ఇప్పటికే 47 చోట్ల విజయవంతంగా అమలు
రెవెన్యూ అధికారుల నియామకానికి ఆదివారం రాత పరీక్ష, 33 జిల్లా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
9చోట్ల సబ్ రిజిస్టార్ తో పాటు అదనపు సిబ్బంది నియామకం
నిషేధిత భూముల వివరాలకు ప్రత్యేక పోర్టల్
వీలైనంత త్వరలో గ్రామపరిపాలనాధికారుల సేవలు -
-రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
హైదరాబాద్ (ప్రజా అమరావతి);
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈనెల 12వ తేదీ నుంచి 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు విడతలు కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని, ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించిందని 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని తెలిపారు.
ఇప్పటికే అమలులో ఉన్న 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాదిరిగానే మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరమవుతుందని ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆస్తుల క్రయ విక్రయ దారులు స్లాట్ బుకింగ్ తర్వాత లాగిన్‌లో డిపార్ట్‌మెంట్ పోర్టల్ లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
స్లాట్ బుకింగ్ విధానంపై శనివారం నాడు మంత్రి గారు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయవలసిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.. రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందడమేగాక పారదర్శకత పెరుగుతుందని అన్నారు.
అదనపు సిబ్బంది నియామకం.
స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నామని పని భారం అధికంగా ఉన్న పఠాన్‌చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, ఇబ్రహీం పట్నం , సూర్యాపేట, జడ్చర్ల ,మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక పోర్టల్.
నిషేధిత జాబితాలోని ఆస్దులను ఎట్టి పరిస్దితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశామని నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లోహైదరాబాద్ లోని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్ లో తెలిసిపోయేలా వ్యవస్ధను ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడైనా నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఆదివారం నాడు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో జెఎన్‌టియు ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ పరీక్షకు సంబంధించి దాదాపు ఐదు వేల మందికి పైగా హాజరవుతారని ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం విఆర్‌వో , విఆర్ఎ వ్యవస్దను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్దను పటిష్టపరచడానికి గ్రామాలలో రెవెన్యూ సేవల పునరుద్దరణకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే గతంలో విఆర్‌వో , విఆర్ఎలుగా పనిచేసిన వారిలో ఆసక్తి గల వారు ఈ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా వీరి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
addComments
Post a Comment