స్ప్రీ పధకాన్ని సద్వినియోగం చేసుకోండి.

 స్ప్రీ పధకాన్ని సద్వినియోగం చేసుకోండి


అమరావతి (ప్రజా అమరావతి);

      ఉత్తరాంధ్ర ప్రాంత యజమానలు స్ప్రీ పథకాన్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలి అని ESI కార్పొరేషన్ ఉప ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ ఇంచార్జి సౌమేంద్ర కుమార్ సాహు గారు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రివర్యులు డాక్టర్ మనుక్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్ 196వ సమావేశంలో స్ప్రీ 2025 (ఉద్యోగులు, యాజమాన్యాల నమోదును ప్రోత్సహించే పథకం)ను కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐఐసీ) ఆమోదించిందని తెలిపారు. ఈఎస్ఐ చట్టం ప్రకారం సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడమే ఈఎస్ఐసీ ఆమోదించిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్ (స్ప్రీ) 2025 లక్ష్యమన్నారు. ఈ పథకం 2025 జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని యాజమాన్యాలు, ఒప్పంద, తాత్కాలికంగా పనిచేస్తున్న వారితో సహా ఉద్యోగులందరూ ఎలాంటి తనిఖీలు లేదా పాత బకాయిలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుంది.

స్ప్రీ 2025లో చేపట్టే కార్యక్రమాలు

తమ సంస్థలు, ఉద్యోగులను ఈఎస్ఐసీ పోర్టల్, శ్రామ్ సువిధ, ఎంసీఏ పోర్టల్ ద్వారా డిజిటల్ గా నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి చందా, ప్రయోజనం వర్తించదు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి సంబంధించిన రికార్డుల తనిఖీలు నిర్వహించరు. పాత రికార్డుల గురించి అడగరు. జరిమానాల భయాన్ని తొలగించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా స్వచ్చందంగా నమోదు చేసుకొనేలా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. స్ప్రీ పథకం ప్రారంభించడానికి ముందు నిర్దిష్ట కాలవ్యవధిలో నమోదు చేసుకోకపోతే.. చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. లేదా పాత బకాయిలు చెల్లించాల్సి వచ్చేది. ఈ అడ్డంకులను తొలగించి... నమోదు కాని ఇతర సంస్థలు, కార్మికులను సైతం ఈఎస్ఐ పరిధిలోకి తీసుకువచ్చి, సమగ్ర సామాజిక భద్రతను అందించడమే స్ప్రీ 2025 లక్ష్యం. స్ప్రీ 2025 ప్రారంభంతో సమ్మిళితమైన, సామాజిక భద్రతను అందించే పురోగమన సమాజం దిశగా కార్మిక రాజ్య బీమా సంస్థ ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసి పాత బకాయిల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా తమ శ్రామిక శక్తిని క్రమబద్దీకరించుకొనేలా యాజమాన్యాలను ప్రోత్సహిస్తుంది. అలాగే మరింత మంది కార్మికులను ముఖ్యంగా కాంట్రాక్టు రంగాల్లో పని చేసేవారు ఈఎస్ఐ చట్టం ద్వారా అవసరమైన ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. భారత్ లో సంక్షేమ కేంద్రక కార్మిక వ్యవస్థ దార్శనికతకు అనుగుణంగా దాని పరిధిని బలోపేతం చేసుకోవడానికి, సార్వత్రిక సామాజిక భద్రత అనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉందన్నారు. దీన్ని  ఉత్తరాంధ్ర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments