లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ..

 *లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ..


*చురుకుగా సాగుతున్న నిర్మాణ పనులు.. 

*ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. 

 హైదరాబాద్ (ప్రజా అమరావతి);

            రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. 

1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.



ఈరోజు సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో  సమీక్షించడం జరిగింది.  ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. 


ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి,భూపాలపల్లి,హనుమకొండ,వికారాబాద్, సిద్దిపేట,నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగు పడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై  ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించాను. 


ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.   


    రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు  నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నాం. బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1లక్ష25 వేలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1లక్ష75 వేలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నాం.


    ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని 2BHK ఇండ్లను కేటాయించి, అలాగే మొండి గోడలతో ఉన్న 2BHK ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుంది. ప్రధానంగా 2BHK అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసి, నిజామాబాద్, కరీంనగర్,  మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించడం జరిగింది.

Comments