ఏపీలో ఆటవిక దేశాల్లోని నియంత పాలన.



-   ఏపీలో ఆటవిక దేశాల్లోని నియంత పాలన


-   రెడ్‌బుక్ పేరుతో అరాచక వ్యవస్థను సృష్టించారు

-   పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్న తీరు సమాజానికే ప్రమాదకరం

-   పౌరసమాజం దీనిపై తక్షణం గళం ఎత్తాలి

:   వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి 


గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, పార్టీనేత తురకా కిషోర్‌లను పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి


-   ఆధారాలు లేకుండా ముందుగా సిద్దం చేసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం కేసులు

-   తాము లక్ష్యంగా చేసుకున్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలన్నదే లక్ష్యం

-   సోషల్ మీడియా యాక్టివీస్ట్‌ల నుంచి వైయస్ఆర్‌సీపీ నేతలకు వరకు ఇదే విధానం

:   వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం


గుంటూరు (ప్రజా అమరావతి):


ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత తురకా కిషోర్‌లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రెడ్‌బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...


గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్‌లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు. ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్‌లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్‌ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. 


-  రాజకీయ కక్షసాధింపులతోనే పాలన


మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్‌తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది. 


-   ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు


నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్‌కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. పోలీస్ స్టేషన్‌ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైయస్ఆర్‌సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు.

Comments