*కొత్త యూస్ కేసెస్‌తో ముందుకు రండి
*
*డ్రోన్ కార్పొరేషన్ సహకారమందిస్తుంది*
*ఔత్సాహిక విద్యార్థులకు డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్ పిలుపు*
*ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల రూపొందించిన యూస్‌కేసెస్ ప్రదర్శన*
*ఆకట్టుకున్న మారిటైమ్ సర్వైలెన్స్, వైల్డ్ లైఫ్ సర్వైలెన్స్ డ్రోన్లు*
అమరావతి (ప్రజా అమరావతి): వినూత్నమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్ యూస్ కేసెస్‌తో విద్యార్థులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. అలాంటి విద్యార్థులకు తమ సంస్థ పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా ఔత్సాహిక విద్యార్థుల కోసం డ్రోన్‌ల ద్వారా ఉపయోగించే యూస్ కేసెస్‌పైన హ్యాకథాన్ నిర్వహించింది. అందులో ఉత్తమ యూస్ కేసెస్ ప్రజెంట్ చేసిన విద్యార్థులకు ఆ సమ్మిట్ సందర్భంగా బహుమతులు అందజేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ యూస్ కేసెస్‌ను అప్పుడు వర్చువల్ విధానంలో ప్రజెంట్ చేశారు. ఇప్పుడు వాటిని రియల్ టైమ్‌లో అభివృద్ధి చేసే డ్రోన్ కార్పొరేషన్ ముందు ప్రదర్శించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా పది మంది విద్యార్థులు రూపొందించిన సరికొత్త, వినూత్న యూస్ కేసెస్‌ను స్థానిక ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్ విద్యార్థులు రూపొందించిన డ్రోన్ యూస్ కేసెస్‌ని స్వయంగా తిలకించారు. విద్యార్థులను అడిగి వాటిని వారు రూపొందించిన విధానం ఎంచుకున్న పద్ధతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్బంగా విద్యార్థులు వర్చువల్ విధానంలో అందజేసిన యూస్ కేసెస్ ను ఇప్పుడు రియాల్టీగా అభివృద్ధి చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారికి తాము సహకారం అందిస్తామన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఔత్సాహిక విద్యార్థుల రూపొందించే యూస్ కేసెస్‌ను పరిశీలించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థులు అభివృద్ధి చేసుకు వచ్చిన యూస్ కేసెస్ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఆచరణీయ సాధ్యమైనవి, సౌలభ్యమైనవి అయితే వాటిని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసి విద్యార్థులకు సహకారం కూడా అందిస్తామన్నారు.
*ఓర్వకల్లులో డ్రోన్ సిటీ*
డ్రోన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేకంగా డ్రోన్ రంగం అభివృద్ధికొరకు డ్రోన్ పాలసీ రూపొందించిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశానికి ఏపీని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఆశయమన్నారు. ఔత్సాహిక విద్యార్థులు డ్రోన్ తో వినూత్న ఆవిష్కరణలు చేసి తమను సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ సివిల్ డిపార్టుమెంట్ విభాగాధిపతులు డాక్టర్ రవితేజ, డాక్టర్ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.
*మారిటైమ్ డ్రోన్*
డ్రోన్లతో వివిధ రకాలైన వినూత్న సేవలందించేలా విద్యార్థులు రూపొందించిన సరికొత్త యూస్ కేసెస్ ప్రదర్శన ఆధ్యంతం ఆకట్టుకుంది. సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ మరింత సులభతరం చేసేలా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన మేరిటైమ్ డ్రోన్ ఆకట్టుకుంది. సముద్ర తీర ప్రాంతంలో అనుమతి లేని అక్రమంగా చొరబడే పడవలను గుర్తించడం, సముద్రంలో ఎవరైనా కొట్టుకుపోతున్నా ఇట్టే పసిగట్టి వారిని రక్షించడానికి ఉపయోగపడేలా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ విద్యార్థి మణికంఠ రూపొందించిన మారిటైమ్ సర్వైలెన్స్ డ్రోన్ ప్రదర్శనలో ఆకట్టుకుంది.
*వన్య ప్రాణులను పసిగట్టే డ్రోన్*
అడవుల నుంచి జనావాసాలకు వస్తున్న వన్య ప్రాణుల గమనాన్ని పసిగట్టగలిగేలా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కె.నరేన్ కౌశిక్, జాన్వీలు రూపొందించిన వైల్డ్ లైఫ్ సర్వైలెన్స్ డ్రోన్ ఆలోచింపజేసింది. వన్యప్రాణులు ఏ దిశలో వెళుతున్నాయనేది నిరంతరాయంగా పసిగట్టేలా ఈ డ్రోన్ రూపొందించారు. రాత్రిపూట కూడా జంతువుల కదలికలను పసిగట్టేలా అత్యాధునిక థర్మల్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. దీనివల్ల ఆయా జంతువు ఏ దిశలో కదులుతుందో చెప్పి దాన్ని పట్టుకుని తిరిగి అడవిలో వదిలేసేలా అటవీ శాఖాధికారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆ వర్సిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ ఎండీ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీ విద్యార్థులు అక్వా రైతులకు ఉపయోగపడేలా అన్ మ్యాన్డ్ సర్వైలెన్స్ డ్రోన్ రూపొందించారు. నీళ్లు మనుషులు తాగడానికి పనికొచ్చేవాల లేక పొలాలకు ఉపయోగించడానికి పనికొస్తాయా లేదా అనే పరీక్షించి చెప్పే సాంకేతిక ఉన్న డ్రోన్లు, అలాగే ఒక కంపెనీ, ఇల్లు, సంస్థలో వాటికి సంబంధించిన వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు వస్తే వారిని గుర్తించి వెంటనే సమాచారం పంపే తరహా డ్రోన్లు కూడా మరికొంతమంది విద్యార్థులు రూపొందించారు.
addComments
Post a Comment