దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా గుర్తింపు తెస్తాం.

 

హైదరాబాద్ (ప్రజా అమరావతి);

       తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ (YTDA) ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ ఏ విధంగా సేవలు అందిస్తుందో అదే తరహాలో తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలన్న ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని అన్నారు.


 యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,


“శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బోర్డు(YTDA) ఆధ్వర్యంలో విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయడమే కాకుండా దాన్ని దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా గుర్తింపు తెస్తాం.


టీటీడీ నిర్వహిస్తున్న తరహాలో గోశాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలను వైటీడీఏ ఆధ్వర్యంలో విశిష్ట సేవలను అందించే విధంగా అభివృద్ధి చేస్తాం.


 యాదగిరిగుట్టపై భక్తులు నిద్రించాలన్న సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే కాకుండా తరతరాలుగా పిలుచుకున్న యాదగిరిగుట్ట పేరును తిరిగి పెట్టుకున్నాం. 60 కేజీల బంగారంతో స్వామి వారి విమాన స్వర్ణ గోపురం నిర్మాణం పూర్తి చేసుకున్నాం.


 ఆలేరు ప్రజల చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టును గత ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. గత పదేండ్లలో నల్గొండలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ఆలేరుకు తాగునీరు సాగునీరు ఇవ్వలేదు. గత పదేండ్లు గంధమల్ల ప్రాజెక్టును పడావు పెడితే, ఇప్పుడు గ్రామాలు ముంపునకు గురికాకుండా దాన్ని చేపడుతున్నాం. గంధమల్లకు ఎక్కడి నుంచి నీరివ్వాలో తెలుసు. దాన్ని పూర్తిచేస్తాం.


 గోదావరి జలాలతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే కొందరు అడ్డంపడుతున్నారు. ఆరు నూరైనా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని గతంలో చెప్పడం జరిగింది. చేసి తీరుతాం.


 ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిన్న కేబినేట్ సమావేశంలో చర్చించాం. సమస్యలను ఒక కొలిక్కి తెచ్చాం. ఆ విషయంలో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని, గత పదేండ్లలో ఏనాడైనా మొదటి తారీఖున జీతాలు పడ్డాయా, ఆనాడు జీతాలు చెల్లించలేనివారు ఈ రోజు మాట్లాడుతున్నారు” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.


ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహా , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు స్థానిక లోక్‌సభ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఆలేరు నియోజకవర్గం మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 54.70 కోట్ల రూపాయల చెక్కును ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులకు అందించారు. పలువురు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.


ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

🔸 రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్

🔸రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్

🔸 రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం

🔸 రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని మంచినీరు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్లు

🔸 రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి

🔸 రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి

🔸 రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్

🔸 రూ. 22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్లు

🔸 రూ. 21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ బీటీ రోడ్లు

🔸 రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు .


Comments