తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రిని కోరిన ముఖ్యమంత్రి.

   న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);



      తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి  వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానమంత్రి ని కోరారు. 

 హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి  విన్నవించారు. గతంలో నిర్మించిన 69 కి.మీ ఫేజ్-I తరువాత నగర విస్తరణకు అనుగుణంగా 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం. ఇటీవలి కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలన్నారు.

 హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఒకేసారి ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోరారు. ఇప్పటికే భూ సేకరణలో పురోగతి ఉన్న ఉత్తర భాగం పూర్తయ్యేలోపు దక్షిణ భాగాన్ని చేపట్టకపోతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

 రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే (Regional Ring Railway) లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనికి కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి  విజ్ఞప్తి చేశారు. 

 తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం (బందరు) పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

 ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రి కి ముఖ్యమంత్రి  తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రముఖ R&D కేంద్రాలు, మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.

 హైదరాబాద్ మొదటి నుంచి రక్షణ రంగంలో కీలకంగా ఉంటోన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో MSMEలకు ప్రోత్సాహం అవసరమన్నారు. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు సమానంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి  అన్నారు.


Comments