130 కిలోల గంజాయి పట్టివేత – ఒకరు అరెస్టు | ₹6.5 లక్షల విలువైన గంజాయి మరియు కారు స్వాధీనం.


 


*130 కిలోల గంజాయి పట్టివేత – ఒకరు అరెస్టు | ₹6.5 లక్షల విలువైన గంజాయి మరియు కారు స్వాధీనం



చీడికాడ, మే 20 (ప్రజా అమరావతి): విశ్వసనీయ సమాచారం ఆధారంగా చీడికాడ ఎస్ఐ సతీష్ మరియు అతని బృందం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒక నిందితుడిని అరెస్టు చేయడంలో విజయం సాధించారు. స్వాధీనమైన గంజాయికి మార్కెట్ విలువ సుమారు రూ.6,50,000/-గా అంచనా.


కేసు వివరాల్లోకి వెళితే – అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని నుండి అక్రమంగా గంజాయి తరలింపు జరగబోతున్నదన్న సమాచారం పై కె.కోటపాడు ఇన్స్పెక్టర్ శ్రీ పైడుపు నాయుడు ద్వారా సమాచారం అందగా, చీడికాడ ఎస్‌ఐ సతీష్ తన బృందంతో కలిసి చర్యలు చేపట్టారు. నిందితుడు కాశీ తేజ (26), బయలుపూడి గ్రామానికి చెందినవాడు, తన కారు లో గంజాయిని ఖండివరం గ్రామ శివారులో దాచి, వర్షం వలన పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందన్న నమ్మకంతో  తరలించేందుకు యత్నించాడు.


ఈ సమయంలో పోలీసులు అతని కారును అడ్డగించి డిక్కీ లో ఉన్న గంజాయిని ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌గా ఉన్న కాశీ తేజ 26 సం., లను అరెస్టు చేశారు. అయితే అతనితో పాటు పైలట్‌గా ఉన్న ముగ్గురు నిందితులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో ముందుకు వెళ్తున్న పోలీసులు ‘ఫార్వర్డ్ లింక్స్’ మరియు ‘బ్యాక్ వర్డ్ లింకులను’ గుర్తించి, త్వరలో మిగిలిన నిందితుల్ని కూడా అరెస్టు చేయనున్నారని కె.కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.పైడపు నాయుడు తెలిపారు.


ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ఎస్సై బి.సతీష్ మరియు వారి సిబ్బందిని జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.



Comments