ఉగాదికి పట్టాలెక్కుతున్న పీ4 విధానం.



*ఉగాదికి పట్టాలెక్కుతున్న పీ4 విధానం


*


*పేదల సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం*


*అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే పీ4*


*పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలకు అదనంగా సాధికారత కోసం సాయం*


*ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి*


*ముందుగా నాలుగు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు*


*అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*


అమరావతి, ఫిబ్రవరి 27 (ప్రజా అమరావతి): అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమానికి ఉగాది నుంచి శ్రీకారం చుడుతోంది. పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు పీ4 విధానాన్ని ప్రవేశ పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ‘పీ4, ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ - బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి నివాసంలో శాఖపరమైన సమావేశాన్ని నిర్వహించారు.


*పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యం:*


సంపదలో పైవరుసలో ఉన్న కుటుంబాలు సమజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4 విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


*ఉగాది నాటికి అమల్లోకి పీ4 విధానం:*


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ4 విధానం (public philanthropic people participation) ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టు గా అధికారులు రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ది పొందుతాయి.


*కుటుంబాల ధృవీకరణ :*


ఈ విధానం ద్వారా లబ్ది పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను జీఎస్‌డబ్లుఎస్ డేటాబేస్, హౌస్‌హోల్డ్ సర్వే, గ్రామసభ ధృవీకరణ ద్వారా గుర్తించడం జరుగుతోంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని, ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.


*కొనసాగుతున్న హౌస్ హోల్డ్ సర్వే :*


హౌస్ హోల్డ్ సర్వే మొదటి దశ కింద రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే జరుగుతోంది. ఇది మార్చి 2కి పూర్తవుతుంది. ఈ పది జిల్లాల్లో 52 లక్షల కుటుంబాలు ఉంటే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. రెండో దశ కింద రాష్ట్రంలో మిగిలిన 16 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే మార్చి 8 నుంచి మొదలుపెట్టి మార్చి 18 నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.  పేద కుటుంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలకు అదనంగా వారి సాధికారత కోసం పి4 విధానం ద్వారా సాయం చేయనున్నారు. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప...వీటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ది దారుల్లో ఎటువంటి మార్పులు చేయరు.


*అనుసంధానమే ‘సమృద్ధి బంధనమ్’ :*


లబ్దిదారుల ధృవీకరణ పూర్తి అయిన తర్వాత సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫామ్‌లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు.  లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్...వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు....స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.


*‘పీ4’లోకి ఆగస్ట్ కల్లా 5 లక్షల కుటుంబాలు :*


ఈ ఉగాదికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి రానున్న ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను ‘సమృద్ధి బంధనమ్’ కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా సీనియర్ అధికారులు పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments