*పనిచేసే వారికే పదవులు ఇస్తాం, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు*
*ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితమే ఈరోజు మన అధికారం*
*నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం... వినడానికి సిద్ధంగా ఉన్నాం*
*నెల్లురు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్*
నెల్లూరు (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి, కష్టపడేవారికే పదవులు ఇస్తాం, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తిలేదు, కేడర్ ను బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. గతంలో మాదిరి మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేం, 4నెలలకోసారి యావత్ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగనీయద్దు, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటాం. చంద్రబాబు కూడా చెబితే వింటారు, నాలుగోసారి సిఎం అయినా వినడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నెలాఖరులోగా ఎఎంసిలు, దేవాలయ కమిటీలు పూర్తిచేస్తాం. కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ. సొంత కార్యకర్తలను కారుకింద తొక్కేసిన నేత రాష్ట్రంలో ఉన్నారు. కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా జగన్ కి మనస్సు రాలేదు. అదే
చంద్రబాబు గారు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాట జరిగితే ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పారు. మనకి వాళ్లకు వ్యత్యాసం అదే. ఈరోజు మన అధికారం వెనుక ఎంతోమంది త్యాగాలు దాగి ఉన్నాయి. బాబు గారిని 53రోజులు జైలుకు పంపి వేధించారు, పోలీసులు నాపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి ముందుకు సాగాలి.
*ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి*
యువగళం పాదయాత్రలో చాలామంది నాతో నడిచారు, మార్పు నెల్లూరు నుంచే మొదలైంది, పాదయాత్రలో ప్రధానంగా నన్ను పనిచేసిన వారిని గుర్తించాలని కోరారు, సభ్యత్వం, మన టిడిపి వంటి పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన ఉత్తమ కార్యకర్తలతో గత ఏడాదికాలంగా సమావేశమవుతున్నా. నాయకులు కార్యకర్తల స్వరం వినాలి, కార్యకర్తే అధినేత అని నమ్మి వారికి పెద్దపీట వేస్తున్నాం. 2013నుంచి పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలన్నీ ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ వెళ్లాలి. ప్రతిపక్షంలో ఉండగా టెక్నాలజీతో జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. గత ఏడాది కాలంలో సభ్యత్వం తర్వాత సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం మాత్రమే ఇచ్చాం. కార్యకర్తలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
*ఇబ్బందులున్నా హామీలు అమలుచేస్తున్నాం*
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఒకే ఒక్క జిఓతో 10వేలకోట్లు తల్లుల ఎకౌంట్లో వేశాం. కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలి. డబ్బులివ్వడమే కాదు, తల్లులను గౌరవించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి, కలసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం జగన్ పై కంటే 5రెట్లు ఎక్కువగా పార్టీలో పోరాడతా. నాలుగుగోడల మధ్య సమస్యలు చర్చిద్దాం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడదాం.బాబు గారు నియోజకవర్గాలకు వెళ్లినపుడు కూడా కార్యకర్తలను కలుస్తున్నారు, పార్టీ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. నిరంతరం పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లందే సమస్యలు తెలియవు.
*సుపరిపాలనలో – తొలి అడుగు విజయవంతం చేయండి*
సుపరిపాలనలో – తొలి అడుగు విజయవంతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. మెగా డిఎస్సీలో 16,347 పోస్టులు భర్తీచేస్తున్నాం, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పద్ధతి ప్రకారం భర్తీచేస్తాం. గత 12నెలల్లో అయిదేళ్లలో రాని కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పుడు లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. మంత్రివర్గంలో 17మంది కొత్తవాళ్లు ఉన్నారు, అయినా మంత్రులందరం తరచూ కూర్చొని క్షేత్రస్థాయి సమస్యలు తెలుసు కుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment