50 వేల ఫారం పాండ్ల నిర్మాణం పూర్తి.

        50 వేల ఫారం పాండ్ల నిర్మాణం పూర్తి





   అమరావతి (ప్రజా అమరావతి);


         రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణంలో ఇప్పటిదాకా 50 వేల ఫారంపాండ్లు పూర్తయ్యాయి. ఇందులో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా 7,566, పార్వతిపురం మన్యం జిల్లా 6,317, అన్నమయ్య జిల్లా 5,181 పూర్తి చేసి మొదటి మూడు స్థానాలలో నిల్చాయి. 


రైతులకు ఫారం పాండ్ ఒక పంట సంజీవని అని, దీర్ఘకాలంలో  ఆదాయాన్నిచ్చే  బొప్పాయి, అరటి, జామ, కరివేపాకు వంటి మొక్కలను నాటుకోవచ్చని,  మందుల పిచికారికి ఈ నీటిని  వాడుకోవచ్చని, అలాగే  చేపలు కూడా పెంచుకోవచ్చని, బోరుబావి  ఉన్న పొలంలో  ఫారంపాండ్  తవ్వడం వల్ల  బావుల్లో  ఊట పెరిగి  రైతు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం సాగు చేసుకోవడానికి అవకాశముంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్  కృష్ణతేజ మైలవరపు అన్నారు.  


రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఫారం పాండ్ చుట్టూ వేసిన మట్టి కట్టపై ఆకుకూరలు, కాయగూరలు పండించుకుని అదనపు ఆదాయాన్ని పొందాలని రైతులకు ఆయన  పిలుపునిచ్చారు. ఆకుకూరలు, కాయగూరల విత్తనాలకు అయ్యే ఖర్చు కూడా పని అంచనాలో చేర్చి, ఉపాధి హామీ నిధుల నుంచి ఆ మొత్తాలను రైతులకు చెల్లిస్తామని ఆయన తెలిపారు. 


ఉపాధి హామీ పథకంలో ఫారపాండ్ల నిర్మాణం  ఉచితంగా చేపట్టడం వల్ల  రైతుకు  50 వేల రూపాయల వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఫారంపాండ్ నిర్మాణం వల్ల పొలం  నష్టపోతామనే అనే భావన నుంచి బయటకు వచ్చి, బహువిధ ఆదాయాన్నిచ్చే ఫారం పాండ్ ను  తవ్వించుకుని ప్రతి ఒక్క రైతు  లబ్ది పొందాలని ఆయన సూచించారు.


ఒక ఫారం పాండ్   నిర్మాణం వల్ల  రైతులు ఒక వర్షానికి  లక్షా 80 వేల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చని,  1.55 లక్షల ఫారం పాండ్లలో ఒకసారికి దాదాపు ఒక టిఎంసీ వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్  కృష్ణతేజ మైలవరపు తెలిపారు.

Comments