మిర్చి రైతులను అదుకుంటాం....



*మిర్చి రైతులను అదుకుంటాం....


దీనికి వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలి*


*క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు*


*కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు*


*కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్‌ల రవాణాకు అనుమతులు*


*గుంటూరు మార్కెట్ యార్డులో లారీ యజమానుల తీరుపై రైతుల ఫిర్యాదు..చర్యలకు సీఎం ఆదేశం*


*గుంటూరులోని స్పైస్ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన*



-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు


*రెండున్నర గంటలపాటు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లు, అధికారులతో సీఎం సమావేశం*


అమరావతి, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి):- ధర పతనమై ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి ఎగుమతి దారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మిరప రైతులను ఆదుకోవాలన్నదే తన తాపత్రయం అని అన్నారు. మిర్చి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడతున్నారన్న అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే గతేడాది డిసెంబర్ 26, ఈ ఏడాది ఫిబ్రవరి 5, 11వ తేదీల్లో కేంద్రానికి లేఖ రాశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారుల నుంచి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. 


*పెట్టుబడి అధికమవుతోంది…*

మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మిర్చికి నల్లతామర తెగులుతో పంట నాణ్యత తగ్గడంతో పాటు దిగుబడి తగ్గిపోతోందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చు అవుతోందని వివరించారు. కూలీ ఖర్చులు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మరింత పెరిగాయన్నారు. అయినా కూలీలు దొరకడం లేదని అన్నారు. ఎన్నో వ్యయప్రసాయాలతో యార్డుకు పంటను తెస్తే ఉదయం పూట నిర్ణయించిన ధర మళ్లీ మచ్చుకుకు వచ్చిన తర్వాత ఉండటం లేదన్నారు. క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేనందువల్లే తగ్గిస్తున్నామని వ్యాపారులు సమాధానం చెప్తున్నారని, ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. యార్డుకు టిక్కీలు తేవాలంటే బాడిగకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని,  యూనియన్‌లో లేని లారీలను బాడిగకు తీసుకొస్తే వారిని మిగతా లారీ యజమానులు బెదిరించి, కేసులు పెడుతున్నారని వివరించారు. నాటి తెలుగు దేశం ప్రభుత్వంలో ఇచ్చినట్లు క్వింటాకు ఇంత అని బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. 


*కృష్ణపట్నం పోర్టు కంటెయినర్ నుంచి మిర్చి ఎగుమతులను అనుమతించాలి*

ఏపీ నుంచి మిరప ఎగుమతులు ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియాకు సాగుతాయని ఎగుమతి దారులు వివరించారు. అయితే ఈ యేడాది ఆయా దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో వచ్చిన వరదల కారణంగా, పురుగుమందులు ఎక్కువగా వినియోగించడం వల్ల, క్వాలిటీ కొంత దెబ్బతినడం వల్ల డిమాండ్ తగ్గుతుందని వివరించారు. కోల్డ్ స్టోరేజీల్లో కూడా గత పంటకు సంబంధించిన నిల్వలు అధికంగా ఉండటం వల్ల కొత్తగా వచ్చిన పంట నిల్వ చేసుకునేందుకు వీలు లేకుండా పోయిందని, తద్వారా రైతులు నేరుగా యార్డుకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని వ్యాపారులు తెలిపారు. రైతులకు ఆర్థిక అవసరాలు వెంటాడుతున్న కారణంగానే వెంటనే పంటను విక్రయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పండే 60 శాతం మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుందని, వివిధ దేశాలకు సరఫరా చేసే 410 మంది ప్రధాన ఎగుమతి దారుల్లో ప్రస్తుతం 250 మంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారని వివరించారు. కృష్ణపట్నం కంటెయినర్ టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్‌లను అనుమతించడం లేదని, ఈ కారణంగా మద్రాసు పోర్టుకు వెళ్లడం ద్వారా రవాణా అధికమయ్యాయని వివరించారు. అదే విధంగా గుంటూరులోని స్పైస్ పార్కులో కనీస సదుపాయాలు లేవని వ్యాపారులు వివరించారు. 


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాను కొందరు తమ గుప్పెట్లో పెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించవద్దని అధికారులకు సూచించారు. మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేసి మిర్చి టిక్కీలు కాటాలు వేసిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలు ఇచ్చేలా త్వరలో బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గుంటూరులోని స్పైస్ పార్క్‌లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు మిర్చిని కల్లాల్లో ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై రసాయనాల తగ్గుదల, పెట్టుబడి ఖర్చులు తగ్గించే అంశంపైనా సలహాలు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన భూసార పరీక్షలు మళ్లీ ప్రవేశపెడతామని, తద్వారా నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏఏ పంటలు సాగుచేసుకోవచ్చునో తెలుసుకోవచ్చు అన్నారు. క్వింటా మిర్చిధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ కింద  కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సీఎం తెలిపారు. దీనికి కేంద్రం అంగీకారం తెలిపింది అన్నారు. దీనిలో 50 శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉందన్నారు. అయితే ఈ విధానం అమలు చేస్తే పక్క రాష్ట్రాల్లోని రైతులు, వ్యాపారులు ఏపీకి పంటను తెచ్చి అమ్ముకునే ప్రమాదం ఉందని, తద్వారా ఏపీ రైతులకు న్యాయం జరగదని రైతులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. 2017లో కూడా ధర పతనమైనప్పుడు వెంటనే తమ ప్రభుత్వం స్పందించి క్వింటాకు రూ.1500 చొప్పున అందించామని, అందుకు రూ.135 కోట్లు ఖర్చు చేశామని  సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. 

*ఈ-క్రాప్ ఆధారంగా రైతులకు సాయం*

ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల వివరాలు, యార్డులో పంటను అమ్ముకుని రికార్డులో నమోదై ఉన్న వివరాలా ఆధారంగా రైతులకు సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి రైతులకు చెందాలే తప్ప మధ్య వర్తులకు, ఇతర వర్గాలకు కాదని స్పష్టం చేశారు. దీని కోసం గత అనుభవాలు కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా మామిడి, మిర్చి సాగు ఉన్నందును బోర్డు ఏర్పాటుపైనా త్వరలో చర్చిస్తామని సిఎం అన్నారు. తక్షణమే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం, అధికారులతో మాట్లాడి మిర్చి కంటెయినర్‌ల రవాణాకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు  పాల్గొన్నారు.

Comments