*జనసంద్రమైన మంగినపూడి సముద్ర తీరం..*
*మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజూ రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకుల సందడి..*
*వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్, సాంప్రదాయ హస్తకళల స్టాళ్లను పర్యాటకులు సందర్శించడంతో పెరిగిన రద్దీ..*
*అధిక సంఖ్యలో బిర్యానీ, ఐస్ క్రీమ్ స్టాళ్లు..*
మంగినపూడి బీచ్: జూన్ 07, (ప్రజా అమరావతి);
మసులా బీచ్ ఫెస్టివల్ కు గత రెండు రోజులుగా తరలి వస్తున్న అశేష పర్యాటకులతో మంగినపూడి బీచ్ సముద్ర తీరంలో మూడవ రోజూ శనివారం కోలాహాలం కొనసాగింది. వచ్చిన పర్యాటకులతో మంగినపూడి సముద్ర తీరం జనసంద్రాన్ని తలపించింది. వివిధ ప్రాంతాల నుండి ఉదయం నుంచే పర్యాటకుల తాకిడి మొదలైంది. మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజూ రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకుల సందడి చేశారు. ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా.. హెలీ రైడ్, పార గ్లైడింగ్ ను ఎక్కి సరికొత్త అనుభూతి చెందారు. వాటిలో రైడింగ్ చేసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరోవైపు చిన్నారులే కాకుండా పెద్దలు సైతం గుర్రపు స్వారీ చేసేందుకు ఆసక్తి చూపారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో పెద్దలతో పాటు యువత సందడి చేశారు. బీచ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన అనేక రకాల ఫుడ్ స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీ స్టాళ్ల వద్ద రుచులను ఆస్వాదించారు.
వినోదాలను అందించే జెయింట్ వీల్, ట్రైన్, విమానం, కొలంబస్, సముద్రంలో బోట్ రైడింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, కలంకారి, ఆప్కో చేనేత వస్త్రాలు, కొండపల్లి, లేపాక్షి బొమ్మలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బందరు లడ్డు, బందరు హల్వా, బాదం పాలు, కాకినాడ ఖాజా, విజయ డైరీ పాల ఉత్పత్తులు, రోల్డ్ గోల్డ్, డ్రై ఫ్రూట్స్, స్మోక్ బిస్కెట్స్, గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సహాయం తదితర స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఒకవిధంగా బీచ్ ప్రాంగణం మొత్తం వివిధ రకాల వంటకాల సువాసనలతో నిండిపోయి పర్యాటకులను నోరూరించాయి. బీచ్ లో అధిక సంఖ్యలో బిర్యానీ, ఐస్ క్రీమ్ లు స్టాళ్లు ఏర్పాటు చేశారు. రోల్డ్ గోల్డు నగలు, కలంకారి వస్త్రాలు కొనేందుకు స్టాళ్ల వద్ద అధిక సంఖ్యలో మహిళలు బారులుతీరారు.
addComments
Post a Comment