*పౌరసరఫరాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించండి.


*పౌరసరఫరాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించండి*


*ప్రజల సంతృప్తి పరమావధిగా తీర్చిదిద్దండి*

*మే 15 నుంచి వాట్సప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ*

*అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం*

అమరావతి, మే 8 (ప్రజా అమరావతి): రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.... అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్‌డబ్ల్యుఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. మరోవైపు, రైస్ కార్డులకు సంబంధించి ఈనెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్‌ మన మిత్ర కింద సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

*3.94 కోట్ల మందికి ఈ కేవైసీ పూర్తి :*

రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రైస్ కార్డులు ఉండగా, అందులో 4,24,59,028 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటికే 3.94 కోట్ల మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. ఇంకా 23 లక్షల మంది ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది. 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు, అలాగే 80 ఏళ్లకు పైబడిన వారికి ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వచ్చే నెల 30 కల్లా రాష్ట్రంలో అందరికీ ఈ కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే, ఈ నెల 7 నుంచి కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పాటు స్ప్లిట్టింగ్, అడిషన్, డిలీషన్, సరెండర్, అడ్రస్ మార్పు, అప్డేషన్ వంటి 7 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి విశేష స్పందన వస్తోంది. 

*50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ :* 

గడిచిన ఖరీఫ్ సీజన్లో 35.94 లక్షల మెట్రిక్ టన్నులు, రబీ సీజన్లో 14.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రైతులకు ఖరీఫ్‌లో రూ.8,278 కోట్లు, రబీలో రూ.3,076 కోట్లు ధాన్యం సేకరణ నిమిత్తం చెల్లించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments