*ఎన్నికల హామీలను 90 శాతం అమలు చేశాం*
*కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది*
*అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు*
*ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం*
*సుపరిపాలనలో- తొలి అడుగు కార్యక్రమం పట్ల ప్రజల స్పందన అద్భుతం*
*గత పాలకలు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు*
*వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలలో రూ. 3,200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు*
*సంక్షేమ పథకాలు అందాయా... ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఇంటింటీకీ వెళ్లి ఆరా తీస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
టెక్కలి. (ప్రజా అమరావతి ); కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని గురువారం టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు రెండో రోజు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొ న్నారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ పథకాలను అందించామని ప్రజలకు తెలిపారు. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ వంటి అంశాలను వివరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నామని, ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని హమీ ఇచ్చారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇంటింటీకి సంక్షేమం, వాడవాడల అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు.
*ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 90 శాతం అమలు చేశాం*
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం అమలు చేశామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లను సంవత్సరానికి రూ.34 వేల కోట్లు అందిస్తున్నామని తెలిపారు. మత్య్సకార భరోసా కింద రూ.250 కోట్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది లబ్ధిదారులకు పథకం అందచేశామన్నారు. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వాటి పరీక్షలు పూర్తిచేశామని, మరి కొద్ది రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5లకే పేదవాడి ఆకలి తీరుస్తున్నామని, రూ.4 వేలు వృద్దాప్య , వితంతు పింఛన్లు అందిస్తున్నామని, రూ. 6 వేలు దివ్యాంగ పంఛన్లు, రూ.10 వేలు డయాలసిస్ రోగులకు అందిస్తున్నామని, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు ఇస్తుందని. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతులకు ఖాతాల్లో జమ చేయడం జరుగతుందని అన్నారు.
*మానవత్వం లేని వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండే అర్హత లేదు*
పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి మానవత్వం లేదని, అలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో రూ.3,200 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. భూ సర్వే పేరుతో రాష్ట్రంలో భూ సమస్యలు సృష్టించారని, వాటన్నింటినీ పరిష్కారం చేస్తున్నామని చెప్పారు . అదేవిధంగా 3 లక్షల పింఛన్లు తొలగించారని, వాటిని మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా అని చెప్పి రూ. 7 వేలు ఇచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ . 10 లక్షలు కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని, సమర్థవంతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాలేదని చెప్పారు.
addComments
Post a Comment