పేదల ఇళ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.

 *పేదల ఇళ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలి*



*జీవో 30 పై చర్యలు చేపట్టని  ప్రభుత్వం*


*రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా*


*బుల్డోజర్లతో కూల్చివేతలు ఆపాలి*


*అమరావతిని వేశ్యల రాజధానిగా కొందరు చిత్రీకరించటం దుర్మార్గం*


*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు*

   

  అమరావతి (ప్రజా అమరావతి);

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు వెంటనే జిఓ 30 ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వం పేదలకు అందిస్తానన్న ఇంటి స్థలాలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుతో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు ఇచ్చే అంశంపై జివో 30ను జనవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. అభ్యంతరకరమైన ప్రభుత్వ భూముల్లో నివాసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్ధీకరిస్తామని జివో 30లో పేర్కొన్నారు. నెల రోజుల్లో ఇళ్లు కేటాయిస్తామన్న ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం ఇంటింటికి ప్రచారం చేయకపోగా, ప్రజలే దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పెండిరగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పాలకోడేరు లాంటి చోట దరఖాస్తులు తీసుకోకుండా తిరస్కరించారన్నారు.  పేదలను ఆదుకునే పద్ధతి ఇది కాదని, ఇలా అయితే సంక్షేమం ముందుకుపోదని చెప్పారు. ప్రతి మండలంలో భూ సలహా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని, 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు నియమించలేదన్నారు. జివో 30 విడుదలైన తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పట్టాలు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవ్వకుండా కూల్చివేశారని గుర్తుచేశారు. వీటిని కూల్చిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కూల్చిన చోటే పేదలకు వెంటనే ఇళ్లు కట్టడం గానీ, ప్రత్యామ్నాయ ఇళ్లు కానీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు అవసరమైన వాటిపై ప్రచారం కల్పించకుండా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మెప్పుకోసం ప్రభుత్వ తన యంత్రాంగాన్ని మొత్తం యోగాంధ్రకు దించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ ఓటమికి 50శాతం మోడీని అనుసరించడమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వానికి మించి ప్రస్తుతం ప్రభుత్వం మోడీ భజన చేస్తోందని, ఇలా అయితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధాని కార్యక్రమం కోసం ఈ నెల 21న లక్షల మందిని వైజాగ్‌ తరలించడం సరికాదని, ఇది రాష్ట్ర అభివృద్ధికి సహకరించదన్నారు.  శ్రామికులకు కావలసింది యోగా కాదని, కనీసం వేతనం అమలు చేస్తేనే వారి ఆరోగ్యాలు బాగుంటాయని తెలిపారు. అలా కాకుండా 8 గంటల పనివిధానం బదులు 12 గంటలు పని చేయిస్తే ఆరోగ్యం బాగుంటుందా అని ప్రశ్నించారు. శ్రామికులు ప్రతిరోజు యోగానే చేస్తున్నారని అన్నారు. 


భూ మాఫియా, బుల్డోజర్‌ వ్యవస్థపై దృష్టి సారించాలి

రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా, బుల్డోజర్‌ వ్యవస్థపై దృష్టిపెట్టాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. తిరుపతిలో పేద, మధ్య తరగతి ప్రజలు నివాసిస్తున్న ఇళ్లను బులోడ్జర్‌తో కూల్చేశారని తెలిపారు. విజయవాడలోని శాతవాహన కళాశాల, అన్నపూర్ణ ధియేటర్‌ లను కూల్చేశారని పేర్కొన్నారు. శాతవాహన కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని డిమాండ్‌ చేశారు. ల్యాండ్‌ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నా చూసిచూడనట్లు ప్రభుత్వ యంత్రాంగం వాటికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తెనాలిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులను బహిరంగంగా అడ్డగోలుగా కొట్టారని తెలిపారు. రాష్ట్రమంత్రి టిజి భరత్‌ తండ్రి, మాజీ ఎంపి టిజి వెంకటేష్‌కు చెందిన రసాయనిక పరిశ్రమ నుంచి కాలుష్యం వెదజాల్లుతోందన్న ప్రజలపై దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. పోలీస్‌ యంత్రాంగం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందా? చట్టాన్ని ధిక్కరించి అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందా? అని ప్రశ్నించారు. అమాయకులు, బలహీనులపై చర్యలు తీసుకుంటూ బలవంతులు, పలుకుబడి ఉన్నవారిని వదిలేస్తారా? అని నిలదీశారు. ఈ సంస్కృతికి స్వస్తి చెప్పి,  ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలను కించపరిచిన వారిపై చర్యలు

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చట్ట సవరణ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అమరావతిలోని మహిళలపై కృష్ణంరాజు సాక్షి ఛానెల్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వ్యాఖ్యాతగా  వ్యవహరిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఇటువంటి వ్యాఖ్యలను ప్రోత్సాహించే విధంగా మాట్లాడటాన్ని ఖండిరచారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టబద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం, చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ఛానల్‌ సైతం ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యత తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా మహిళలను కించపరిచే విధంగా అనేక వ్యాఖ్యనాలు చేశారని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర రాజకీయ చర్చలే తప్పుదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన రాజకీయ సంస్కృతి కోసం సిపిఐ(యం) పోరాడుతుందని శ్రీనివాసరావు చెప్పారు.


గృహాంధ్ర, నివాసంధ్రపై శ్రద్ధ పెట్టాలి: సిహెచ్‌ బాబూరావు 

యోగాంధ్రపై పెట్టే శ్రద్ధ గృహాంధ్ర, నివాసంధ్రపై పెట్టాలని, కానీ అలాంటి పని ప్రభుత్వం చేయడం లేదని సిహెచ్‌ బాబూరావు అన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయిందని, ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2014-15లో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని, పెండిరగ్‌లో ఉన్న 2.5లక్షల ఇళ్లను పేదలకు కూటమి ప్రభుత్వం ఏడాది నుంచి ఇవ్వలేదన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోగా కొన్ని చోట్ల పేదలు నివాసిస్తున్న ఇళ్లు, కళాశాలలను అడ్డు అదుపు లేకుండా అర్ధరాత్రుళ్లు కూల్చివేస్తున్నారని తెలిపారు. టిడిపి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తనను కిడ్నాప్‌ చేశారని శాతావాహన కళాశాల ప్రిన్సిపాల్‌ చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ప్రకటన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నుంచి ఆదేశాలు ఇప్పించాలని టిడిపి ఎమ్మెల్యేలను డిమాండ్‌ చేశారు. జివో 30లో 150 చదరపు గజాల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం మెలికలు పెడుతోందన్నారు. అటవీశాఖ భూములను కేంద్రంతో చర్చించి కార్పొరేట్లకు అప్పగిస్తున్న ప్రభుత్వం రైల్వే భూముల్లో ఏళ్ల తరబడి నివాసం          ఉంటున్న పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నివాసంతోపాటు పలు నివాసాలు కృష్ణనదీ తీరాన ఉన్నాయని, అదే కృష్ణనదీ తీరాన ఉన్న విజయవాడలోని పేదలకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం ఏమిటని నిలదీశారు. పేదలకు ఇళ్లు, పట్టాలు ఇవ్వాలని, క్రమబద్ధీకరించాలని ఇప్పటికే తాము చేస్తున్న ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే నాలుగేళ్లల్లో ఇవి పూర్తవుతాయని చెప్పారు. శాతావాహన కళాశాలపై ముఖ్యమంత్రి విచారణ జరిపించి నాయకులపై చర్యలు తీసుకొని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని డిమాండ్‌ చేశారు.

Comments