*రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహం
*
• *సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటకాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచనలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామన్న మంత్రి కందుల దుర్గేష్*
• *రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు*
• *పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధన, యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు*
• *అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులపై అధ్యయనం..రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయం*
• *ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు..త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి మండువాలోగిళ్లు..*
• *సీప్లేన్, హెలీ టూరిజంలు త్వరితగతిన పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచన*
• *మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం..*
• *తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు..*
• *జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ టూరిజం అభివృద్ధి*
• *క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక విభాగం.. స్పోర్ట్స్, మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహణకు ప్రాధాన్యం*
• *రాష్ట్రంలో ఐల్యాండ్ ల అభివృద్ధికి నిర్ణయం.. హోటల్స్ ఏర్పాటు చేసేందుకు ఇన్వెస్టర్లకు ఆహ్వానం..*
• *ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేలు, గండికోట, సూర్యలంక, లంబసింగి, అరకు, రాజమండ్రి, బ్రిడ్జిలంక ప్రాంతాల్లో రాణా ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలు ఏర్పాటు*
• *స్థానిక చేనేత, హస్తకళలకు, వంటకాలకు ప్రాధాన్యం కల్పించేలా నిర్ణయాలు*
• *అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రతి పర్యాటక కేంద్రంలో కెఫేలు ఏర్పాటు*
• *ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఎలిఫెంట్, టైగర్ సఫారీలు, బర్డ్ శాంక్చుయరీలు ఏర్పాటుకు చర్యలు*
• *విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఉన్న శిల్పారామాల్లో ఆడిటోరియంలు నిర్మాణానికి మార్గం సుగమం*
• *చంద్రగిరి కోట, కొండారెడ్డి బురుజు, కొంగుంది కోటలను అభివృద్ధి చేయాలని నిర్ణయం*
• *రాజధాని సమీపంలోని ఉండవల్లి, సీతానగరం, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని కొండలపై ట్రెక్కింగ్ ఏర్పాటు*
• *తిరుపతిని చైన్ ఆఫ్ ట్యాంక్ గా, వైజాగ్ ను సిటీ ఆఫ్ బీచెస్ గా తీర్చిదిద్దాలని నిర్ణయం*
• *కేంద్ర సహకారంతో చేపట్టే అఖండగోదావరి, గండికోట ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం*
• *ఇటీవల నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ బుక్ ను విడుదల చేసిన సీఎం.. పుస్తకం అద్భుతంగా రూపొందించారని కితాబు..*
అమరావతి (ప్రజా అమరావతి): రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధికి శాఖ తరపున విస్తృత ప్రచారం కల్పించి రానున్న ఐదేళ్లలో 20 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా, భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటకం అంటే కేవలం ఆదాయ వనరే కాదని రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రధాన వేదిక అని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన అన్ని సూచనలను త్వరలోనే ఆచరణలో పెడతామని, సరికొత్త ఆంధ్రప్రదేశ్ కు బాటలు వేస్తామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన పలు అంశాలను, సూచనలను, నిర్ణయాలను మంత్రి కందుల దుర్గేష్ వివరిస్తూ ఏమన్నారంటే... తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలంను మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి స్థానికంగా ఉన్న సమూహాలను భాగస్వామ్యులుగా చేసి సమీపంలోని డ్యామ్, అటవీ ప్రాంతం, టైగర్ సఫారి లను కలుపుతూ సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
*త్వరలో రాష్ట్రంలో ఐల్యాండ్ ల అభివృద్ధి..హోటల్స్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లకు ఆహ్వానం: మంత్రి కందుల దుర్గేష్*
విజయవాడలోని భవానీ ఐల్యాండ్, కాకినాడ సముద్రంలోని హోప్ ఐల్యాండ్, రాజమహేంద్రవరం సమీపాన ఉన్న పిచ్చుకలంక, అమరావతి సమీపంలోని ఐల్యాండ్స్ ను అభివృద్ధి చేసి సంబంధింత ప్రాంతాల్లో హోటల్స్ ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఆహ్వానించాలని సీఎం సూచించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
*రాష్ట్రంలో త్వరలోనే హోమ్ స్టేలు: మంత్రి కందుల దుర్గేష్*
ఎన్ఆర్ఐలను భాగస్వామ్యులను చేస్తూ జాయింట్ వెంచర్ గా రాష్ట్రంలో హోమ్ స్టేలను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపినట్లు మంత్రి అన్నారు. ఈ సందర్భంగా హోమ్ స్టే పాలసీపై సీఎం సానుకూలంగా స్పందించారని వివరించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్గించేలా ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మండువాలోగిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి సమీపంలోని ప్రాంతాలను కూడా సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారన్నారు. అదేవిధంగా కొండపల్లి, ఏటికొప్పాక, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి, శ్రీకాళహస్తి తదితర ప్రాచీన హస్తకళా ఖండాలకు, చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా హ్యాండీక్రాఫ్ట్స్ ను అనుసంధానం చేయాలన్నారు. అంతేగాక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి ధృవీకరించిన ఉత్పత్తులు, వాటి నేపథ్యాన్ని వివరించేలా క్యూఆర్ కోడ్ ను ఏర్పాటుచేసి పర్యాటకులకు అతిథ్యం కల్పించాలన్నారు.
*ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్*
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ లను నియమించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోటల్స్, శుభ్రంగా ఉండేలా నిర్వహణ, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో సైతం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించాలని సీఎం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్ లలో పాల్గొనాలని సూచించారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. టూరిజం అంటే ఈవెంట్స్, టాలెంట్స్, హోటల్స్, ట్రావెల్ అండ్ టూరిస్ట్ ఆపరేటర్స్, స్కిల్ ఇన్ స్టిట్యూషన్స్ అని సీఎం అభివర్ణించినట్లు మంత్రి తెలిపారు.
*రోప్ వేలు, రాణా ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలతో పర్యాటక రంగానికి నూతన శోభ*
రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పినట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. మరో 3,4 నెలల్లో గండికోట, సూర్యలంక, లంబసింగి, అరకు, రాజమండ్రి, బ్రిడ్జిలంక ప్రాంతాల్లో రాణా ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్టికల్, హారిజెంటల్ తరహాలో అంటే పర్యాటక ప్రాంతాల్లో మ్యూజియంలు, ఫోర్ట్ లు, శిల్పారామాలు, స్థానిక హస్తకళలు, ఎలిఫెంట్, టైగర్ సఫారీలు, బర్డ్ శాంక్చుయరీలు ఏర్పాటు చేస్తూ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
*అరకు కాఫీ బ్రాండ్ కు విస్తృత ప్రచారం..తద్వారా గిరిజన యువతకు ఆధారం*
అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రతి పర్యాటక కేంద్రంలో కెఫేలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ప్రసిద్ధి పొందిన రుచులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు.
*కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేపట్టే ప్రాజెక్టుల్లో వేగం..త్వరలోనే అందుబాటులోకి సరికొత్త పర్యాటకం: మంత్రి కందుల దుర్గేష్*
ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అన్ని వయస్కుల వారు ఆహ్లాదంగా గడిపేలా, పర్యాటక అనుభూతి పొందేలా ఆకర్షించాలన్నారు. గండికోట, ఒంటిమిట్ట, సోమశిల డ్యామ్, తాళ్లపాక అన్నమాచార్యుని స్వస్థలం వంటి ప్రాంతాలను టూరిజం సర్క్యూట్ లుగా ఏర్పాటు చేయాలన్నారు.
*మన రుచులకు విస్తృత ప్రచారం.. డబుల్ డెక్కర్ టూరిజం బస్సుల ఏర్పాటుకు రాచమార్గం..*
రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ప్రఖ్యాతి పొందిన వంటకాలకు సంబంధించిన అంశంపై సీఎం విస్తృతమైన ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సంబంధిత వంటలను తయారు చేసే చెఫ్ లను స్కిల్ డెవలప్ మెంట్ , టూరిజం ప్రాంతాల్లో అవసరమైన మేరకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల్లో పర్యాటక కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కాలేజీల్లో జరిగే స్నాతకోత్సవాలు, వార్షికోత్సవాల్లో పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. తదనుగుణంగా కాలేజ్ ల ఈవెంట్ క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. టూరిస్ట్ గైడ్స్ కు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రైవేట్ సంస్థల సహకారంతో పర్యాటకుల భధ్రతకు పెద్దపీట వేస్తూ స్వేచ్ఛగా విహరించేలా, మధురానుభూతిని ఆస్వాదించేలా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో డబుల్ డెక్కర్ టూరిజం బస్సులు ఏర్పాటు చేయాలన్నారు
*కెనాల్స్ ను అందంగా తీర్చిదిద్ది పర్యాటకంగా అభివృద్ధి చేయాలి*
రివర్ ఫ్రంట్ టూరిజంలో భాగంగా రాజమహేంద్రవరం, పాపికొండలు, అంతర్వేది ప్రాంతాల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించి అభివృద్ధి చేయాలన్నారు. ప్రధానంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువ, గుంటూర్ చానల్ తదితర ప్రాంతాలను వృద్ధి చేయాలన్నారు. సీప్లేన్, హెలీ టూరిజంలు త్వరితగతిన పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారన్నారు. తిరుపతిని చైన్ ఆఫ్ ట్యాంక్ గా, వైజాగ్ ను సిటీ ఆఫ్ బీచెస్ గా తీర్చిదిద్దాలన్నారు.ఎకో టూరిజంలో భాగంగా కంబాలకొండ శాంక్చుయరీ, శేషాచలం అడవులు, తలకోన, తిరుపతి, రాయచోటి, పీలేరు తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు.
*పురాతన కోటలకు సరికొత్త శోభ..*
తిరుపతి సమీపంలోని చంద్రగిరి కోట, కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు, చిత్తూరు జిల్లాలోని కొంగుంది కోటలను అభివృద్ధి చేయాలన్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా రాజధాని సమీపంలోని ఉండవల్లి, సీతానగరం, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని కొండలపై పర్యాటకులకు ట్రెక్కింగ్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఉన్న శిల్పారామాల్లో ఆడిటోరియంలు నిర్మించాలన్నారు.
*రాష్ట్ర పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పెట్టుబడులకు ఇదే సరైన సమయం*
రాష్ట్రంలో సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలు, అపార పర్యాటక వనరులు, సుదీర్ఘ సముద్రతీరం, చారిత్రాత్మక కోటలు, ప్రాశస్త్యం కలిగిన పురాతన దేవాలయాలు, సజీవ నదులు తదితర వేలాది పర్యాటక ప్రదేశాలున్నాయన్న సీఎం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, కొత్త టూరిజం పాలసీ అందుబాటులోకి వచ్చిందని వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించాలన్నారు. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని అనుమతులు ఆన్ లైన్ లో క్లియర్ చేయాలన్నారు. పెట్టుబడిదారులకు, ఉద్యోగులకు రాయితీలు, ల్యాండ్ లీజ్ కు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
*తదుపరి మీటింగ్ కి పురోగతి రావాలని సీఎం ఆదేశం..ఆచరించి చూపిస్తామన్న మంత్రి దుర్గేష్*
మరో 3,4 నెలల్లో తరువాత నిర్వహించే సమావేశం నాటికి ప్రతి జిల్లాల్లో స్థానిక ఈవెంట్స్ జరపాలన్నారు. పర్యాటకులకు సీప్లేన్ సేవలు వినియోగంలోకి రావాలన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్స్, బీచ్ లు, క్రూయిజ్ టూరిజం సేవలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది చివరి నాటికి హోటళ్లలో 20వేల రూమ్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 50 వేల రూమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సరైన సమయ ప్రణాళికతో ముందుకెళ్లి పూర్తి చేస్తామన్నారు.
సమీక్షా సమావేశం అనంతరం ఇటీవల నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అట్టహాసంగా నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ బుక్ ను సీఎం విడుదల చేశారు. పుస్తకం అద్భుతంగా రూపొందించారని మంత్రి కందుల దుర్గేష్, అధికార బృందాన్ని అభినందించారు.
సమీక్షా సమావేశంలో ఏపీటీడీసీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్, టూరిజం శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఐఏఎస్, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కమిషనర్ జి. వాణిమోహన్, ఐఏఎస్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, ఐఏఎస్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, ఐఏఎస్, ఈడీలు పద్మావతి, శేషగిరి, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment