యోగాంధ్ర లక్ష్యం.. ప్రతి ఒక్కరికీ యోగ ప్రయోజనాలు దక్కేలా చూడడమే.


రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


** యోగాంధ్ర  లక్ష్యం.. ప్రతి ఒక్కరికీ యోగ ప్రయోజనాలు దక్కేలా చూడడమే.


** యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి 

** మానసిక ప్రశాంతత.. సంపూర్ణ ఆరోగ్యం..  యోగాతో సాధ్యం 

** సమాజంలో ఉన్న వివిధ వర్గాలను భాగస్వాముల్ని చేసే క్రమంలో 25 రోజుల యోగా సాధన కార్యక్రమం

** రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం* 


- మంత్రి కందుల దుర్గేష్ 
- కలెక్టర్ పి ప్రశాంతి 


రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం* 



డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు..చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్ల నాటి వృక్షాలు మరోవైపు..మనసుకి ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకోవైపు. వీటి నడుమ భానుని ప్రభాత కిరణాల వెలుగులో, జీవ వైవిధ్య పురస్కారం పొందిన రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగరంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు (ప్రిజన్స్) అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్రకారాగారంలోని 1300 మంది ఆశ్రమ వాసులు సహా దాదాపు 1500 మంది యోగ సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా, శాసన పరిషత్ (కౌన్సిల్) సభ్యులు సోము వీర్రాజు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ జి. చిన్న రాముడు,  జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత కె.ఎల్. వి.శ్రీధర్ రెడ్డి ఆశ్రమ వాసులచే యోగాసనాలు వేయించారు. అత్యంత సంక్లిష్టమైన గండభేరుండాసనం, ఊర్ధ్వ కుక్కుటాసనం, బ్రహ్మాస్త్రాసనం, కైలాసాసనం, మలయాసనం, సుగ్రీవాసనం వంటి ఆసనాలను ఆయన కుమారుడు, ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థి అయిన కార్తీక్ రామచంద్ర  రెడ్డి అద్భుతంగా ప్రదర్శించారు. ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి సెకన్ల వ్యవధిలోనే మారి అందరిని అబ్బురపరిచారు. అతిథుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో నెలరోజులపాటు యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  స్వయంగా యోగాభ్యాసన చేస్తున్నారని,వారి మార్గదర్శకత్వంలో యోగాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. జూన్ 15వ తేదీన తిరుపతిలో సినిమా రంగ ప్రముఖులతో (సెలబ్రిటీలు) ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో 1,23,000 మందితో యోగా సాధన చేసి నెలకొల్పిన రికార్డును అధిగమించాలన్న సంకల్పంతో విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇది రికార్డుల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని, మానసిక శారీరక ఆరోగ్యానికి యోగ దోహదపడుతుందనే సందేశం ప్రతి ఒక్కరికి చేర్చి, వారు యోగ సాధన చేసేలా ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలియజేశారు. యోగాను జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని,ప్రజలంతా యోగాభ్యాసం చేయాలని మంత్రి కోరారు.

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ .. యోగ సాధన  ఒక రోజుతో పూర్తి కాదని ఇది నిరంతర ప్రక్రియని, ప్రతి ఒక్కరూ యోగ ప్రయోజనాలు పొందాలి అనే ఉద్దేశ్యం తో నెల రోజులపాటు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఐదు రోజులపాటు ప్రధాన శిక్షకులకి (మాస్టర్ ట్రైనర్స్) శిక్షణ ఉంటుందని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ర్యాలీలు,పోటీలు నిర్వహిస్తారని తెలియజేశారు. యోగ ఒక మతానికి సంబంధించినది కాదని,ఇది శరీరాన్ని, మనసుని సమన్వయపరిచే ప్రక్రియని వివరించారు. యోగాను ఆరోగ్య శాఖకో, యోగా సంఘాలకో సంబంధించిన వ్యవహారంగా చూడరాదని,  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగా సాధన చేయాలని సూచించారు.



శాసన పరిషత్ (కౌన్సిల్) సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ...   యోగా అనేది ఋషులు ప్రవచించిన విద్య అని, వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో యోగ సాధన చేస్తున్నామని తెలియజేశారు. భారతదేశం ప్రపంచానికి మార్గదర్శి, తత్వవేత్త (గైడ్ & ఫిలాసఫర్) అని, ఏనాటికైనా భారత్ "విశ్వ గురు" స్థానాన్ని అలంకరించాలని ఆకాంక్షించారు.  మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం సరిగా ఉంటుందని, తద్వారా వైద్యంపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని, దీనిని గ్రహించే స్వచ్ఛభారత్, స్వచ్ఛ్ ఆంధ్ర వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ఈ యోగాంధ్ర కూడా అదే కోవలోకి వస్తుందని యోగా సాధన తో మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చని వివరించారు. అయ్యంగార్ వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో యోగా బోధన చేశారని చెప్పారు. ఆశ్రమ వాసుల్లో కొందరు యోగా శిక్షకులుగా మారాలని, నిరంతరం యోగ సాధన చేయాలని ఆయన సూచించారు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోది వచ్చినప్పుడు యోగ, ధ్యానం గురించి పేర్కొంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు విశాఖపట్నం వస్తున్నానని చెప్పారని, ఆ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.

 
అంతకుముందు కారాగార ఆశ్రమ వాసులు పండించిన కూరగాయలు, తయారుచేసిన బీరువాలు, ర్యాక్ లు,  మేజా బల్లలు (టేబుల్స్), కుర్చీలు, పుస్తకాలు, షర్టులు ప్యాంట్లు, చీరలు, బెడ్ షీట్లు వంటి వాటిని పర్యవేక్షణ అధికారి రాహుల్ అతిథులకు చూపించారు. కొన్ని వస్త్రాలను రాష్ట్రంలోని ఇతర జైళ్ళకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు ఇస్తే పాఠశాల ఏకరూప దుస్తులు (స్కూల్ యూనిఫామ్ లు) సహా ఇతర దుస్తులు కుట్టి ఇస్తున్నట్లు తెలిపారు.ఈ ఉత్పత్తులు కారాగారం వెలుపల గల విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉంచామని చెప్పారు. 




ఈ యోగా సాధన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్,  అదనపు ఎస్పీ రమేష్ బాబు , జిల్లా రెవెన్యూ అధికారి టి . సీతారామ మూర్తి, సెంట్రల్ జైలు అధికారులు బి. రత్న రాజు, ఆర్. శ్రీనివాసులు, జిల్లా ఆయుష్ వైద్యులు కే రమేష్, రాష్ట్రపతి అవార్డ్ పురస్కార గ్రహీత, సెంట్రల్ జైలు ఉపాధ్యాయులు కే. శ్రీనివాస రావు, యోగాంధ్ర జిల్లా సమన్వయ కర్త పి. కేజియ , జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె వెంకటేశ్వర రావు, యోగా గురువు కే ఎన్ వి శ్రీధర్ రెడ్డి, మాస్టర్ కే.కార్తీక్, ఇతర జిల్లా అధికారులు, జైలు సిబ్బంది దుర్గా రమేష్, సురేష్, రమేశ్, రామారావు, తడుతరులు పాల్గొన్నారు.





Comments