ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఛాంపియన్ కర్ణాటక టీం.

 



*ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఛాంపియన్ కర్ణాటక టీం




*ఆసక్తిగా సాగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్..అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన కర్ణాటక జట్టు*


*హోరాహోరీగా సాగిన తుదిపోరులో కేరళ జట్టుపై ఘన విజయం సాధించిన కర్ణాటక టీం*


*99 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న కర్ణాటక బ్యాట్స్ మెన్ అర్జున్ హొయసాల..టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి రికార్డు సృష్టించిన అర్జున్* 

  

*టోర్నమెంట్ లో 9 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ గా నిలిచిన కేరళకు చెందిన అంకిత్ మిశ్రా, బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నిలిచి తమిళనాడు కు చెందిన  వేదాంత్ భరద్వాజ్..బెస్ట్ ప్లేయర్ గా నిలిచిన కర్ణాటక కెప్టెన్ జె.సుచిత్*


*విన్నర్స్, రన్నర్స్ ను అభినందించి బహుమతులు ప్రదానం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు*


*టోర్నమెంట్ సక్సెస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఉన్నతాధికారులు*


విజయవాడ/మంగళగిరి (ప్రజా అమరావతి): ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఛాంపియన్ గా కర్ణాటక, రన్నర్ గా కేరళ జట్లు నిలిచాయి.  విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 10 నుండి 13 వరకు గడిచిన నాలుగు రోజులుగా మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల జట్ల మధ్య క్రికెట్ పోటీలు పోటాపోటీగా జరిగాయి.  టోర్నమెంట్ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కర్ణాటక జట్టు అంతిమంగా ఛాంపియన్ గా నిలిచింది. కర్ణాటక టీం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి సమిష్టి కృషితో విజేతగా నిలిచింది.


ఈ సంద్భంగా కర్ణాటక, కేరళ జట్ల మధ్య జరిగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్-2025 ఫైనల్ మ్యాచ్, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించి వారి చేతుల మీదుగా టోర్నమెంట్ విజేతగా నిలిచిన కర్ణాటక జట్టుకు ఛాంపియన్ ట్రోఫీని అందజేసారు. టోర్నమెంట్ లో 9 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ గా కేరళకు చెందిన అంకిత్ మిశ్రా నిలవగా తమిళనాడు కు చెందిన  వేదాంత్ భరద్వాజ్ బెస్ట్ బ్యాట్స్ మెన్ గా  నిలిచారు. బెస్ట్ ప్లేయర్ గా కర్ణాటక కెప్టెన్ జె.సుచిత్  నిలిచారు.


ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ  ఆసక్తిగా మ్యాచ్ జరిగిందని తెలిపారు.  ఈ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన వారు బాగా ఎంజాయ్ చేశారన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనటం మంచి పరిణామమన్నారు.   


విజయవాడ స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్. రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ  కర్ణాటక, కేరళ ఏజీ జట్లు ప్రొఫెషనల్స్ కు తీసిపోని విధంగా క్రెకెట్ ను బాగా ఆడారన్నారు. ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు క్రికెట్ లో తమ నైపుణ్యాలను బాగా ప్రదర్శించారన్నారు. గెలుపోటములు చాలా సున్నితంగా ఉంటుంది దానిని చాలా స్ఫూర్తివంతంగా తీసుకోవాలన్నారు. 


ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్)  శరత్ చతుర్వేది మాట్లాడుతూ ఏజీ ఆఫీస్ లో పనిచేసే అధికారులు క్రికెట్ ఆడటం ఆనందంగా ఉందని అందుకు వారిని అభినందిస్తున్నానన్నారు.  ఫైనల్ మ్యాచ్ ను అందరూ బాగా ఎంజాయ్ చేశామన్నారు. కర్ణాటక జట్టు చేసిన స్కోర్ ను కేరళ జట్టు ఛేజ్ చేసేందుకు బాగా కష్టపడ్డారని కానీ మిడ్ లెవెల్ టీమ్ బాగా రాణించలేదన్నారు. అయినా కేరళ జట్టు క్రీడా స్ఫూర్తి అభినందనీయమన్నారు. 


నాలుగో రోజు గురువారం ఉదయం 9.30 గం.లకు ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఫైనల్ మ్యాచ్ కర్ణాటక, కేరళ జట్ల మధ్య జరిగింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ధేశిత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది.  కర్ణాటక బ్యాట్స్ మెన్ అర్జున్ హొయసాల 194.12 స్ట్రైక్ రేట్ తో కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్ లు కొట్టి 99 రన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1 పరుగు తేడాతో సెంచరీ చేసే అదృష్టం కోల్పోయారు. టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్ మెన్ గా అర్జున్ హొయసాల టాప్ స్కోరర్ గా నిలిచారు. శరత్ బి.ఆర్ 12 బంతుల్లో  31 పరుగులు వేగంగా చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు కృషి చేశారు. చివర్లో నికిన్ జోన్ వేగంగా ఆడే ప్రయత్నం చేసి చక్కని షాట్లతో ప్రేక్షకులను అలరించారు. కర్ణాటక జట్టు స్కోర్ 200కు పైగా చేరుతుందని అనుకున్నప్పటికీ వెంటవెంటనే వికెట్లు పడటంతో స్కోర్ బోర్డు చివర్లో నెమ్మదిగా కదిలింది. కేరళ బౌలర్లలో అంకిత్ మిశ్రా 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఎస్. మిథున్ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.


191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ టీం నిర్దేశిత 20 ఓవర్లలో 162 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. కేరళ బ్యాట్స్ మెన్ మణుకృష్ణన్ 23 బంతుల్లో 42 పరుగులు చేయగా,  శ్యామ్సన్ 20 బంతుల్లో 30 పరుగులు, ఎండీ షహబాజ్ హుస్సేన్ 19 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కర్ణాటక బౌలర్ ఆదిత్య 4 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టారు. నికిన్ బోస్ అటు బ్యాటింగ్ లోనూ రాణించడమే గాకుండా బౌలింగ్ లోనూ 4 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరొక బౌలర్ జై 3 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి కర్ణాటక జట్టు ఛాంపియన్ గా నిలవడంతో తమదైన పాత్ర పోషించారు.


టోర్నమెంట్ లో ఇప్పటివరకు కేరళ జట్టుపై జరిగిన ప్రతి మ్యాచ్ లో కర్ణాటకనే పైచేయిగా నిలవడం విశేషం.. టోర్నమెంట్  ఆంధ్రా-తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల్లో కేరళ నెగ్గింది. కానీ ఫైనల్ లో మెరుగైన ఆటతీరును కనబర్చినప్పటికీ ఓటమిపాలైంది. అనంతరం జరిగిన మ్యాచ్ ల్లో కర్ణాటక జట్టు, ఆంధ్రా-తెలంగాణ జట్లపై పై తమిళనాడు టీం విజయం సాధించినప్పటికీ సెమీఫైనల్ లో ఓడిపోయింది..  ఆంధ్రా-తెలంగాణ టీం మంచి ఆటతీరును కనబర్చినప్పటికీ గెలుపు రుచి చూడకపోవడం బాధాకరం.  కానీ మంచి ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం.


విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తొలిసారి జరిగిన సౌత్ జోన్ టోర్నమెంట్ సక్సెస్ కావడం పట్ల సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. 


కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) శాంతి ప్రియ, సీనియర్ డీఏజీ లు కె.భాస్కర్, కిషోర్ రెడ్డి, డీఏజీలు రాకేష్ నాయక్, ఎన్.నిఖిల, లలిత్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.



Comments