కొల్లిపర , 19 మార్చి 2025 (ప్రజా అమరావతి);: కొల్లిపర మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి ఆకస్మిక తనిఖీ
చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఇన్ అండ్ అవుట్ పేషెంట్ల నమోదు వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గర్భవతులకు సంబంధించి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేషంట్లకు సంబంధించిన పేషెంట్ చార్ట్ లను పరిశీలించి రోగులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. అనంతరం సామాజిక కేంద్రంలో టీబీ జబ్బుతో చికిత్స పొందుతున్న రోగులకు యంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా పౌష్టికాహార కిట్లను అందించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ మనిషి ఊపిరితిత్తులను దెబ్బతీసి మరణానికి గురి చేసే టీబీ జబ్బు ఒకప్పుడు ప్రాణాంతకంగా వుండేదన్నారు. నేడు ప్రభుత్వం మంచి ప్రభావవంతమైన మందులను టీబీ రోగులకు ఉచితంగా అందించి వారు వాటిని క్రమం తప్పకుండా సేవించే విధంగా వైద్య శాఖ ద్వారా పర్యవేక్షించడం కూడా జరుగుతున్నదన్నారు. ఈ జబ్బు రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వారికి ఎక్కువగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందని , అందువల్ల వారికి ఇమ్యూనిటీ పెరిగేందుకు మంచి ఆహారాన్ని అందించడం జరుగుతున్నదన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉచితంగా అందిస్తున్న మందులను ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా రోగి తీసుకుంటే జబ్బు పూర్తిగా నయం అవుతుందని తెలుపుతూ ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వుండరాదన్నారు. రోగి మందులను క్రమం తప్పకుండా తీసుకునేందుకు ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని , అందుకు వారికి అదనంగా మాసానికి వెయ్యి రూపాయలు కూడా ప్రభుత్వం అందించడం జరుగుతున్నదని ఈ సందర్భంగా వివరించారు. ఆ విధంగా ఆరు నెలల కాలానికి గాను ఆరు వేల రూపాయలు ఆశా వర్కర్లకు అందివ్వడం జరుగుతుందన్నారు. రోగులు క్రమం తప్పకుండా మందులను తీసుకుని మన జిల్లాను టీబీ ముక్త్ జిల్లాగా చేయడమే లక్ష్యంగా వుందన్నారు. అనంతరం యంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థ అందించిన పౌష్టికాహార కిట్లను టీబీ రోగులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా. రమేష్ , డియం అండ్ హెచ్ ఓ డా.విజయలక్ష్మీ, డిసిహెచ్ఎస్ మయానా మస్జిదాబి , యంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ మేఘన రెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక , కొల్లిపర తహశీల్దార్ సిద్ధార్ధ , యంపీడిఓ విజయలక్ష్మీ , మెడికల్ ఆఫీసర్ డా. భరత్ , తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment