ఇటు డైవర్షన్‌. అటు అసహనం.

 


తాడేపల్లి (ప్రజా అమరావతి);




వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.




ఇటు డైవర్షన్‌. అటు అసహనం


:

– రాష్ట్రంలో ఈరోజు దిగజారిన శాంతి భద్రతలు, పాలనా వైఫల్యాలు. మోసాలు. అబద్దాల మధ్య చంద్రబాబు పాలన సాగుతోంది.

– జూన్‌ 4న వైయస్సార్‌సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అన్ని చోట్లా ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. 

– ఏడాది గడిచే నాటికే ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో దేశ చరిత్రలో కూడా జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వం మీద అంత తీవ్రత వచ్చింది.

– ఈ నేపథ్యంలో చంద్రబాబుగారు చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌ మాత్రమే కాకుండా అసహనం కూడా ప్రతి మాటలో కనిపిస్తోంది. నియంతలా మారి, అణిచివేత అన్న పదానికి నిర్వచనంగా మారారు.


నా పర్యటనపై ఎందుకు ఆ ఆంక్షలు:

– నిన్న పల్నాడు జిల్లాలో నా పర్యటన కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. ప్రజలు లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం తప్పా? ఒక ప్రతిపక్ష నేత ఆ పని చేయొద్దా? ఎందుకిన్ని ఆంక్షలు పెట్టాలి. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టాలి?. ప్రజలు రావొద్దని ఆదేశించాలి? ప్రతి చోటా కట్టడి ఎందుకు చేయాల్సి వచ్చింది?.

– ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు, కార్యకర్తల్లో విప్లవం వచ్చింది. 

– ప్రతిపక్ష నేత ప్రజలను కలవడానికి వెళ్లినప్పుడు, పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే ఎందుకిన్ని ఆంక్షలు?


పొదిలి పర్యటనలో కుట్రకు ప్రయత్నం:

 – మొన్న పొదిలి వెళ్లినా అలాగే చేశారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే ఆ రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నేత వెళ్తే, దాదాపు 45 వేల మంది ప్రజలు తరలి వచ్చారు. అప్పుడు ఒక 40 మందితో రాళ్లు వేయాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరం.

– రైతుల సమస్యలు హైలైట్‌ కావొద్దా? రైతుల తరపున ఎవరూ మాట్లాడొద్దా? రైతుల సమస్యలు ఎవరూ పట్టించుకోవద్దా? అందుకే ఆ కార్యక్రమాన్ని డిస్ట్రబ్‌ చేయాలని చూశారా?

– 40 మందితో గొడవ చేయించి, తిరిగి రైతుల మీదే కేసులు పెట్టారు? 

– రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరిని కనీసం రూ.300కు తక్కువ అమ్ముకుంటున్నారు.


– అన్ని పంటలు.. చివరకు పొగాకు, మామిడికి కూడా కనీస మద్దతు ధర రావడం లేదు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

– ఇటీవలే ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చిలకలూరిపేటలో ఇద్దరు, వినుకొండలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

– ప్రకాశం జిల్లాలో మన కళ్లెదుటే ముగ్గురు రైతుల ఆత్మహత్యలు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి తోడుగా నిలబడడం లేదు.


భూస్థాపితం చేస్తాడంట!:

– ప్రజా సమస్యలపై ఎవరైనా గొంతు విప్పితే, చంద్రబాబు మాటలు.. భూస్థాపితం చేస్తానంటున్నాడు. 76 ఏళ్ల వయస్సు. సీఎం పదవిలో ఉండి, ఒక ఎల్లో మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూలో అన్నాడు. విపక్షనేతను భూస్థాపితం చేస్తానని చెప్పాడు.

– ఆ ఛానల్‌ అడుగుతుంది. ఆయన సమాధానం చెప్పాడు. ఈ వయసులో ఆ మాటలేమిటి? తొక్కుతా, తాట తీస్తా, భూస్థాపితం చేస్తా.. ఏమిటా మాటలు.

– అబద్దాలు, మోసాల పాలన. ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానని పెద్దమనిషి మాట్లాడుతున్నాడు.


చెవిరెడ్డిపై దారుణ అక్రమ కేసు:

– ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకుంది. దాంతో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రజలు ప్రశ్నించకుండా గొంతు నొక్కేందుకు, మా పార్టీ నాయకులపై చంద్రబాబు పెడుతున్న తప్పుడు కేసులు దారుణం.

– ఎవరూ నోరు విప్పకూడదన్న ఉద్దేశం. అందుకే తప్పుడు కేసులు. టాపిక్‌ డైవర్షన్‌.

– తప్పుడు కేసుల సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ, మొన్న నా కార్యక్రమానికి ఒకరోజు ముందు.. టాపిక్‌ డైవర్షన్‌ మాత్రమే కాకుండా, ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం కోసం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు.

– ఏడాది నుంచి చూస్తున్నాం. లిక్కర్‌ కేసులో ఎప్పుడైనా ఆయన పేరు వినిపించిందా? భాస్కర్‌ను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. 

– అందుకోసం ఆయన మాజీ గన్‌మెన్‌తో తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇప్పించుకోవడం కోసం.. ఆయన్ను కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తే.. దెబ్బలు తిన్న కానిస్టేబుల్‌.. ఏకంగా వీడియో తీసి, తన దెబ్బలు చూపుతూ, జరిగిన ఘటనపై డీజీపీకి లేఖ రాశాడు. కాపీని గవర్నర్, రాష్ట్రపతికి పంపించాడు. కోర్టులో కేసు వేస్తే విచారణకు వచ్చింది.

– ఏడాది నుంచి ఏనాడూ లిక్కర్‌ కేసులో భాస్కర్‌రెడ్డి పేరు లేదు. కేసులో ఆయన్ను ఇరికించేందుకు మరో కానిస్టేబుల్‌తో స్టేట్‌మెంట్‌ ఇప్పించారు. గిరి అనే కానిస్టేబుల్‌తో స్టేట్‌మెంట్‌ ఇప్సించి, తప్పుడు సాక్ష్యం సృష్టించి అరెస్టు చేశారు.

– ఎవరితో ఎక్కువ ఫోన్లు మాట్లాడితే, ఆ వ్యక్తిని తీసుకొచ్చి, వేధించి తప్పుడు సాక్ష్యం సృష్టించి కేసు పెడుతున్నారు.

– ఆ పని చేయడానికి ఒక కానిస్టేబుల్‌ ఒప్పుకోకపోవడంతో హింసించారు. కేసులో ఇరికించాలంటే ఎవరినైనా ఇరికించొచ్చు. నాయకుల దగ్గరున్న గన్‌మెన్‌ను పట్టుకుంటే చాలు. భాస్కర్‌ కేసులో సరిగ్గా ఇదే జరిగింది. 

– దీని వల్ల సామాన్యులు బ్రతకలేరు. సాక్ష్యాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు. నక్సలిజమ్‌ అలాగే పుడుతుంది. రాష్ట్రానిన బిహార్‌ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు.

– ఇవన్నీ ఎందుకంటే, భాస్కర్‌రెడ్డి చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన వాడు. అంటే, తన సొంత నియోజకవర్గంలో ఎవరూ ఉండొద్దని చంద్రబాబు ఉద్దేశం.

– గతంలో చంద్రబాబును ఓడిస్తే, కుప్సం పోయాడు. ఇప్పుడు చంద్రగిరిలో తనకు ఎదురు ఉండొద్దని భాస్కర్‌పై కేసులు పెట్టి అరెస్టు చేశారు.


వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు:

– మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిలో మాజీ ఎమ్మెల్యేపై కేసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై రెండుసార్లు కేసులు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్‌ తెస్తే, మరో కేసు పెట్టి అరెస్టు చేశారు. సురేష్‌ భార్యపైనా కేసు పెట్టారు.

– వల్లభనేని వంశీ. దాదాపు 2 నెలలు పూర్తి. వరస కేసులు పెట్టి బయటకు రాకుండా చేస్తున్నారు.

– జోగి రమేష్‌ కుమారుడు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, నా ఓఎస్డీ ఆర్డీఓ కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, బాలాజీ కేసీ రెడ్డి, గోవిందప్పను అరెస్టు చేశారు.

– మా ఎంపీ మిధున్‌రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నారు.

– పేర్ని నాని, ఆయన భార్యపైనా కేసులు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు. దేవినేని అవినాష్, తలసిల రఘురాం, అంబటి రాంబాబు, విడదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతమ్‌రెడ్డి, మేరుగ నాగార్జున, దాడిశెట్టి రాజా. ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు. అలా కేసులు పెట్టడం ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలన్న కుట్ర.

– జగన్‌ చుట్టూ ఉన్న వారిని భయపెట్టాలి. మోడస్‌ ఆపరెండి ఒక్కటే. చిన్న చిన్న వ్యక్తులను భయపెట్టడం, కొట్టడం, తప్పుడు స్టేట్‌మెంట్లు తీసుకోవడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, పెద్దవారిని అరెస్టు చేయడం. అన్నీ తప్పుడు ఆలోచనలు. తప్పుడు పనులు.


కొమ్మినేనిగారు ఏం తప్పు చేశారని..:

– అన్నింటికన్నా బాధ. ఆశ్చర్యకరం. 70 ఏళ్ల వయసున్న సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. ఏం పాపం చేశాడు? ఆయన్ను జైలుకు పంపాడు చంద్రబాబు.

– ఒక డిబేట్‌లో అనలిస్టు మాట్లాడితే, యాంకర్‌కు ఏం సంబంధం? అలాంటిది ఆయన్ను తీసుకొచ్చి లోపల వేశారు. గతంలో ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టాడు. ఆయనపై చంద్రబాబుకు కక్ష. ఆయన జీవితం నాశనం చేయాలి. పరువు పోగొట్టాలన్న కుట్ర.


వ్యూహాత్మకంగా సాక్షిపై దాడులు:

– కొమ్మినేనిగారిని అరెస్టు చేయడమే కాకుండా, సాక్షిని, సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఒక వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్దంగా చేశారు.

అంటూ..

రాష్ట్రంలోని పలు చోట్ల సాక్షి ఆఫీసుపై దాడుల ఫోటోలు చూపుతూ.. అందులో ఎవరెవరు, ఏ టీడీపీ నాయకులు పాల్గొన్నది వివరించారు. 


– ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యూహంతో, కుట్రతో ఇలా చేయొచ్చా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారి గొంతు నొక్కడం కోసం నీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అలా దాడి చేయించడం ధర్మమేనా?

– కొమ్మినేని గారి కేసులో సుప్రీంకోర్టు ఏమంది? ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.


చంద్రబాబుగారు కూడా బాధ్యుడే కదా?:

– ఇది చంద్రబాబుకు చెంపపెట్టు కాదా? కోర్టు ఆయన చెంప ఛల్లుమనిపించలేదా? మరి అదే కేసులో సాక్షి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే, అందుకు చంద్రబాబుగారు బాధ్యుడు కాదా?

– కొమ్మినేనిగారిని వెంటనే విడుదల చేయాలని ఆర్టికిల్‌–32 ప్రకారం, తన విచక్షణ ఉపయోగించి, ఆదేశిస్తే.. అదే కేసులో సాక్షిపై దాడి చేయించిన చంద్రబాబు దోషి కాదా? ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది? – ఇది తప్పుడు సంప్రదాయం కాదా? రేపు ఇదే కొనసాగితే, ఎవరైనా బ్రతుకుతారా? 

– ఈరోజు సాక్షి. రేపు మరేదైనా ఛానల్‌ కావొచ్చు. ఇలా దాడులు చేస్తే, ఎవరైనా బ్రతుకుతారా? ఎవరు ప్రశ్నించినా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, ఇలా దాడులు చేయడం కరెక్టేనా?


బాలికలపై దారుణ అత్యాచారాలు:

– చంద్రబాబుకు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉందా? నిజంగా వారికి ఆ గౌరవం ఉంటే.. శ్రీసత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఏడుకుర్రాకులపల్లిలో 9వ తరగతి విద్యార్థిని దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే, ఆ బాలిక గర్భం దాల్చింది.

– విషయం బయటకు వచ్చిన తర్వాత, కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా, టీడీపీ వారు భయపెట్టడం వాస్తవం కాదా? ఆ పాపకు తండ్రి కూడా లేడు. అలాంటి కుటుంబం వీరు చేసిన పనితో ఊరు విడిచిపెట్టిపోయారు.

– పోలీసులు ఏం చేశారు? చంద్రబాబు ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడి వేశాడు. న్యాయం చేయాలని చంద్రబాబుకు ఏ మాత్రం లేదు.

– అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని అయిన గిరిజన బాలిక.. ఆ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు జూన్‌ 3న పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పట్టించుకోలేదు. 6 రోజుల తర్వాత ఆ బాలిక శవమై కనిపించింది.

– రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి. ఇలాంటివి జరక్కుండా చూడాలని ఎవరికీ లేదు. ఎంతసేపూ రెడ్‌బుక్‌ రాజ్యాంగం. ఎవరిని ఇరికించాలన్న ప్రయత్నం తప్ప.

– కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక నిరుపేద అప్పు తిరిగి చెల్లించలేదని ఆయన భార్యను చెట్టుకు కట్టి వేధించారు.

– దాన్ని సాక్షి చూపితే, నెట్‌లో వైరల్‌ అయితే, అప్పుడు చంద్రబాబు కళ్లు తెరిచి, ఆమెకు రూ.5 లక్షల సాయం ప్రకటించాడు.

– ఎన్నికల ముందు సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ అని చెప్పి, నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి వెన్నుపోటు పొడిచాడు. అదేనా వారి పట్ల గౌరవం ఉన్నట్లా?


వైయస్సార్‌సీపీ ప్రభుత్వం. మహిళలు:

– ప్రతి కుటుంబంలో అక్కచెల్లెమ్మలను గౌరవించింది, వారికి చేయూతనిచ్చింది మా ప్రభుత్వం. వారికి 19 పథకాల ద్వారా రూ.1.89 లక్షల కోట్లు ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు జరగాలని డీబీటీ ద్వారా మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం.

– ఏకంగా 32 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చి, 22 లక్షల ఇళ్లు కట్టడం మొదలుపెట్టాం. 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం.

– చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం, పదవుల్లో 50 శాతం ఇచ్చాం. మరి ఎవరికి మహిళలమీద గౌరవం ఉంది? మంచి చేసిన మాకుందా? ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించిన ఆ పెద్దమనిషికి గౌరవం ఉందా?

– మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వారికైనా, ప్రజలకైనా, సొంత కూతురిని ఇచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం ఆయనకు ఆయనే సాటి.


యథేచ్ఛగా మాట తప్పిన చంద్రబాబు:

– ఇదే చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నాడు? జగన్‌ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్న చంద్రబాబు ప్రసంగ వీడియో ప్రదర్శించాడు.

– సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ పేరుతో చేసిన వాగ్దానాలు కనీసం రిబ్బన్‌ కూడా కటింగ్‌ చేయకుండానే, అన్నీ అమలు చేశానని చెబుతున్నాడు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌తో పాటు, 143 హామీలు అమలు చేసినట్లు ఊదరగొడుతున్నారు. 

– చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఎవరైనా సూపర్‌సిక్స్‌ గురించి అడిగితే, వారి నాలుక మందం అంటున్నాడు.


ఇవన్నీ మోసం కాదా?:

– నిరుద్యో యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏటా రూ.36,000 ఎంత మందికి ఇచ్చారు? చెప్పండి.

– ఈ ఏడాది ఏప్రిల్‌ 17న టీడీపీ గజెట్‌ ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి లేని వారు 1.56 కోట్లు. ఒక్కరికి కూడా హామీ అమలు కాలేదు.

– 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలు 1.80 కోట్లు. వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. అంటే ఏడాదికి రూ.18 వేలు. 

– ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల జాబితా ప్రకారం 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉండగా, వారిలో 60 ఏళ్లు నిండిన వారిని తీసేస్తే.. 1.80 కోట్లు.

– వారికి నెలకు రూ.1500 చొప్పున ఏవీ? వారికి సాయం చేయకుండా, పీ–4 అనే కొత్త డ్రామా. 

– దీపం పథకం. రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లకు మూడు సిలిండర్ల చొప్పున ఇవ్వాలంటే రూ.4,109 కోట్లు కావాలి. కానీ తొలి ఏడాది ఇచ్చింది ఎంత అంటే కేవలం రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకపోవడం మోసం కాదా?

– కనీసం ఒక సిలిండర్‌ అయినా ఇవ్వాలంటే.. రూ.1370 కోట్లు కావాలి.  కోట్లు కావాలి. అదీ ఇవ్వలేదంటే మోసం కాదా?

– మహిళలకు ఉచిత బస్సు. నెలకు రూ.250 కోట్లు. అంటే ఏటా రూ.3 వేల కోట్లు చాలు. అదిస్తే ఆర్టీసీ ఆ సదుపాయం కల్పిస్తుంది. రాష్ట్రంలో మహిళలంతా ఎదురు చూస్తున్నారు.

– ఆయన వచ్చాడు. చేస్తానన్నాడు. ఏడాది గడిచింది. కానీ ఏమీ చేయడం లేదు. పండగలు వస్తున్నాయి. పోతున్నాయి. ఉగాది, దసరా, సంక్రాంతి, ఉగాది పోయింది. మళ్లీ ఆగస్టు 15 అంటున్నాడు. దాని కోసం కర్ణాటకలో అధ్యయనం అవసరమా?

– కార్యక్రమాన్ని అమలు చేస్తే, మహిళలు వారికి ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు కదా? ఎన్నికలప్పుడు చెప్పి, ఇంకా అమలు చేయలేదు.


పెన్షన్‌. మోసం:

– సూపర్‌ సెవెన్‌. 50 ఏళ్లకే పెన్షన్‌ అన్నాడు. రాష్ట్రంలో ఆ వయసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షలు ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.9,600 కోట్లు కావాలి. తొలి ఏడాది లేదు. ఇప్పుడూ లేదు.

– మరోవైపు ఏడాదిలో ఏకంగా 5 లక్షలు తగ్గించాడు. గత ఏడాది ఎన్నికల నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే, గత నెల ఇచ్చిన పెన్షన్లు కేవలం 61,48,697. అంటే 5 లక్షలు కట్‌.

– అడిగితే నాలుక మందం అంటున్నాడు.


రైతులకు దగా:

– పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రైతులకు రూ.20 వేలు ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, రూ.20 వేలు ఇస్తానన్నాడు. అది పార్టీ నిర్ణయం అంటూ.. అన్నదాత సుఖీభవ అన్న పేరు పెట్టాడు.

– తర్వాత రెండూ కలిపి రూ.20 వేలు ఇస్తానన్నాడు. కానీ, నిరుడు ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఇది మోసం కాదా? మళ్లీ ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ బెదిరింపు.

– 53,58,666 మంది రైతులు. వారికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఉంటే వారికి రూ.10,716 కోట్ల మేలు జరిగేది. అది ఎగ్గొట్టాడు.


తల్లికి వందనం. పచ్చి మోసం:

– తల్లికి వందనం పేరుతో మళ్లీ వంచన. ఎలాంటి షరతులు లేకుండా, ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానన్నాడు. ఎన్నికల మందు అదేపనిగా ప్రచారం చేశాడు.

– కానీ ఆ తర్వాత ఏం చేశాడు? 

– యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌). ఈ డేటా కలెక్టర్లు అప్‌లోడ్‌ చేస్తారు.

– ఆ డేటా  ప్రకారం 2023–24లో రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు ఉన్నారు. వారందరికి ఎలాంటి ఆంక్షలు, కటింగ్‌ లేకుండా రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,111 కోట్లు కావాలి. కానీ ఇప్పుడు ఇస్తానంటోంది రూ.8700 కోట్లు మాత్రమే. అది కూడా అనుమానమే. – ఎందరికి ఇస్తాడో? అంటే దాదాపు 30 లక్షల మందికి కోత.

– దాన్ని మేము గట్టిగా నిలదీస్తే.. వెంటనే మాట మార్చి ఇచ్చేది రూ.15 వేలు కాదు, రూ.13 వేలు మాత్రమే. అది కూడా 67 లక్షల మందికి అని ప్లేటు మార్చాడు. ఆ తర్వాత మళ్లీ మాట మార్చి ప్రస్తుతం 55 లక్షలకే ఇస్తామంటున్నాడు.

– అంటే అందరికీ కాకుండా, కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. అంటే ఎన్నికలకు ముందు నీకు, నీకు, నీకు అన్న మాట పోయి, కొందరికి మాత్రమేగా మారింది.

– ఈ మోసాన్ని ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నాడు. ఇంకా ఏమైనా అంటే తప్పుడు కేసులు నమోదు చేయడం అలవాటుగా మారింది.

– అలా ఈ పథకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.


నాడు ఘనంగా అమ్మ ఒడి:

– అదే మేము గతంలో అమ్మ ఒడి కింద అర్హులైన వారందరికీ ఇచ్చాం. 43 లక్షల మంది తల్లులకు ఇచ్చాం.

– దాదాపు 84 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా చూశాం. వారంతా బడి బాట పట్టారు.


నేడు విద్యా వ్యవస్థ నాశనం:

– ఒకవైపు మోటివేషన్‌ లేకుండా చేయడం, మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలోని సంస్కరణలన్నీ నాశనం చేశాడు.

– ఇంగ్లిష్‌ మీడియమ్, టోఫెల్‌ శిక్షణ, 3వ తరగతి నుంచి, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, రోజుకో మెనూతో గోరుముద్ద, నాడు–నేడు పనులు క్లోజ్‌. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్‌ లేవు. 

– మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంటు బడులు ప్రైవేటు బడులను వెనక్కు నెట్టాయి. ఇప్పుడు అంతా రివర్స్‌. అన్నీ నాశనం చేశారు. చివరకు 10వ తరగతి ప్రశ్నపత్రాల ఎవాల్యుయేషన్‌ కూడా సక్రమంగా చేయని దుస్థితి.


విద్యా దీవెన. వసతి దీవెన:

– మా ప్రభుత్వ హయాంలో ప్రతి తైమాసికంలో వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఏటా ఏప్రిల్‌లో వసతి దీవెన కింద ఒక వాయిదా. పేదల పిల్లల చదువుల కోసం తపన పడ్డాం.

– చంద్రబాబు సీఎం అయిన తర్వాత, ఈ ఏడాది జూన్‌ వరకు చూస్తే, ఆరు త్రైమాసికాలు పెండింగ్‌. ఒక క్వార్టర్‌కు రూ.700 కోట్లు. అలా రూ.4200 కోట్లు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన, ఈ ఏడాది కలిపితే రూ.2200 కోట్లు. ఎన్నికల ప్రక్రియతో ఆగిపోయిన పేమెంట్స్‌ ఇప్పటి వరకు లేవు.

– విద్యాదీవెన కింద రూ.4200 కోట్లు. వసతి దీవెన కింద మరో రూ.2200 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే.

– వసతిదీవెన దాదాపు రద్దు. విద్యాదీవెన ఇవ్వాలన్న తాపత్రయం లేదు.


ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ఆసరా:

– ఆరోగ్యశ్రీ. రూ.25 లక్షల వరకు పూర్తిగా ఉచిత వైద్యం. ఏకంగా 3300 ప్రొసీజర్లు. ప్రతి పేదకు మంచి వైద్యం. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్నా, ఆరోగ్యశ్రీ వర్తింపచేశాం. 

– ఈ పథకానికి నెలకు రూ.300 కోట్లు కావాలి. అంటే ఈ ఏడాదికి రూ.3600 కోట్లు పెండింగ్‌.

– ఆరోగ్య ఆసరా. దానికి మరో రూ.400 కోట్లు. అలా మొత్తం రూ.4 వేల కోట్లు మొత్తం ఎగ్గొట్టాడు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఏ పేదకు వైద్యం అందడం లేదు.

– కానీ, ఈ పెద్దమనిషి ఏమంటాడు. ఛూమంతర్‌. అన్నీ చేశాం. అబ్రకదబ్ర అంటాడు. అడిగితే నాలుక మందం అంటాడు.


– రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు లేదు. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయింది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.


చంద్రబాబుగారు కొన్ని చేశారు. అవి ఏమిటంటే..

– ఏడాదిలో రూ.15 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల బాదుడు. 

– గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీలు చంపేసి, తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచేలా చేసి బాదుడే బాదుడు.

– అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటిఅద్దెల బాదుడు. 

– హెరిటేజ్‌ కోసం అమూల్‌ను చంపేసి, పాల రేట్లు పెంచేలా చేసి బాదుడే బాదుడు.

– ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందించే వాహనాలు తీసేయడమే కాకుండా, రేషన్‌ సరుకుల్లో కందిపప్పు తీసేశాడు. దాంతో పప్పుల ధరలు బాదుడే బాదుడు.

ఇలా అన్ని రకాలుగా బాదుడే బాదుడు.


– ఏడాది కాలంలో ఏకంగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.

–2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు హుష్‌కాకి. ఎండీయూ వాహనాల రద్దు ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు పోయాయి. బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో మరో 15 వేల మంది. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు హుష్‌కాకి.


ఉద్యోగులకు వంచన:

– పంటలకు ధరలు లేక రైతుల అల్లాడుతుంటే, మరోవైపు సరుకుల ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

– ప్రభుత్వ ఉద్యోగులకూ మోసమే. మధ్యంతర భృతి లేదు. ఉన్న పీఆర్‌సీ రద్దు. కొత్త పీఆర్‌సీ నియామకం లేదు. అది వేస్తే ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వస్తుందని ఆ పని చేయడం లేదు. మూడు డీఏలు ఇప్పటికే పెండింగ్‌. ఈ జూలై 1 వస్తే 4 డీఏలు పెండింగ్‌.

– మన ప్రభుత్వంలో గ్యారెంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌) తెస్తే, దాన్ని తీసేసి ఓపీఎస్‌ (పాత పెన్షన్‌ పథకం) అన్నాడు. అక్కడా మోసం. ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.20 వేల కోట్లు. అడిగితే తోకలు కట్‌. భూస్థాపితం చేస్తా అంటాడు.


అప్పులు పెరుగుతున్నాయి. ఆదాయం తగ్గుతోంది:

– ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు. సంపద సృష్టిస్తానన్నాడు. తన కళ్లెదుటే ఆవిరి. ఆ సంపద తన జేబులోకి, తనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది.

– సంపద పెరగకపోగా, మొత్తం తగ్గుతున్నాయి.


– రాష్ట్ర జీఎస్‌డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08 శాతం అయితే, చంద్రబాబు పాలనలో ఏడాది కాలంలో అది ఏకంగా 5.12 శాతం.

– రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్‌ ఉంఆఇ) అది ఇప్పుడు ఏకంగా 3.61 శాతం.


దారుణంగా అప్పులు:

– రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణ అప్పులు చేశారు.

– మా హయాంలో 5 ఏళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,61,301 కోట్లు. అంటే మా 5 ఏళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5 శాతం అప్పు చేశాడు.  

– మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది. ఇప్పుడు లేకపోయినా అదీ పరిస్థితి.


– రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు, ఆయనకు చెందిన ముఠా పంచుకుంటోంది. 

– 2024–25లో రాష్ట్ర ట్యాక్స్, నాన్‌ ట్యాక్స్‌ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌) చూస్తే..అంటే గత ఏప్రిల్, మే నెలల్లో ఆ మొత్తం రూ.14,580 కోట్లు.

– అదే గత ఏడాది మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. అంటే 2024 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ ఆదాయం రూ.14,644 కోట్లు.

– నిజానికి ఈ ఏడాది ఆ ఆదాయం పెరగాల్సింది పోయి, మైనస్‌ 0.44 శాతం తగ్గింది.

– అదే విధంగా గత మా ప్రభుత్వ హయదాంలో 2023–24లో ప్రభుత్వ ఆదాయం రూ.93,354 కోట్లు కాగా, 2024–25లో వచ్చిన ప్రభుత్వ ఆదాయం రూ.96,227 కోట్లు.

– అంటే అంతకు ముందు ఏడాది కంటే గత ఏడాది రాష్ట్రంలో 3.08 శాతం ఆదాయం మాత్రమే పెరిగితే, అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం.

– దాంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. 

– అంటే ఆ ఆదాయమంతా చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది.


ఎక్కడా లేని విధంగా తాకట్టు:

– చంద్రబాబు చెప్పే మరో పచ్చి అబద్ధం. తాను ఆస్తులు తాకట్టు పెట్టడం లేదంటాడు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టడం లేదంటాడు. 

– కానీ ఏం చేశాడు? ఏపీ ఎండీసీలో ఇచ్చిన జీఓ నెం:69. ఏప్రిల్‌ 24, 2025. అందులో ఏం చెప్పారు?

– ఏపీ ఎండీసీకి చెందిన 436 చిన్న గనులను తాకట్టు పెడుతూ, దాని విలువను రూ.1,91,000 కోట్లుగా చూపుతూ, అప్పు చేస్తూ, బాండ్ల జారీ. 

– ఆ మొత్తం తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే, కన్సాలిడేట్‌ ఫండ్‌ నుంచి ప్రైవేటు వ్యక్తులు నేరుగా నిధులు పొందొచ్చు. అంటే ఇచ్చిన రుణాన్ని వసూలు చేయొచ్చు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్బీఐకి ఆ అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

– రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఒక ప్రైవేటు వ్యక్తికి రాష్ట ఖజానా నుంచి నేరుగా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇవ్వడం వాస్తవం కాదా?.


వారిని ఇలా నిలదీయండి:

– ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వ్యక్తి ఏం చెబుతున్నాడు. తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఇంటింటికీ పంపించి, ఏం చేశామనేది చెబుతాడట.  

– నేను ప్రజలను ఒకటే కోరుతున్నా. ఎన్నికల మందు చంద్రబాబుగారు ఇచ్చిన మ్యానిఫెస్టో మీ దగ్గర పెట్టుకొండి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీ దగ్గరకొచ్చినప్పుడు దాన్ని చూపి, ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉందో చూపండి.

– ఇందుకు ‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో’ అనే కార్యక్రమం పెట్టాం. 

– అదే తెలుగులో ‘చంద్రబాబు మ్యానిఫెస్టో గుర్తు తెచ్చుకుంటూ’ అంటూ మీకు దాన్ని మా పార్టీ అందుబాటులోకి తెస్తుంది. దాని కోసం మీరు క్యూఆర్‌ కోడ్‌ వినియోగిస్తే చాలు. మీకు చంద్రబాబు మ్యానిఫెస్టో డౌన్‌లోడ్‌ అవుతుంది.

– అప్పుడైనా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుగారికి సిగ్గు వస్తుందేమో.

– ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక బాండ్‌ పంపాడు. ‘బాబు ష్యూరిటీ. భవిష్యత్తుకు గ్యారెంటీ’ అని టీడీపీ ఆఫీస్‌ నుంచి దాన్ని పంపారు. పార్టీ వెబ్‌సైట్‌ వివరాలు ఇచ్చి, అన్ని వివరాలు చెప్పారు

(అంటూ.. ఒక మహిళకు టీడీపీ ఆఫీస్‌ నుంచి నాడు పంపించిన బాండ్‌ ప్రదర్శించి వివరాలు ప్రదర్శించారు. అందులో ఆ కుటుంబం పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబానికి ఏయే పథకాలు వస్తాయో టేబుల్‌లో చూపారు. అలా ఆ కుటుంబానికి ఏయే పథకాలు వర్తిస్తాయి? అలా ఒక ఏడాదికి అందే మొత్తం ఎంత? అనేది చూపారు).

ఉదా:

మీ కుటుంబానికి ఏడాదికి రూ.66 వేల చొప్సున ఏడాదికి రూ.3.30 లక్షలు వస్తాయని చెప్పారు.


– ఇంకా ఉచిత బస్సు సదుపాయం జూన్‌ 2024 నుంచి మొదలవుతుందని చెప్పారు. అలా పంపించి, ఓటీపీ ఇచ్చి దాన్ని ఓపెన్‌ చేయమన్నారు. మళ్లీ మిస్డ్‌ కాల్‌ కూడా ఇచ్చారు.

– ఇవన్నీ 2024, జూన్‌ నుంచి మీ ఖాతాలో జమ అవుతుందని చెబుతూ.. ప్రమాణం చేసిన చంద్రబాబు బాండ్లు పంపించాడు. 


ప్రజలకు ఒకటే విజ్ఞప్తి.

– ఆ బాండ్లు బయటకు తీయండి. చంద్రబాబు మ్యానిఫెస్టో మేము క్యూఆర్‌ కోడ్‌లో అందుబాటులో ఉంచుతాం. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే అవన్నీ చూపి, తమకు పడిన బాకీ ఎప్పుడిస్తారని నిలదీయండి. 

– మీ తరపున పోరాటానికి మేము రెడీ. అందుకు తగిన ప్లాన్‌ చేద్దాం.


మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

నేను పరామర్శకు వెళ్లడం తప్పా?:

పల్నాడు జిల్లాలో నిన్నటి నా పర్యటన. మా పార్టీకి చెందని ఉప సర్పంచ్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే, నేను పరామర్శకు వెళ్లాను. దానిపై నాగమల్లేశ్వరరావు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినా, కేసు నమోదు చేయలేదు. నేను వారిని పరామర్శించడం కోసం వెళ్లడం తప్పా? వారు మా పార్టీ నాయకులు. 

నేను అక్కడికి పోకుండా కర్ఫ్యూ పరిస్థితి తీసుకురావడం తప్పు కాదా? నేను వెళ్లిన ఇంటి యజమానిపై కేసు పెట్టడం తప్పు కాదా?

ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు.


ఎవరు ఆ సమస్య సృష్టిస్తున్నారు?:

నా పర్యటనలో శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు. రైతుల దగ్గరకు పోయాను. పరామర్శించాను. అందులో తప్పేమిటి? 

నన్ను అడ్డుకోవాలని చూడడం ఎందుకు? ఎందరు రావాలో చెప్పడానికి నువ్వు ఎవరు? నన్ను చూడడానికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఎందుకు? వారికి భోజనం పెడుతున్నావా?

నా అభిమానులు. నా పార్టీ కార్యకర్తలు వస్తే, నీకేం బాధ?

నేను సమస్యలపై పోరాటం మొదలు పెట్టేవరకు ఆయన స్పందించడం లేదు. రైతుల దగ్గరకు నేను వెళ్తేనే కదా, ఆయన స్పందించలేదు. నేను రైతులను పరామర్శిస్తే, మీకేం బాధ?

అసలు నీవు సమస్యలు పరిష్కరిస్తే, నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది?


ఆ అబ్బాయి టీడీపీ సభ్యుడు:

నిన్నటి పోస్టర్ల ప్రస్తావన. అది పుష్ప సినిమా డైలాగ్‌. అది పెట్టినా తప్పేనా? ఆ ఫ్లెక్సీ పెట్టిన యువకుడు టీడీపీ సభ్యుడు. ఆయనకు సభ్యత్వం కూడా ఉంది. అంటే, టీడీపీకి చెందిన వ్యక్తి, యువకుడికి కూడా చంద్రబాబుపై కోపం వచ్చింది. అందుకే రప్పా రప్పా కోస్తాను అన్నాడు.

ఏ పథకాలు లేవు. అంతా మోసం. అందుకే టీడీపీ వారిపై ఆక్రోషం చూపుతూ ఫోటోలు, ఫ్లెక్సీల ప్రదర్శన. టీడీపీ కార్యకర్త, సభ్యుడు.. మన కార్యక్రమంలో పాల్గొని, టీడీపీ వారినే రప్పా, రప్పా నరుకుతా అన్నాడు. 


దాంతో నాకేం సంబంధం?:

ఫోన్‌ ట్యాపింగ్‌ ఎవరు చేశారు? కేసీఆర్‌ ప్రభుత్వం షర్మిలమ్మ ఫోన్‌ ట్యాప్‌ చేసిందా? ఆమె తెలంగాణలో ఉంది కాబట్టి, పార్టీ పెట్టింది కాబట్టి చేశారేమో.. దానికి నాకు ఏం సంబంధం?

ఇంకా గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దాన్ని దశలవారీగా చేయాలి. అదే సమయంలో రాయలసీమ ప్రాజెక్టుల్లో కొన్ని పనులు పూర్తి చేయాలి. కాలువల మరమ్మతు పనులు పూర్తి చేయాలి. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి, దానికి అనుగుణంగా దశల వారీగా పనులు చేయాలి.

Comments