ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నడిపించడంలో మంత్రిత్వ శాఖలతో చేతులు కలిపిన యోగ సంస్థలు.

 

ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నడిపించడంలో మంత్రిత్వ శాఖలతో చేతులు కలిపిన యోగ సంస్థలు


దేశవ్యాప్త సంసిద్ధతను సమీక్షించిన అంతర్‌ మంత్రిత్వ కమిటీ: విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి యోగా మహోత్సవానికి నేతృత్వం వహించనున్న ప్రధానమంత్రి

 29 MAY 2025  Hyderabad (prajaamaravati);

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై  ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా, సంబంధిత మంత్రిత్వ శాఖల కమిటీ న్యూఢిల్లీ చాణక్యపురి లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించి, అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించడంపై చర్చించాయి. సంపూర్ణ ప్రభుత్వ విధానం ( హోల్ ఆఫ్ గవర్నమెంట్) విధానం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ,  ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించే యోగా దినోత్సవ వేడుక కోసం విస్తృత,  ప్రభావవంతమైన ప్రజా భాగస్వామ్యాన్ని సమీకరించేందుకు ఈ సమావేశం ప్రధాన మంత్రిత్వ శాఖలు, ఆయుష్ సంస్థలు,  భాగస్వామ్య విభాగాలకు చెందిన సీనియర్ అధికారులను ఏకతాటిపైకి తెచ్చింది.

కేంద్ర ఆయుష్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ ప్రధానోపన్యాసం చేస్తూ, యోగాను ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో పూర్తి ప్రభుత్వ విధానం ప్రాముఖ్యతను వివరించారు. "అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు- ఇది సంపూర్ణ ఆరోగ్యం కోసం భాగస్వామ్య నిబద్ధతతో మంత్రిత్వ శాఖలు, సంస్థలు, పౌరులను ఏకం చేసే ఉద్యమం" అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా భారత్‌లోనూ,  విదేశాల్లోనూ ఇప్పటివరకు నిర్వహించిన 250కుపైగా కార్యక్రమాల ద్వారా వెల్లువెత్తిన ఉత్సాహాన్ని మంత్రి వివరించారు.  ఇక చివరి దశ సన్నాహాల్లో ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 13 నుంచి ప్రతిరోజూ కౌంట్ డౌన్ కింద ఇప్పటివరకు 76 కార్యక్రమాలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వివిధ దేశాల ఉత్సాహభరితమైన భాగస్వామ్యం  యోగా ఉద్యమానికి ప్రపంచ స్థాయి స్పందన ను స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశాన్ని ప్రస్తావిస్తూ, యోగా దినోత్సవ సన్నాహాల ముగింపు దశలకు ఈ సమావేశం అందించిన వ్యూహాత్మక మార్గదర్శకాలను వివరించారు. అలాగే మొత్తంగా యోగా ప్రోటోకాల్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన యోగా గురువులకు శ్రీ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొనేలా చూడాలని విస్తృతంగా పాల్గొనేలా చూడాలని అన్ని శాఖలను కోరారు.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన స్వాగతోపన్యాసంలో,  ఐడివై 2025 ప్రాముఖ్యతను వివరించారు. ఐడివై అతిపెద్ద ప్రపంచ ఉద్యమాలలో ఒకటిగా మారిందని, 2024లో ఒక్క భారత్‌లోనే సుమారుగా 24 కోట్ల మంది పాల్గొన్నారని తెలియజేశారు. ఫ్లాగ్ షిప్ ఈవెంట్ యోగా సంగం కింద ఈ సంవత్సరం మరింత పెద్ద భాగస్వామ్యాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, 2025 జూన్ 21 న ఒకేసారి లక్షకు పైగా యోగా కార్యక్రమాలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి ప్రధానమంత్రి జాతీయ వేడుకలకు నేతృత్వం వహిస్తారని ఆయన ప్రకటించారు.

 

ఐడివైని ఒక రోజు వేడుకగా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని కార్యదర్శి స్పష్టం చేశారు. జెనీవాలో ఇటీవల జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ఐడివై 2025లో ప్రపంచ భాగస్వామ్యం కోసం భారతదేశం ఇచ్చిన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన “వన్ వరల్డ్, వన్ హెల్త్” ఇతివృత్తంతో అన్వయమయ్యే ఐడివై 2025 ఇతివృత్తం  “యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” కు అనుగుణంగా  ప్రధాన రంగాలను ప్రాతినిధ్యం చేసే పది ప్రత్యేక కార్యక్రమాలను ఆలోచనాత్మకంగా రూపొందించినట్టు  అయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. యోగ గురువులు, ఆయుష్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసికట్టుగా పనిచేసి ఐడివై 2025ను ఒక ప్రభావవంతమైన, మార్పుకు దోహదపడే అనుభవంగా మలచాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓఎస్డీ - ఐడివై సమన్వయంతో ఇచ్చిన ఒక సమగ్ర ప్రజంటేషన్ లో భాగస్వాముల నుంచి అవసరమైన సన్నాహాలు, మద్దతు గురించి వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో యుఎన్ జిఎలో  చేసిన తీర్మానం మేరకు 2015 లో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం సంపూర్ణ ప్రభుత్వ స్థాయి నుంచి సంపూర్ణ జాతీయ స్థాయి ఉద్యమంగా రూపు దాల్చిందని ఓఎస్డీ పేర్కొన్నారు. ఐడీవై 2025కు సన్నాహకంగా మైగవ్ లో 'యోగా అన్ ప్లగ్డ్‘   సిరీస్ కింద ఆన్లైన్ కార్యక్రమాలతో సహా ఇప్పటివరకు 250కి పైగా ఈవెంట్లను నిర్వహించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో జరిగే జాతీయ కార్యక్రమానికి 5 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామని, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు దేశవ్యాప్తంగా 150 ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఐడివై కార్యక్రమాలను నిర్వహిస్తాయని ఓఎస్డీ తెలిపారు.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాస్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు — ఇది ప్రపంచానికి భారత్ అందించిన శాశ్వతమైన కానుకను  జరుపుకునే ఒక మహోత్సవం” అని పేర్కొన్నారు. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో, మన ప్రధాన దృష్టి గట్టి నిబద్ధత, విస్తృత వ్యాప్తి, దీర్ఘకాలిక ప్రభావంపై ఉందని శ్రీమతి మోనాలిసా దాస్ పేర్కొన్నారు. పూర్తి ప్రభుత్వ దృక్పథంతో  ఐడివై 2025ను అసలైన సమ్మిళిత, మార్పునిచ్చే కార్యక్రమంగా మలచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ పట్ల భారతదేశ నిరంతర నిబద్ధతను ప్రతిబింబించేలా సమష్టి కార్యాచరణ, భాగస్వామ్య బాధ్యతతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అపూర్వ స్థాయిలో జరుపుకోవాలని పిలుపునిస్తూ సమావేశం ముగిసింది, 

Comments