నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు
గుంటూరు, 11 జూన్ 2025 (ప్రజా అమరావతి):- మంగళగిరి నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సీఎస్ఆర్ నిధులతో మూడు సంక్షేమ శాఖల వసతి గృహాలు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
బుధవారం మంగళగిరిలో వీవీఐటీ చారీటబుల్ ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించే సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంకు  జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, అంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవల్మేంట్ కార్పోరేషన్ చైర్మన్ కే రాజశేఖర్, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జనకీదేవి , వీవీఐటీ చారీటబుల్ ట్రస్ట్  చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తో కలసి  శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తతంగా పూజలు నిర్వహించి జిల్లా కలెక్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గత సంవత్సర కాలంలో పూర్తి అయిన పనుల ప్రారంభోత్సవాలు, నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు

జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సీఎస్ఆర్ నిధులతో మంగళగిరి, దుగ్గిరాలలో సాంఘీక సంక్షేమ శాఖ, పెనుమాకలో బీసీ సంక్షేమ శాఖ  వసతి గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం జరుగుతుందన్నారు. మంగళగిరిలో సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని వీవీఐటీ చారిటబుల్ ట్రస్ట్  వారు రూ.4.5 కోట్లతో, దుగ్గిరాలలో సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ ను సెల్ కాన్ ఇంప్లాక్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు రూ.3.5 కోట్లతో, పెనుమాకలో బీసీ బాలుర వసతి గృహాన్ని రాడికో కేతన్ లిమిటెడ్ వారు రూ. 3.5 కోట్లతో అత్యాధునిక విధానంతో నిర్మించటానికి ముందుకు వచ్చారన్నారు. ఒక్కోక్క వసతి గృహంలో ప్రీ మెట్రీక్, పోస్ట్ మెట్రీక్ కు సంబంధించి 150 నుంచి 170 మంది విధ్యార్దులకు వసతి కల్పించేలా, అత్యాధునికమైన కిచెన్, డైనింగ్, లివింగ్ రూం, స్టడీ రూం, డార్మీటరీలతో మోడరన్ గా నిర్మించటం జరుగుతుందన్నారు.  వసతి గృహాల నిర్మాణం జరుగుతున్నందున ప్రస్తుతం ఇక్కడి విద్యార్ధులను సమీపంలోని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం జరుగుతుందని, నిర్మాణా పనులు తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయని, తదుపరి విద్యాసంవత్సరం నాటికి వీటిని ప్రారంభించటం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ రాజా దేబోరా ఏపీఈడబ్య్లుఐడీసీ ఈఈ అనిల్ కుమార్, మంగళగిరి తహశీల్దారు దినేష్ రాఘవేంద్ర , సివిల్ సప్లైయిస్ కార్పోరేషన్ డైరక్టర్  తోట పార్ధసారధి, కూటమి నాయకులు పాల్గొన్నారు. 
Comments