మన నేతన్నకు భరోసా.

 *మన నేతన్నకు భరోసా


*


ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య కుదిరిన ఒప్పందం

ఏపీ, తమిళనాడు మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఎంవోయూ

ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఎండీలు

ఆప్కో, కో ఆప్టెక్ట్ షోరూమ్ లో ఇరు రాష్ట్రాల చేనేత  వస్త్రాల విక్రయాలు

పెరిగిన మార్కెట్ తో ఏపీ చేనేత కార్మికులకు మేలు

ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం


విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందుడగు పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కో ఆప్టెక్స్ ఏజెన్సీలు తమ షోరూమ్ ల్లో రెండు రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించుకునేలా ఒప్పందం కుదురింది. ఈ ఏడాది రూ.9.20 కోట్ల మేర వస్త్రాలు విక్రయాలు చేయాలని ఆప్కో, కో ఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో శుక్రవారం జరిగిన బయ్యర్, సెల్లార్ మీట్ లో రెండు రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్.సవిత, ఆర్.గాంధీ సమక్షంలో ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.  రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధితో పాటు చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ నగరాల్లో ఆప్కో ఆధ్వర్యంలో చేనేత ఎక్స్ పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ వస్తోంది. చేనేత కార్మికులకు నేటి తరం అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు, దుస్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, తయారైన చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల చేనేత సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. 


*కో ఆప్టెక్స్ తో ఆప్కో ఒప్పందం*


రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తో ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఏపీ, తమిళనాడుకు చెందిన చేనేత,జౌళిశాఖ మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఆప్కో ఎండీ పావనమూర్తి, కో ఆప్టెక్స్ ఎండీ దీపక్ జాకబ్ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఇరు రాష్ట్రాలకు చేనేత సంస్థలు రూ.9.20 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో సహా ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఏపీకి చెందిన చేనేత వస్త్రాలను కో ఆప్టెక్స్ షోరూమ్ లతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. కో ఆప్టెక్స్, ఆప్కో మధ్య రూ.20 లక్షలు, ట్రిచీ, మదురై, తిరుచెన్ గోడ్ సర్కల్, అరబిందో టైక్స్ టైల్స్ మధ్య రూ.1.25కోట్లు, సాలెమ్ సర్కిల్, శ్రీ సుదర్శన్ సిల్క్ మధ్య రూ.కోటి, ఈరోడ్ సర్కిల్, బళభద్ర నర్సింహామూర్తి సంస్థ మధ్య రూ.50 లక్షల మేర ఒప్పందం కుదిరాయి. వాటితో మరిన్ని ఏపీ, తమిళనాడుకు చెందిన సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరియి. త్వరలో మిగిలిన రాష్ట్రాలకు చెందిన చేనేత సంస్థలతోనూ ఒప్పందం చేసుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


*చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి...*


ఆప్కో, కో ఆప్టెక్స్ ఒప్పందంతో ఏపీకి చెందిన చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి కలుగనుంది. నేతన్నల దగ్గర తయారవుతున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లభిస్తోంది. కో ఆప్టెక్స్ కు చెందిన చేనేత వస్త్రాలు డబుల్ క్లాత్ బెడ్‌షీట్‌లు (కింగ్ సైజు), టర్కీ టవల్స్ (బ్లీచ్డ్ మరియు డైడ్), డోర్‌మ్యాట్‌లు, ఆరని సిల్క్ చీరలు, పళని టై, డై చీరలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తారు. ఏపీకి చెందిన మంగళగిరి కాటన్, జరీ చీరలు, రాజమండ్రి కాటన్ చీరలు, బందర్ కాటన్ చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, మాధవరం కాటన్ చీరలు,  సిల్క్ చీరతో పాటు ఇతర చేనేత వస్త్రాలను కో ఆప్టెక్స్ షోరూమ్ ల్లో విక్రయిస్తారు.  ఏపీతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కో ఆప్టెక్స్ షో రూమ్ లో రాష్ట్రానికి చేనేత వస్త్రాలను విక్రయించుకునే సౌలభ్యం కలుగుతుంది. దీనివల్ల ఉత్పత్తవుతున్న సరకును ఎప్పటికప్పుడు అమ్మకం కావడం వల్ల నేతన్నలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి కలుగుతుంది. చేనేతలకు 365  రోజుల పాటు పని కల్పించాలన్న లక్ష్యంగా కూడా నెరవేరబోతోంది.  


*తమిళనాడు బయ్యర్-సెల్లార్ మీట్ ను ప్రారంభించిన మంత్రి సవిత*


విజయవాడలోని  ఓ ప్రైవేటు హోటల్ లో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బయ్యర్, సెల్లార్ మీట్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ లో తమిళనాడు ప్రభుత్వం కో ఆప్టెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆ రాష్ట్ర మంత్రి ఆర్.గాంధీతో కలిసి పరిశీలించారు. చీరలు, ఇతర చేనేత వస్త్రాలను నాణ్యతను, ధరలను మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన చేనేత, జౌళి శాఖ కార్యదర్శి వి.అమృతవళ్లి, డైరెక్టర్ మేఘాశ్వీరి రవికుమార్, ఏపీ చేనేత, జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు, చేనేత సొసైటీలు, పలు వాణిజ్య సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 



Comments