విద్యద్వారానే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం!
*విద్యద్వారానే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం!*


*నైతిక విలువలతో జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగండి*

*ఉన్నత లక్ష్యాలతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కండి*

*కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్*

మచిలీపట్నం (ప్రజా అమరావతి): సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది, ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయి, ఇక్కడి నుండే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కేవలం గ్రాడ్యుయేషన్ తో నేర్చుకోవడం ఆగిపోకూడదు, అది జీవితాంతం కొనసాగాలి. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్టప్‌ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్‌లలో ఎదుగుతున్నప్పుడు విలువలను ఎప్పుడూ కోల్పోకండి. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతి నిపుణులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో పట్టుగొమ్మలుగా నిలవాలని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, విద్య పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధత మన రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తోంది. క్రమశిక్షణ, సంకల్పం ఈ ఆడిటోరియంలోని ప్రతి యువకుడికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ (IIULER) స్థాపన వెనుక ఆయన మార్గనిర్దేశక శక్తిగా ఉన్నారు. ధైర్యం, వ్యక్తిత్వంతో  అత్యున్నత స్థాయికి ఎదగగలరని చెప్పడానికి ఆయన జీవితం ఉదాహరణ.

*వైఫల్యాలకు భయ పడొద్దు*

 యువ  గ్రాడ్యుయేట్లు పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేయాలని, వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దని కోరుతన్నాను. విజయం ఒక గమ్యస్థానం కాదు, అది  స్థిరమైన వృద్ధి, లక్ష్యంతో కూడిన ప్రయాణం. కేవలం కెరీర్‌ను మాత్రమే కాకుండా - ఇతరులకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని నిర్మించుకోండి. మీ మూలాల గురించి గర్వపడండి. లక్ష్యంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశభవిష్యత్తును రూపొందించే మార్గదర్శకులు నిలవండి. సమాజానికి మార్గం చూపే దివిటీలా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి.

*పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం*

ఈ రోజు పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు డిగ్రీలు అందుకుంటున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది మీకు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఈ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ వేడుక తీపిగుర్తు. మీ కృషి, పట్టుదల, నిబద్ధతకు ఇదొక కొలమానం లాంటిది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది, ఇక రాబోయేది బాధ్యత, అవకాశాలతో నిండిన అధ్యాయం. మీ తల్లిదండ్రులు, కుటుంబం, రాష్ట్రం, దేశానికి మీ కృతజ్ఞతను చూపించాల్సిన ఉంది.  మీ డిగ్రీ కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు - అది ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నవీన ఆవిష్కరణలు చేయడం, విలువలకు కట్టుబడి ధైర్యంతో ముందుకు సాగడం మీ బాధ్యత. మీరంతా సమాజానికి దిక్సూచిగా నిలచే అధ్యాపకులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో మీ కలలను సాకారం చేసుకుంటూ భారతదేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ దేశాన్ని ముందుకు నడిపించే మార్గనిర్దేశకులుగా తయారు కావాలని కోరుకుంటున్నాను. 

*అధునాతన సాంకేతికలపై దృష్టిపెట్టండి*

ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తో సమాజంలోని అన్నిరంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టడం, ఆరోగ్య సంరక్షణతోపాటు బయోటెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా మానవ ఆయుర్దాయం పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ సృజనాత్మకతతో నైతిక నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి.  మీరు జీవిత లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు కీ ప్లేయర్‌గా ఉండటం నేర్చుకోండి. మీరు ఎప్పుడూ యంత్రంలో ఒకభాగంలా కాకుండా వ్యవస్థలో ఒక ముఖ్యమైన లివర్‌గా ఉండాలి. ప్రపంచానికి కార్మికులు మాత్రమే కాదు, సృష్టికర్తలు కూడా అవసరం. ఉత్తమ ఆవిష్కరణలు మీ అభిరుచుల నుంచే పుడతాయి. జీవితంలో స్థిరపడేందుకు మీ అభిరుచికి తగ్గట్లుగా ఏ మార్గాన్నయినా ఎంచుకోండి,  లక్ష్యాన్ని చేరుకునేందుకు బాధ్యతతో ధైర్యంగా ముందుకు సాగండి. 

*స్పూర్తిప్రదాతల పుట్టినిల్లు మచిలీపట్నం*

దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ట్రేడింగ్ పోర్టు టౌన్ మచిలీపట్నం. వాణిజ్యం, సంస్కృతి, కళలు, విద్యారంగంలో మార్గదర్శకులను, స్వాతంత్ర్య సమరయోధులను అందించిన నేల మచిలీపట్నం. ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యూరోపియన్లతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులు ఇక్కడకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో  స్థాపించబడిన తొలి మునిసిపాలిటీల్లో మచిలీపట్నం(1866) ఒకటి. ఇక్కడ నెలకొన్న నేషనల్ కాలేజ్ 1906 నాటి వందేమాతరం ఉద్యమానికి పుట్టినిల్లు. మచిలీపట్నం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయమైంది. జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కృష్ణాపత్రిక సంపాదకలు ముట్నూరి కృష్ణారావు, అన్న నందమూరి తారకరామారావు ఈ జిల్లాకు చెందినవారే. కూచిపూడి నృత్య రూపం, కలంకారీ కళకుఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీనికి GI ట్యాగ్ కూడా వచ్చింది. బందర్ లడ్డూ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. 1964 నాటి దివిసీమ ఉప్పెన పట్టణ జనాభాలో 50% మందిని (సుమారు 30,000 మందిని) పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత పలుమార్పు తీవ్ర తుఫానులు కూడా వచ్చాయి..

*ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుపర్చాలి*

కృష్ణా విశ్వవిద్యాలయం 2008 లో స్థాపించబడింది.  ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 2000 మంది విద్య నభస్యసిస్తుండగా, 134 అనుబంధ కళాశాలలలో సుమారు 30,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 2024-25లో కృష్ణా వర్సిటీ క్యాంపస్ లో విద్యనభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్ సాధించిన విషయం తెలుసుకుని ఎంతో ఆనందించాను. అయితే అనుబంధ కళాశాలలు గత విద్యా సంవత్సరంలో 50-60% ప్లేస్‌మెంట్‌ మాత్రమే సాధించాయి. 2017లో విశ్వవిద్యాలయం NIRF 151-200 బ్యాండ్‌లో స్థానం సంపాదించినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ర్యాంకింగ్ లో  వెనుకబడింది. NIRF ర్యాంకింగ్‌ను వెంటనే 100 కంటే తక్కువకు తీసుకురావాలని నేను వర్సిటీ పాలకమండలిని మంత్రి నారా లోకేష్ కోరారు.
Comments