*విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం*
- సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభవృద్ధిలో పయనం
- ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం
- ఎన్నికల హమీలను తుచాతప్పకుండా అమలు చేసి చూపుతున్నాం
- త్వరలోనే అన్నదాత సుఖీభవ నగదు జమ అవుతుంది
- వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను పక్కదారి పట్టించారు
- సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది
- "సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి. (ప్రజా అమరావతి );- వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చి, విధ్వంసం సృష్టించారని, నేడు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి,పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కరపత్రాలను ప్రజలకు అందించారు. . ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వార్డు నాయకులకు, అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
*అభివృద్ధే లక్ష్యంగా కూటమి పార్టీల ముందడుగు*
రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా మూడు కూటమి పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే రాబోవు నాలుగేళ్ళలో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. ప్రజలు కూటమి పార్టీపై పెట్టుకున్న ఆకాంక్షలను మనం కాపాడుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం మన బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. సంక్షేమం అంటే ఏంటో చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేస్తున్నామని, ఐటీ రంగంలో నూతన ఓరవడికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పడం కూడా చాలా ముఖ్యమని, రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకుంటు, 2014-19 సంవత్సర సమయంలో మంచి పరిపాలన అందించామని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందని, నేరాలు వీపరీతంగా పెరిగాయని, లా అండ్ ఆర్డర్ పై పట్టు కోల్పోయి , విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను పక్కదారి పట్టించి, జేబులు నింపుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 85 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేసి విజయవంతంగా పూర్తిచేసామన్నారు.
*రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం*
2024 ఎన్నికల్లో ప్రజలు సరైన సమయంలో... సరైన నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చేలా చేసారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ, పునర్నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఎప్పుడూ చేయలేదని, కేంద్రం ప్రభుత్వం తగిన ప్రోత్సాహాకాలను మన రాష్ట్రానికి అందిస్తుందని అన్నారు.
ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదని, ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు తెలియజేశారు. సేవారంగం, పారిశ్రామికరంగం, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచామని, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతుకూ రూ.20 వేలు నగదును అందచేస్తున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధికి 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని, పాడి రైతుల కోసం రూ.2 లక్షల సబ్సిడీతో పాడి షెడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించామన్నారు. మత్స్యకారులకు ఉపాధిని దెబ్బతీసే 217 జీవో ను రద్దు చేసి , మత్స్యకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం కింద రూ. 259 కోట్ల రూపాయలు ఇప్పటికే అందచేశామని తెలిపారు.
*పథకాల అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు*
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజల మన్ననలను చూరగొందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రజలలో మరింత నమ్మకాన్ని సాధించిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ చేసామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేస్తున్నామని, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసామని తెలిపారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.47,456 కోట్లు కేటాయించిందని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని మంత్రి తెలిపారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డ్వాక్రా మహిళలకు రూ.28 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు, 13 నుంచి 11 శాతానికి వడ్డీ తగ్గించి స్త్రీనిధి ద్వారా రూ. 4,500 కోట్లు రుణాలు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు పైబడి ఒప్పందాలు జరిగాయని, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు.
addComments
Post a Comment