ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం.
*ప్రాంతాలు, కుల,మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర*

*అడుగడుగునా మహిళలను అవమానిస్తున్నారు*

*ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం

*

*వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది*

*జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి*

*నిరంతరం కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండాలి*

*పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం*

పార్వతీపురం (ప్రజా అమరావతి): ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం చినబొండపల్లిలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. ఈ రోజు చాలా వింత పరిస్థితి. దారిపొడవునా ఎక్కడ చూసినా పోలీసులే. యువగళంలో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆనాడు అడ్డుకున్న పోలీసులే నేడు సెల్యూట్ చేస్తున్నారు. అదీ ప్రజాతీర్పు. ప్రతిపక్షంలో ఆనాడు చంద్రబాబు గారు చలో ఆత్మకూరు పిలుపునిస్తే గేట్లకు తాళ్లు కట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. నాపై 23 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. యువగళం పాదయాత్రలో మైక్, స్టూల్ లాక్కుకున్నారు. అయినా బిల్డింగ్ పైకి ఎక్కి మాట్లాడా. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరించాలి. 

*అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమికి ప్రజలు పట్టం కట్టారు*

నేడు పోలీసు ఎస్కార్ట్ ఉన్నా, చుట్టూ పోలీసులు ఉన్నా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదు. 1985 తర్వాత గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నా. 2019లో ఓడిపోయాను. కసితో పనిచేసి 2024 ఎన్నికల్లో 91వేల భారీ మెజార్టీతో విజయం సాధించాను. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ రాని మెజార్టీ మంగళగిరిలో వచ్చింది. అహంకారం, అడ్డగోలు అరెస్ట్ లు, బూతులు వద్దని ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తొడగొట్టిన అంజిరెడ్డి తాత, రక్తం కారుతున్నా బూత్ లో చివరి ఓటు వరకు ఎదురొడ్డి నిలిచిన మంజులా రెడ్డి, మెడపై కత్తిపెట్టి వాళ్ల నాయకుడు పేరు చెప్పమన్నా భయపడకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించిన తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు చట్టప్రకారం కుదరదన్నారు. కేబినెట్ లో పెట్టి చట్టాన్ని మార్చి తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. 

*జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి*

నేడు కూటమి ప్రభుత్వంలో వృద్ధులకు రూ.4వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా కోటి మందికి గ్యాస్ సిలిండర్లు అందజేశాం. వచ్చే నెల నుంచి గ్యాస్ సబ్సీడీ నేరుగా బ్యాంక్ అకౌంట్లకే బదిలీ చేస్తాం. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. వచ్చే నెల తల్లికి వందనం కార్యక్రమం అమలుచేస్తాం. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుస్తామనే హామీని నిలబెట్టుకున్నాం. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగింది. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 
 
*అడుగడుగునా మహిళలను అవమానిస్తున్నారు*

సాక్షి టీవీలో ఇప్పుడు కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ అంశంలో ఒకరిని అరెస్ట్ చేశాం. మరొకరు పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు చీర, గాజులు పంపిస్తానని గతంలో వైసీపీ మహిళా నేత అన్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వారు ఇప్పటికీ మారలేదు.

*ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి కుట్ర*

నేతలు, కార్యకర్తలు నిరంతరం కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండాలి. జగన్ రెడ్డి ఐదేళ్లలో తిరగనిది.. చంద్రబాబు గారు 11 నెలల్లోనే తిరిగారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నారు. ప్రాంతాల మధ్య, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడింది కూటమి ప్రభుత్వం. విశాఖకు టీసీఎస్, గూగుల్ తీసుకువస్తోంది కూటమి ప్రభుత్వమే. రైల్వే జోన్ ఏర్పాటుచేసిందీ కూటమి ప్రభుత్వమే. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైంది. మిత్రధర్మం పాటించాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. 

*పార్వతీపురంలో రౌడీల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెడతాం*

పార్వతీపురంలో రౌడీల ఆగడాలకు మూడు వారాల్లో ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నాది. అధికారుల్లో ఇంకా మార్పు రాలేదని అంటున్నారు. కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో సగానికి పైగా ఎత్తివేయడం జరిగింది. ఈ ఏడాది చివరి నాటికి అక్రమ కేసులు మొత్తం ఎత్తివేస్తాం. మీ భవిష్యత్-నా బాధ్యత. పెండింగ్ బిల్లులు త్వరలోనే చెల్లిస్తాం. 

*మాది కక్షసాధింపు కాదు*

రెడ్ బుక్ చూస్తేనే ఒకరికి గుండెపోటు వచ్చింది. మరొకరు టాయిలెట్ లో జారిపడ్డారు. ఒకరేమో బెంగుళూరుకు పరారయ్యారు. మాది కక్షసాధింపు కాదు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని చట్టపరిధిలో శిక్షిస్తాం. ఒకరికి నల్లజుట్టు కాస్తా తెల్లదైంది. అర్థమైందా..రాజా! ఎవరూ అహంకారంతో వ్యవహరించవద్దు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. టీడీపీ అంటేనే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. 

*జవాన్లు ఎక్కడ కనిపించినా సెల్యూట్ చేయాలి*

పహల్గాంలో అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. 2004 నుంచి 2014 వరకు దేశంపై 25 వరకు ఉగ్రదాడులు జరిగాయి. మోదీ వచ్చిన తర్వాత ధీటైన సమాధానం చెబుతున్నారు. మనం క్షేమంగా ఉంటున్నామంటే సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే. మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ. ఇంటి దగ్గరే ఉండాలని కోరినా వినలేదు. తాను చనిపోతే దేశం మొత్తం కదిలివస్తుందని చెప్పాడు. మొన్న దాడులు జరుగుతున్న సమయంలో కూడా మిత్రుడికి మెసేజ్ పెట్టాడు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని చెప్పాడు. జవాన్లు ఎక్కడున్నా అండగా నిలవాలి. ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ప్రధానికి అండగా నిలుద్దాం. జవాన్లు ఎక్కడ కనిపించినా వారికి సెల్యూట్ చేయాలన్నారు. జోహార్ మురళీ నాయక్, వందేమాతరం అంటూ మంత్రితో పాటు అందరూ నినదించారు.
Comments