విజయవాడ (ప్రజా అమరావతి);
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఉంటుంద
ని ముఖ్యమంత్రి తెలిపినట్టు ఎం.డి. వెల్లడి
ఆర్టీసీలో సుదీర్ఘ కాలం ఎం. డి. గా చేయడం సంతోషం
మీతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది
త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను
ఇవి ఉద్వేగ క్షణాలని పేర్కొన్న ఎం.డి.
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ జి.వి.రవి వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలలో రాష్ట్ర D.G.P. మరియు APSRTC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉద్యోగులందరికీ 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
1950 లో రాజ్యాంగం ప్రవేశ పెట్టినప్పుటి నుండి మన దేశంలో అందరికి స్వేచ్ఛ, సమానత్వం లభించాయని, తద్వారా దేశంలో అనేక రంగాలలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయన్నారు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా రవాణా రంగంలో APSRTC మారుమూల గ్రామాలకు కూడా చవకైనా రవాణా సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. చిన్న సంస్థగా ఏర్పడి ఈనాడు ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సును ‘మా సొంత బస్సు, మా ఊరి బస్సు’ అనేలా మారిందంటే అది ఉద్యోగుల కృషికి నిదర్శనమని తెలిపారు.
రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక హక్కులు కల్పించిన భాగంలో మహిళా ఉద్యోగులు కూడా అన్ని రంగాల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారని, మన సంస్థలో అన్ని కేటగిరీలలో మహిళా ఉద్యోగినులు రాణిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నేడు ప్రభుత్వం మహిళలకు వివిధ రంగాలలో ప్రత్యేక స్థానం కల్పించడమే కాకుండా ఉచిత బస్సు సదుపాయం అందించే యోచనలో ఉందని, ఇప్పటికే రవాణా మంత్రుల కమిటీ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక కూడా అందించారని తెలిపారు.
అనంతరం ఆర్టీసీలోని పలు విభాగంలో సాధించిన అభివృద్ధి గురించి ఆయన తెలిపారు.
ప్రయాణీకులకు ఎన్నో దశబ్ధాల సేవలు: ప్రయాణికులకు వారి అభిరుచికి తగ్గట్టుగా బస్సులు ప్రవేశపెట్టి. ఎప్పటికప్పుడు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా, టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత సేవలతో ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని తెలిపారు. రవాణా అనేది దేశ అభివృద్ధిలో కీలక అంశమని, అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉండేలా ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. రవాణా అనగానే ప్రజలకు ఆర్టీసీ గుర్తుకు వస్తుందని, ప్రతి రోజూ 11,246 బస్సులతో 65% ఓ.ఆర్. తో దాదాపు 60 లక్షల మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. సేవలు మరచిపోలేనివని పేర్కొన్నారు.
ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా మెలిగి, వారికి సేవలు అందించడం ద్వారా సంస్థకి పేరు వస్తుందని తెలిపారు. తిరుపతి, మదనపల్లి లాంటి కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ బస్సులు మొదలయ్యాయని, వాటిలో ప్రయాణించే ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని, అధికారులు సర్వే చేయడం వలన ఈ విషయాలలో మరింతగా ఆర్టీసీ సేవలు మెరుగు పరచుకోవచ్చని తెలిపారు.
ఆపరేషన్స్ విభాగం :. సంక్రాంతి పండుగ సమయంలో అన్ని విభాగాల సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పనితీరుని ప్రశంసించారు. అధికారులు ఈ పండుగ సమయంలో ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో బస్సులు ఏర్పాటు చేశారన్నారు. దాని ఫలితంగా 3 రోజుల పాటు రూ. 20 కోట్ల ఆదాయం మార్క్ దాటినందుకు అందరినీ అభినందించారు. జనవరి 20వ తేదీన గత రికార్డులను అధిగమించి రూ. 23.71 కోట్లు సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
* మెకానికల్ విభాగం : గ్యారేజీ సిబ్బంది బస్సుల కండిషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. మార్గమధ్యంలో బస్సులు ఆగకుండా నిర్వహణ ఉండాలని సూచించారు. సంస్థలో పాత బస్సుల స్థానంలో ఇప్పటికే 698 కొత్త బస్సులు, 654 అద్దె బస్సులు ప్రవేశపెట్టామని. త్వరలో 1000 కి పైగా కొత్త బస్సులు, ఎలక్త్రిక్ బస్సులు రానున్నవని పేర్కొన్నారు. ఈ సంధర్భంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి తెలిపినట్టు ఎం.డి. శ్రీ తిరుమల రావు, ఐపిఎస్ , వెల్లడించారు.
ఐ.టి. విభాగం : టెక్నాలజీ అందిపుచ్చుకుని సంస్థలో డిజిటల్ పేమెంట్ తీసుకురావడం వలన ప్రయాణికులకు టిక్కెట్ల కొనుగోలు సమయాలలో సులభతరం చేశామన్నారు. నగదు రహిత సేవలు విస్తృతం చేయడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. సామాన్య ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే ఆర్టీసీలో నగదు రహిత సేవలు పెరిగితే సంస్థ ఆర్ధికంగా వృద్ధి సాధిస్తుందని తెలిపారు.
సిబ్బందిని ఉద్దేశించి : ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన కర్తవ్యంగా డ్రైవర్లు అంకితభావంతో డ్యూటీలు చేయడం అభినందనీయమన్నారు. ‘O’ ప్రమాద రేటు నమోదు చేయడమే ధ్యేయంగా డ్రైవరు సోదరులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో గుండెపోటుకి గురైనా, ప్రయాణీకుల సంరక్షణే విధిగా, బస్సును పక్కకు ఆపి ప్రాణాలు విడిచిన అంకిత భావమున్న డ్రైవర్లు మన ఆర్టీసీలో ఉండడం గర్వించదగిన విషయమని తెలిపారు. ప్రయాణీకుల క్షేమం ముఖ్య విధిగా సేవలందించడం అభినందనీయమన్నారు. అదే విధంగా కండక్టర్లు మరియు గ్యారేజీ సిబ్బంది కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారని, ఉద్యోగ బాధ్యతల పట్ల ఉద్యోగస్తులందరి క్రమశిక్షణ, అంకితభావమే సంస్థ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకి రావలసిన 2017 RPS బకాయిలు ఇప్పటికే చాలా మందికి చెల్లించామని, మిగతా 50% త్వరలో చెల్లించే యోచనలో ఉన్నామని తెలిపారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి ఆర్టీసీల క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని మన సంస్థకు ఎన్నో పతకాలు సాధించిన విజేతలందరినీ మనస్పూర్తిగా అభినందిస్తునట్లు తెలిపారు. ఉద్యోగంలో ఒత్తిళ్ళను తట్టుకుంటూ కూడా క్రీడలు, ఆటల పట్ల సమయం వెచ్చించి ఉద్యోగులు చూపిస్తున్న ఏకాగ్రత, పట్టుదల అలాగే కొనసాగిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
టిక్కెట్టేతర ఆదాయం: టిక్కెట్టేతర ఆదాయంలో భాగంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే కార్గో ఆదాయం రూ. 150 కోట్లు , జనతా గ్యారేజీల ద్వారా సుమారు రూ. 1.72 కోట్లు సాధించామని తెలిపారు. అలాగే విధ్యాధరపురం, పి.ఎన్.బి.ఎస్. లలో సోలార్ రూఫ్ ప్లాంట్స్ ఏర్పాటు ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 27 లక్షలు ఆదా చేయబోతున్నామని తెలిపారు.
ప్రయాణీకుల సంతృప్తే మనందరి అంతిమ ధ్యేయంగా ఉద్యోగులందరూ కలసి పని చేయాలని పేర్కొన్నారు.
చివరగా శ్రీ ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ ఎం.డి. గా సుదీర్ఘ కాలం ఆర్టీసీకి సేవలు అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 35 సంవత్సరాలపాటు పోలీసు శాఖలో సేవలు అందించి త్వరలో పదవీ విరమణ చేయబోతున్నానని, ఇవి ఉద్వేగ క్షణాలు అని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్భంగా, వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన వివిధ కేటగిరీల అధికారులకు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు, క్యాష్ అవార్డులను ఎం.డి. శ్రీ ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. అందజేశారు.
అనంతరం, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ జి. వి. రవి వర్మ (అడ్మిన్), శ్రీ ఏ. అప్పల రాజు(ఆపరేషన్స్), శ్రీ చంగల్ రెడ్డి (ఇంజినీరింగ్) కలిసి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలలో పలు అధికారులతో పాటు ఛీఫ్ మేనేజర్ (పర్సనల్) శ్రీ స్వరూపానంద రెడ్డి, ఎ.డి. (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శ్రీమతి శోభామంజరి, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మధుసూధన్, ఆర్టీసీ హౌస్ ఉద్యోగులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment