*ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
*
*సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు*
*తలసేమియా బాధితులకు ట్రస్ట్ ద్వారా అండగా నిలబడతాం*
*ట్రస్ట్ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది*
*-ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి*
*విజయవాడలో ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన*
విజయవాడ, మార్చి 6 (ప్రజా అమరావతి): ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ...ఇప్పటివరకూ హైదరాబాద్ నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా విజయవాడలో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని భువనేశ్వరి తెలిపారు.
*ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సేవలు*
28 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్థాపించినప్పుడు చంద్రబాబు గారు మాకు ఒకటే మాట చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని సూచించారు. ఏ నమ్మకంతోనైతే ఆయన ఈ బాధ్యతలు అప్పగించారో వాటిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నాము. మాటల్లో చెప్పింది చేసి చూపిస్తున్నాము. ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానంటే అందుకు మా టీం సభ్యులే కారణం. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము పేదలకు సేవ చేస్తున్నామంటే అందుకు దాతల సహకారం మరువలేనిది. విరాళం ఎంతన్నది ముఖ్యం కాదు. పేదలకు అండగా నిలబడాలన్న ఆశయం ఎంతో గొప్పది. 2026 ఫిబ్రవరి నాటికి విజయవాడలో ట్రస్ట్ భవనం నిర్మాణం పూర్తి చేసి సేవలు ప్రారంభిస్తాము. ఈ ట్రస్ట్ భవనంలో ఆఫీస్, బ్లడ్ బ్యాంక్, తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇటీవల విజయవాడలో తలసేమియా బాధితుల సహాయార్థం నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన మాలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉత్సాహాన్ని కలిగించింది.
*ప్రజాసేవ పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోంది*
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదల ముఖాల్లో చిరునవ్వు. ఎన్టీఆర్ స్పూర్తితో, చంద్రబాబు గారి ఆలోచనలు, సహకారంతో ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. త్వరలో హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలో కూడా తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాము. అవి 24 గంటలూ పనిచేస్తాయి. ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ 7,531 మందికి శిక్షణ అందించాము. 2,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాగే కుప్పంలో 150 మంది మహిళలకు టైలరింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ, సిల్క్ దారంతో గాజుల తయారీ, చికెన్ కారీ ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇచ్చాము. చంద్రబాబు గారు మహిళలు ఆర్థికంగా పైకి రావాలి, వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని ఎపుడూ చెబుతుంటారు. డ్వాక్రా ఏర్పాటుతో అది ఆచరణలో చేసి చూపించారు కూడా.
*ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన*
ట్రస్ట్ ద్వారా సంజీవని ఆరోగ్య క్లీనిక్ లు నడుపుతున్నాము. ఈ క్లీనిక్స్ వల్ల ఒక లక్షా 60 వేల 290 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము. ఇందుకోసం రూ. 4 కోట్ల 2 లక్షల 50 వేలు ఖర్చు చేశాం. ట్రస్ట్ ద్వారా 14 వేల 56 హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించాము. వీటి ద్వారా 20 లక్షలమందికి ప్రయోజనం కలిగింది. ఇందుకోసం రూ. 22.43 కోట్లు ఖర్చుయింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో గండిపేటలో స్కూల్, మహిళఆ డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నాము. అందులో వచ్చిన లాభాలతో చల్లపల్లిలో స్కూలు నిర్వహిస్తున్నాము. పేద, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆ స్కూల్లో ఉచితంగా విద్య అందిస్తున్నాము. ఇందులో 2 వేల 20 మంది చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువు చెప్తాము. చల్లపల్లి స్కూల్లో పిల్లల క్రమశిక్షణ చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. పేదలు, తల్లిదండ్రులు లేని వారికి జీవితం విలువ బాగా తెలుస్తుంది. అందుకే వారంతా పట్టుదలతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
*విపత్తుల్లో ఆపన్నహస్తం*
విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సేవలు అందించాము. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీరుకొచ్చాం. కేరళలో వరదలు, హుద్ హుద్, తిత్లీ తుఫాన్, కర్నూలు వరదలు, విజయవాడ వరదల సమయంలో బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున న్యూట్రిఫుల్ యాప్ ను నిర్వహిస్తున్నాము. ఇందులో 16 మంది న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. బీపీ, షుగర్, అధిక బరువు వంటి సమస్యలపై వీరు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తారు. ట్రస్ట్ ద్వారా స్త్రీ శక్తి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాము. మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా 7 వేలమందికి పైగా మహిళలు ఆర్థిక ప్రయోజనం పొందారు. ఇందుకోసం రూ. 20 లక్షలు ఖర్చు చేశాము. అలాగే అన్ని దానాల్లో రక్తదానం గొప్పదంటారు. ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. అర్ధరాత్రి తలుపుతట్టినా రక్తం ఇచ్చేందుకు ముందుకొస్తున్న డోనర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. యుఫోరియా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.
*విరాళాలు అందించిన పలువురు దాతలు*
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా పలువురు దాతలు విరాళాలు అందించారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వాములు అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ట్రస్ట్ ద్వారా సేవలు ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు బెంజిసర్కిల్ లోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
addComments
Post a Comment