జీజిహెచ్ ల‌కు రూ.50 కోట్ల వ్య‌యంతో అద‌న‌పు డ‌యాగ్నోస్టిక్ యంత్రాలు.


అమ‌రావ‌తి (ప్రజా అమరావతి);



*జీజిహెచ్ ల‌కు రూ.50 కోట్ల వ్య‌యంతో  అద‌న‌పు డ‌యాగ్నోస్టిక్ యంత్రాలు*


*6 సిటి స్కాన్లు, 3 క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు మంత్రి అనుమ‌తి*


ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌నాసుప‌త్రుల్లో(జీజీహెచ్‌లు)  రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాన్ని పెంచే ప్ర‌య‌త్నంలో భాగంగా 9 ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌నాసుప‌త్రుల్లో సిటి స్కాన్లు, క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేర‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదించారు. 


అద‌న‌పు అవ‌స‌రాల అంచ‌నాల మేర‌కు విశాఖ‌ప‌ట్నం, కాకినాడ‌, గుంటూరు, తిరుప‌తి మ‌రియు క‌ర్నూలులోని జిజిహెచ్‌ల‌లో సిటి స్కాన్లను ఏర్పాటు చేస్తారు.  విశాఖ‌ప‌ట్నంలోని జిహెచ్ సిసిడి( గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ ఫ‌ర్ చెస్ట్ అండ్ క‌మ్యున‌క‌బుల్ డిసీజెస్‌)లో మొద‌టి సారిగా సిటి స్కాన్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ నిధుల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఈ ప‌రిక‌రాల‌కు రూ.27 కోట్లు వ్య‌య‌మ‌వుతుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు 18 జీజిహెచ్‌ల‌లో 21 సిటి స్కాన్ ప‌రిక‌రాల ద్వారా రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. 


మంత్రి ఆమోదం మేర‌కు శ్రీకాకుళం,నెల్లూరు మ‌రియు తిరుప‌తిల్లోని జీజిహెచ్‌ల‌లో గుండె ప‌రీక్ష‌లు చేసే 3 క్యాథ్‌ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ప్రైవేట్ భాగ‌స్వామ్యం ద్వారా ఏర్పాట‌య్యే ఈ ప‌రిక‌రాల కొనుగోలు ఖ‌రీదు దాదాపు రూ.17 కోట్లు.


ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, కాకినాడ‌, గుంటూరు, ఒంగోలు, క‌ర్నూలు, క‌డ‌ప మ‌రియు అనంత‌పుర‌ము జీజీహెచ్ ల‌లో క్యాథ్ ల్యాబ్ ల ద్వారా హృద‌య  స‌మ‌స్య‌ల్ని ప‌రీక్షించి యాంజియోగ్రామ్‌, స్టెంట్ల ఏర్పాటు సేవ‌లందిస్తున్నారు.

Comments