సీఎం చంద్రబాబుతోనే బీసీల భవిష్యత్తుకు భరోసా.

 *సీఎం చంద్రబాబుతోనే బీసీల భవిష్యత్తుకు భరోసా



 *రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత* 


 తిరుపతి (ప్రజా అమరావతి ):  టీడీపీతోనే బీసీలు ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.  బీసీల భవిష్యత్తుకు భరోసా కలిగేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీసీ ఆత్మ గౌరవ భరోసా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్ తో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయ, సామాజిక స్వేచ్ఛా స్వాతంత్ర్య లభించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకతో బీసీలకు స్వర్ణయుగం మొదలైందన్నారు. బీసీలను గత వైసీపీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడిందన్నారు. బీసీ ద్రోహి జగన్ అని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాల పూర్తి చేయకుండా వదిలేసిందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 26 జిల్లాల్లోనూ బీసీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. బీసీ నాయకులకు కీలక మంత్రిత్వ శాఖలను, బాధ్యతలను అప్పగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్, పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, పలు రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ నేతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments