అర్హులైన వైద్యులు ప్రొఫెసర్లుగా చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.

 అర్హులైన వైద్యులు ప్రొఫెసర్లుగా చేరేలా

చ‌ర్య‌లు తీసుకోవాలి


* *వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి  శ్రీ స‌త్య‌కుమార్ ఆదేశం*


*28 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి*


*32 శాతం అర్హులు ప‌దోన్న‌తులు పొంద‌డానికి నిరాక‌ర‌ణ‌*


*ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 33 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ* 


అమ‌రావ‌తి,మార్చ్ 11 (ప్రజా అమరావతి):

 ప్ర‌భుత్వ వైద్య కళాశాల‌ల్లో 33 శాతం ప్రొఫెస‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ, తాజా ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ‌లో అర్హులైన అభ్య‌ర్థుల్లో 32 శాతం మంది ప్రొఫెస‌ర్లుగా ప‌దోన్న‌తులు పొంద‌డానికి నిరాక‌రించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అర్హులైన వైద్యులు ప్రొఫెసర్లుగా బాధ్య‌త‌ల్ని చేప‌ట్టేలా   చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.


12 క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీలను గుర్తించి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన 28 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను కౌన్సెలింగ్ కు పిలిచారు.  పదోన్నతికి సంబంధించి

అభ్య‌ర్థులు కౌన్సిలింగ్ లో  సంసిద్ధతను వ్య‌క్తం చేయాల్సి ఉండ‌గా, అర్హులైన 28 మందిలో 19 మంది మాత్రమే ప్రమోషన్ పొందేందుకు అంగీకరించారు. మిగ‌తా 9 మంది త‌మ‌కు  కేటాయించిన‌ కాలేజీలు నచ్చకపోవడంతో ప్రమోషన్ తీసుకునేందుకు వారు  నిరాకరించారు. అంటే అర్హులైన అభ్యర్థుల్లో 32 శాతం మంది ప్రొఫెసర్లుగా పదోన్నతిని తిర‌స్క‌రించారు.  మిగిలిన 9 మందికి కూడా ఖాళీల ఆధారంగా పదోన్నతి క‌ల్పించిన‌ప్ప‌టికీ  వారు ప్రొఫెసర్లుగా చేర‌లేదు. 

  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో  (జీఎంసీ) 841 ప్రొఫెస‌ర్ పోస్టులుండ‌గా, 33 శాతం పోస్టులు ఖాళీగా ఉండడంపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లు పదోన్నతులు స్వీక‌రించేలా చర్యలు తీసుకోవాలని వైద్య,రోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.

 

తాజాగా ప్రొఫెస‌ర్లుగా ప‌దోన్న‌తి పొందిన వారిలో  జనరల్ సర్జరీ, సైకియాట్రీ విభాగంలో నలుగురు చొప్పున‌, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియాలో ముగ్గురు చొప్పున ఉన్నారు. ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్లో ఇద్దరు చొప్పున, ఈఎన్టీ, అనాటమీ, ఫార్మకాలజీలో ఒక్కొక్కరు చొప్పున ప‌దోన్న‌తులు పొందారు.  


      మూడేళ్ల బోధనానుభవం, ప్రసిద్ధ జర్నల్స్ లో 2 ప్రచురణలున్న అసోసియేట్ ప్రొఫెసర్లు...  ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందడానికి అర్హులు.  ఇటీవ‌లి కాలంలో  ప్రొఫెస‌ర్ మ‌రియు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు పెద్ద సంఖ్య‌లో  మంజూరైనందున ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ, అర్హులైన అభ్యర్థుల్లో 32 శాతం మంది త‌మ‌కు అనుకూల‌మైన చోట పోస్టులు ద‌క్క‌క‌పోవ‌డంతో ప్రొఫెస‌ర్ పోస్టుల్లో చేర‌క‌పోవ‌డం ప‌ట్ల  మంత్రి ఆందోళన‌ వ్య‌క్తం చేశారు.


ప‌దోన్న‌తులు అంగీక‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం....గ‌తంలో ఇలాంటి తిర‌స్క‌ణ‌లు రెండు సార్లు మాత్ర‌మే అనుమ‌తించ‌గా, అర్హులైన అభ్య‌ర్థులు ఎన్ని సార్లైనా ప‌దోన్న‌తుల్ని నిరాక‌రించ‌డానికి గ‌త కొంత కాలంగా అనుమ‌తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి త‌గిన చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్న‌తాధికారుల్ని ఆదేశించారు.



Comments