస్తాం*


*ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోండి*


*దావోస్‌ సీఐఐ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు*


దావోస్, జనవరి 21 (ప్రజా అమరావతి): వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి... గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందని..., ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 100కు పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, తక్కువ సమయంలోనే ఇంతలా తెలుగువారు విశ్వవ్యాప్తం అవుతారని ఎవరూ ఊహించలేదన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. 


*సరైన సమయంలో సరైన ప్రధాని :*


‘‘25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టారు. 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ రెండింటిని అవకాశంగా తీసుకుని మేము రెండవ దశ సంస్కరణలు తీసుకొచ్చాం. ఫలితాలు వచ్చాయి. సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. మూడవ సారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది... కానీ భారతదేశంలో అది లేదు. పరిపాలనలో ఒక స్పష్టతతో వెళ్తున్నారు.’’ అని చంద్రబాబు అన్నారు. 


*నాటి సంస్కరణల ఫలితమే నేటి హైదరాబాద్ :*


నాడు తాను తెచ్చిన సంస్కరణలతో రెండున్నర దశాబ్ధాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్‌ రూపొందించడంలో ట్రాక్ రికార్డ్ ఉందని, హైదరాబాద్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ నగరం అయ్యిందని  అన్నారు. దేశంలో నివాసయోగ్యానికి హైదరాబాద్ అత్యంత అనువైనం ప్రాంతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఫార్మా, ఐటీ, ఫైనాస్స్, క్రీడలు, ఆసుపత్రలు ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందన్నారు. 


*వచ్చేది భారత యుగం :* 


GDP వృద్ధి రేటులో భారతదేశం అగ్రగామిగా ఉందని, ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. 2028 నుంచి భారత యుగం ప్రారంభమవుతుందని చెప్పారు. భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్‌గా చేసేందుకే ‘వికసిత్ భారత్ 2047’ ప్రణాళికలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని, సుస్థిర ప్రభుత్వంతో కూడిన ‘దార్శనికత కలిగిన నాయకుడు’ మోదీ అని చంద్రబాబు ప్రశంసించారు. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగడం ద్వారా 2047 నాటికి భారత్ తొలి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


*సర్ణాంధ్ర - 2047 విజన్ :*


స్వర్ణాంధ్ర – 2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు.  కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేస్తున్నామని, కాకినాడ వంటి పటిష్టమైన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రూపకల్పనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మార్గనిర్దేశాన్ని మరిచిపోలేమన్నారు.


*అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ :*


భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ (GLC) దోహదపడుతుందన్నారు. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్‌సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరంగా చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్-టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు. 


*గ్రీన్ ఎనర్జీ-గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ :* 


రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణగా తెలిపారు. 1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించనని గుర్తు చేశారు. నాడు దేశం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంది, పరిశ్రమలు మూసివేయవలసి వచ్చిందని.. కొన్ని సవాళ్లు-భయాలు ఉన్నప్పటికీ క్లిష్టమైన సంస్కరణలను చేపట్టానని... ఆనాటి సంస్కరణల వల్ల తన రాజకీయంగా నష్టం కలిగించిందని, అయితే ఆ నిర్ణయాలతో ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నామనే సంతృప్తి ఉందన్నారు. అలాగే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధించామని, ఇంధన ఖర్చులు తగ్గించగలిగామని అన్నారు. 


*మిషన్ మోడ్‌లో క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు :* 


సుస్థిర లక్ష్యాలను సాధించేందుకు మిషన్-మోడ్ విధానంతో ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలనేది తన ఉద్దేశంగా ముఖ్యమంత్రి చెప్పారు. 2030 నాటికి 500 MW పునరుత్పాదక విద్యుత్‌ను, 500 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామని, ఇది జాతీయ లక్ష్యంలో 30 శాతంగా చెప్పారు.  


*ఏపీలో భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు:*


భారతదేశ పునరుత్పాదక ఇంధన ఆశయాలను వేగంగా సాధించేలా జాయింట్ వెంచర్‌గా నెలకొల్పుతున్న 21 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఇటీవల ప్రధానమంత్రి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. అదనంగా, బయో ఫ్యూయల్ రంగంలో రిలయన్స్ రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెడుతోందని అన్నారు. 


*ప్రజల చెంతకు సాంకేతిక పురోగతులు:*


ప్రజల్నే విద్యుత్ ఉత్పత్తిదారులుగా చేసేలా రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఏర్పాటును, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి నెట్ జీరో లక్ష్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. డ్రోన్ సాంకేతికతను వ్యవసాయరంగ అభివృద్ధికి వినియోగిస్తున్నామని అన్నారు. 


*పారిశ్రామికవేత్తలకు మద్దతు:*


స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని, పారిశ్రామిక వేత్తలకు, ఇంధన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు - అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తన ప్రసంగంలో 1995 నుంచి నేటి దాకా సీఐఐతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని  ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అలాగే... పేదరికం, సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కార్పొరేట్ సంస్థలు, అధిపతులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Comments